గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు.. హైకోర్టు డివిజన్ బెంచ్ ఏం చెప్పింది?
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను సక్రమంగా నిర్వహించడంలో టీఎస్‌పీఎస్సీ విఫలమయ్యిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
గ్రూప్-1 ప్రిలిమ్స్ సమయంలో బయోమెట్రిక్ ఉపయోగించలేదని.. నోటిఫికేషన్‌లో పేర్కొన్నా.. పరీక్ష రోజు మాత్రం అమలు చేయలేదని ముగ్గురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో గ్రూప్-1 పరీక్షను మరోసారి రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. కాగా, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును టీఎస్‌పీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సవాలు చేసింది. ప్రిలిమ్స్ రద్దును సవాలు చేస్తూ ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్‌ను హైకోర్టు కొట్టేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను సక్రమంగా నిర్వహించడంలో టీఎస్‌పీఎస్సీ విఫలమయ్యిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను రూపొందించిన నిబంధనలనే కమిషన్ పాటించలేక పోయిందని, పరీక్షను సరిగా నిర్వహించలేదని మండిపడింది. ఈ మేరకు ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు చెప్పింది. ఈ సారి నోటిఫికేషన్ నుంచి బయోమెట్రిక్ తీసివేయడం కాదని.. తప్పకుండా అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ తీసుకొని పరీక్షను పకడ్బంధీగా నిర్వహించాలని చెప్పింది.
503 పోస్టుల భర్తీకి నిరుడు టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలిసారి గతేడాది అక్టోబర్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం కారణంగా ఆ పరీక్షను రద్దు చేసింది. తిరిగి ఈ ఏడాది జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. కాగా, పరీక్ష లోపభూయిష్టంగా నిర్వహించారని కొంత మంది కోర్టును ఆశ్రయించడంతో దాన్ని కూడా రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. ఇప్పటికి రెండు సార్లు ప్రిలిమ్స్ పరీక్ష రద్దు కాగా.. తాజాగా మరోసారి నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
♦