బీఆర్‌ఎస్ ఎన్నికల మోడ్ లోకి వెళ్ళినట్టేనా..?

తెలంగాణ వ్యాప్తంగా జరిగిన బీఆర్‌ఎస్ సమావేశాలు ఎన్నికల సన్నాహక సమావేశాలను తలపించాయి. ఎన్నికలకు చాలా ముందుగానే బీఆర్‌ఎస్ నాయకత్వం కార్యకర్తలను సిద్దం చేస్తోంది.

Advertisement
Update:2023-04-26 11:39 IST

మహారాష్ట్రలో భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల శంఖారావం మోగించిన మర్నాడే తెలంగాణాలో కూడా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) భారీ సభలు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమావేశాల్లో నాలుగు లక్షల మంది బీఆర్‌ఎస్ కార్యకర్తలు హాజరయ్యారని అంచనా.

సిరిసిల్ల నియోజకవర్గ సమావేశంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో పార్టీ ఇప్పటికే రాజకీయ అగ్గి రాజేసిందని అన్నారు. ''ఇది దేశవ్యాప్తంగా విస్తరించి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ రెండింటినీ నేలమట్టం చేస్తుంది. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుతో తెలంగాణలో విప్లవం ప్రారంభమైంది. ఈ విప్లవం ఇప్పుడు మహారాష్ట్రలో ప్రవేశించింది. సమీప భవిష్యత్తులో ఖచ్చితంగా BRS దేశ‌ ప్రజలందరినీ ఏకం చేస్తుంది. కాంగ్రెస్, బిజెపి రెండింటినీ దెబ్బతీస్తుంది'' అని కేటీఆర్ అన్నారు.

బంగారు తెలంగాణ అభివృద్ధి నమూనాను దేశానికి పరిచయం చేసేందుకు బీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేశామని, తెలంగాణ అభివృద్ధి నమూనా గుజరాత్‌ మోడల్ లాగా బూటకం కాదని రుజువు చేస్తామ‌ని ఆయన అన్నారు.

నియోజకవర్గ స్థాయిలో జరిగిన ఈ ‘మినీ ప్లీనరీలు’ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలని తీర్మానించాయి. జాతీయ రాజకీయాల్లో పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని ఈ సమావేశాల్లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులతో సహా పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

ఈ సమావేశాల అనంతరం విడుదల చేసిన ప్రకటనలో కేటీఆర్, నియోజకవర్గ స్థాయి సమావేశాలను విజయవంతంగా నిర్వహించినందుకు పార్టీ నాయకులను అభినందించారు. ఈ సమావేశాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతిపక్ష పార్టీల వైఫల్యాలపై పార్టీ కార్యకర్తలకు నిర్మాణాత్మక సందేశాన్ని అందజేశామని చెప్పారు.

మొత్తం 119 నియోజకవర్గాల్లో దాదాపు నాలుగు లక్షల మంది పార్టీ కార్యకర్తలు పాల్గొన్న ఈ సమావేశాలు ప్లీనరీ సమావేశాలలాగా జరిగాయి. దేశ రాజకీయ చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలుస్తుందని బీఆర్‌ఎస్ నాయకులు చెప్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అనేక తీర్మానాలు చేయడం ద్వారా 119 నియోజకవర్గాల్లోని పార్టీ కార్యకర్తలు కేంద్రానికి వ్యతిరేకంగా బలమైన సందేశం ఇచ్చారని కేటీఆర్ అన్నారు.

సిద్దిపేట నియోజకవర్గ సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రసంగిస్తూ ప్రతిపక్ష పార్టీల రాజకీయ జిమ్మిక్కులకు అతీతంగా బీఆర్‌ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తుందన్నారు.

వనపర్తిలో వ్యవసాయ శాఖ మంత్రి ఎస్‌ నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. 2024 పార్లమెంట్‌ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు కీలకమని అన్నారు. కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంటే తెలంగాణకు వచ్చే రాజకీయ పర్యాటకులు మత విభేదాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో హైదరాబాద్‌ ఇన్‌ఛార్జ్‌ దాసోజు శ్రవణ్‌ నేతృత్వంలో పాతబస్తీలోని చాంద్రాయణగుట్టలోని ఆజం ఫంక్షన్‌ హాల్‌తో సహా 11 వేదికలపై పార్టీ సమావేశాలు జరిగాయి.

మొత్తానికి నిన్న తెలంగాణ వ్యాప్తంగా జరిగిన బీఆర్‌ఎస్ సమావేశాలు ఎన్నికల సన్నాహక సమావేశాలను తలపించాయి. ఎన్నికలకు చాలా ముందుగానే బీఆర్‌ఎస్ నాయకత్వం కార్యకర్తలను సిద్దం చేస్తోంది. 

Tags:    
Advertisement

Similar News