జాబ్ క్యాలెండర్ కోసం పోరాటం.. నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండ
ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేటీఆర్.
ఎన్నికల వేళ నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి, జాబ్ క్యాలెండర్ అంటూ అరచేతిలో వైకుంఠం చూపించి, గెలిచిన తర్వాత వారిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు చేస్తున్న పోరాటానికి ఆయన మద్దతు తెలిపారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. మొదటి కేబినెట్ భేటీలో మెగా డీఎస్సీ అని చెప్పి నిరుద్యోగుల్ని దగా చేశారంటూ మండిపడ్డారు కేటీఆర్.
10 రకాల ఉద్యోగాల భర్తీ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేస్తామంటూ తేదీలతో సహా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఆ 10 పరీక్షల్లో ఒక్కదానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, వెంటనే ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేటీఆర్.
గతంలో గ్రూప్–1కు సంబంధించి తమ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌కు కేవలం 60 ఉద్యోగాలు మాత్రమే కలిపి, ఆ ఘనతను వారి ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారని ఎద్దేవా చేశారు కేటీఆర్. పోస్ట్ ల సంఖ్య మరింత పెంచాలని డిమాండ్ చేస్తే సాంకేతిక కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారని అన్నారు. గ్రూప్– 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారిలో.. ఒక పోస్ట్ కి 100మందిని మెయిన్స్ పరీక్ష కోసం ఎంపిక చేయాలని గతంలో మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేసిన సంగతి గుర్తు చేశారు కేటీఆర్. డిప్యూటీ సీఎం అయ్యాక భట్టి విక్రమార్క ఆ విషయాన్ని మరచిపోయారని విమర్శించారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేటీఆర్.