ఈనెల 30న సోలాపూర్ లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ

సోలాపూర్ లో బీఆర్ఎస్ సభ మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద కుదుపు అవుతుందని అంటున్నారు నేతలు. భారీగా చేరికలుంటాయని చెబుతున్నారు.

Advertisement
Update:2023-07-14 11:10 IST

మహారాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ సంచలనం సృష్టించబోతోంది. ఇప్పటికే మహారాష్ట్రలోని వివిధ పార్టీల నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీఆర్ఎస్ లో చేరారు. కొంతమంది కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ లో చేరి గులాబి కండువా కప్పుకున్నారు. అయితే ఈదఫా మరిన్ని సంచలనాలకు భారత రాష్ట్ర సమితి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎన్సీపీ నుంచి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరేందుకు సుముఖంగా ఉన్నారని.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెల 30న జరిగే బహిరంగ సభలోనే ఆ చేరికలు ఉంటాయని చెబుతున్నారు.

భారీ ఏర్పాట్లు..

ఈనెల 30న సోలాపూర్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ మంత్రి హరీష్ రావు చూస్తున్నట్టు సమాచారం. దాదాపు 2లక్షలమందిని ఈ సభకు తరలించాలని ప్రయత్నిస్తున్నారు. సభాస్థలం ఎంపిక మరికొన్ని రోజుల్లో ఖరారవుతుంది. ఈనెల 20న మంత్రి హరీష్ రావు సోలాపూర్ లో పర్యటించి సభా స్థలం ఎంపిక చేస్తారని అంటున్నారు. వారం రోజులపాటు అక్కడే మకాం వేసి సభ ఏర్పాట్లు, జన సమీకరణ వ్యవహారాలను పర్యవేక్షిస్తారని తెలుస్తోంది.

భారీగా చేరికలు..

సోలాపూర్ లో బీఆర్ఎస్ సభ మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద కుదుపు అవుతుందని అంటున్నారు నేతలు. భారీగా చేరికలుంటాయని చెబుతున్నారు. ఎన్సీపీ ఎమ్మెల్యేల చేరిక ఖరారు అయితే అది నిజంగా సంచలనమే. మాజీ ఎంపీ సహా, మరికొంతమంది స్థానిక నేతలు కూడా ఈ సభలోనే గులాబి కండువా కప్పుకోబోతున్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీకి 2024లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ ఎన్నికల్లో మొత్తం 288 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీకి దిగాలని చూస్తోంది. ఆషామాషీ అభ్యర్థులతో కాకుండా.. బలమైన నేతలతోనే మహారాష్ట్రలో అరంగేట్రం చేయాలనుకుంటోంది బీఆర్ఎస్. అందుకే చేరికలపై ఫోకస్ పెట్టింది. మహారాష్ట్రలోని మరఠ్వాడ, విదర్భ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో తెలంగాణ మోడల్ గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. స్థానికంగా చర్చ జరిగేలా చూశారు. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గులాబి జెండా పాతడమే తరువాయి.

Tags:    
Advertisement

Similar News