లాంగ్ జంప్, హైజంప్ కాదు.. బాపూరావుది ట్రిపుల్ జంప్

ఫిరాయింపులకే కొత్త అర్థం చెప్పారు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు. ఆయన ఫిరాయింపు ఈ ఎన్నికల్లో మాస్టర్ పీస్ అని చెప్పాలి.

Advertisement
Update:2023-11-01 19:41 IST

ఎన్నికల వేళ ఫిరాయింపులకు కొత్త అర్థం చెబుతున్నారు తెలంగాణ నేతలు. అక్కడ టికెట్ రాకపోతే ఇక్కడ, ఇక్కడ చోటు లేకపోతే అక్కడ.. కాదంటే మూడో ప్రత్యామ్నాయం కూడా చూసుకుంటున్నారు. పార్టీలు కూడా ఎవ్వర్నీ ఎక్కడా నిరాశపరచకుండా వచ్చినోళ్లకి వచ్చినట్టు కండువాలు కప్పేస్తున్నాయి. అయితే ఈ ఫిరాయింపులకే కొత్త అర్థం చెప్పారు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు. ఆయన ఫిరాయింపు ఈ ఎన్నికల్లో మాస్టర్ పీస్ అని చెప్పాలి.

బోథ్ నియోజకవర్గానికి వరుసగా రెండు సార్లు బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు బాపూరావు. ఈసారి హ్యాట్రిక్ కొడదామనుకున్నారు కానీ బీఆర్ఎస్ టికెట్ నిరాకరించింది. అనిల్ జాదవ్ కి అక్కడ బీఆర్ఎస్ టికెట్ ఖాయమైంది. దీంతో బాపూరావు కేసీఆర్ పై అలిగారు. వెంటనే కాంగ్రెస్ తో మంతనాలు జరిపారు. రేవంత్ రెడ్డిని కలిసి బొకే అందించారు. దాదాపుగా కండువా కప్పుకుంటారు అనుకున్న టైమ్ లో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ విడుదలైంది. హస్తం పార్టీ కూడా బోథ్ కి ఆల్టర్నేట్ చూసుకుంది. దీంతో బాపూరావు మళ్లీ షాకయ్యారు. వెంటనే మరో జంప్ కొట్టారు, వచ్చి బీజేపీ కాంపౌండ్ లో చేరారు.

ఢిల్లీలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో రాథోడ్ బాపూరావు కాషాయదళంలో చేరారు. అయితే ఇక్కడ కూడా ఓ చిక్కు ఉంది. బీజేపీ ఫస్ట్ లిస్ట్ లో బోథ్ నియోజకవర్గ అభ్యర్థిగా సోయం బాపూరావుని ప్రకటించింది. ఇప్పుడు రాథోడ్ రావడంతో సోయంను పక్కనపెడతారనే ప్రచారం మొదలైంది. ఇంకా బీఫామ్ లు ఇవ్వలేదు కాబట్టి.. చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చు. అందుకే ఆయన కాషాయ కండువా కప్పుకున్నారని అంటున్నారు. మొత్తమ్మీద బీఆర్ఎస్ టు బీజేపీ వయా కాంగ్రెస్ అన్నట్టుగా సాగింది రాథోడ్ బాపూరావు ప్రయాణం. 

Tags:    
Advertisement

Similar News