మెగా యూత్ మెంబర్‌షిప్ డ్రైవ్‌కు రంగం సిద్ధం చేస్తున్న బీఆర్ఎస్!
అధినేత కేసీఆర్ సూచనల మేరకు త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ మెగా యూత్ మెంబర్‌షిప్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసి.. మరో సారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు మరి కొన్ని వారాలే సమయం ఉండటంతో క్షేత్ర స్థాయిలో పార్టీ పరంగా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు ప్రతీ నియోజకవర్గంలో విజయవంతంగా నిర్వహించారు. త్వరలోనే యువత కోసం కూడా సమ్మేళనాలు ఏర్పాటు చేయనున్నారు.
బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో దాదాపు 63 లక్షల మంది రిజిస్టర్డ్ సభ్యులు ఉన్నారు. కాగా, వీరిలో 35 నుంచి 70 ఏళ్ల వయసు ఉన్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు. వీరితో పోలిస్తే 18 నుంచి 35 ఏళ్ల లోపు వారు 25 శాతం తక్కువగా ఉన్నారు. పార్టీ పరంగా ఈ ఏజ్ గ్రూప్ సభ్యత్వాలను పెంచాలని అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశించారు. అధినేత సూచనల మేరకు త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ మెగా యూత్ మెంబర్‌షిప్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. ఇందు కోసం పార్టీ పరంగా రంగం సిద్ధం చేస్తున్నారు.
జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం, పార్టీ పరంగా నిర్వహించనున్నారు. 21 రోజుల పాటు జరుగనున్న ఈ సంబరాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజల భాగస్వామ్యంతో ఈ ఉత్సవాలు విజయవంతం చేయడానికి ప్రణాళిక కూడా సిద్ధం చేశారు. అందుకే.. ఉత్సవాలు ముగిసిన అనంతరం మెగా యూత్ మెంబర్‌షిప్ డ్రైవ్ చేపట్టాలని పార్టీ భావిస్తోంది. జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలో ఈ మెగా యూత్ డ్రైవ్ ప్రారంభం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
విద్యార్థులు, యువతను భారీగా పార్టీ సభ్యులుగా చేర్పించడమే కాకుండా.. ప్రభుత్వ విజయాలను, అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారికి వివరించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం 9 ఏళ్లలో సాధించిన ప్రగతిని కూడా వారికి వివరించాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో 10 నుంచి 17 ఏళ్ల వయసులో ఉన్న వారికి ఇప్పుడు ఓటు హక్కు వచ్చి ఉంటుంది. వారిలో కొంత మంది 2018 ఎన్నికల్లో ఓటేసి ఉంటారు. కానీ, ఇప్పుడు ఆ వర్గమంతా బీఆర్ఎస్‌కు ఓటేసేలా చూసే బాధ్యతను ఆయా నియోజకవర్గాల ఇంచార్జులకు, కార్యకర్తలకు అప్పగించనున్నారు.
కేవలం సభ్యులుగా నమోదు చేయడమే కాకుండా.. యువ ఓటర్లను బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే బాధ్యతను కూడా అప్పగిస్తారు. నియోజకవర్గాల వారిగా కొత్త ఓటర్లను గుర్తించి.. వారి కోసం ప్రత్యేక ప్రణాళికను కూడా సిద్ధం చేయనున్నారు. 9 ఏళ్లలో ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు, ప్రైవేటు రంగంలో వచ్చిన ఉద్యోగాలు భారీగా ఉన్నాయి. ప్రభుత్వ పరంగా 2.3 లక్షలు, ప్రైవేటు రంగంలో 17 లక్షల మేర ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. వీటన్నింటినీ యువతకు వివరించాలని, తద్వారా వారు బీఆర్ఎస్‌కు ఓటేసేలా చూడాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకు యూత్ మెగా మెంబర్‌షిప్ డ్రైవ్, యువ సమ్మేళనాలను వేదికగా చేసుకోవాలని భావిస్తోంది.