రూ.100 కోట్లలో రైతుబంధు.. క్లారిటీ ఇచ్చిన మల్లారెడ్డి
తన కుటుంబానికి 600 ఎకరాల భూమి ఉందని తానే చెప్పానన్నారు. అందులో 400 ఎకరాల భూమి కాలేజీల పేరిటే ఉందని.. అగ్రికల్చర్ కానప్పుడు రైతుబంధు ఎలా పడుతుందని ప్రశ్నించారు.
మల్లారెడ్డికి వందల కోట్లలో రైతు బంధు. ఇది తెలంగాణలో ఎన్నికల టైమ్‌లో వినిపించిన ప్రధాన ఆరోపణల్లో ఒకటి. ఇది జనాల్లోకి బలంగా వెళ్లింది. ఆ టైమ్‌లో బీఆర్ఎస్ సర్కార్ సైతం ఈ ఆరోపణలను తిప్పికొట్టడంలో ఫెయిల్ అయింది.
అయితే తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి ఈ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు. తన కుటుంబానికి 600 ఎకరాల భూమి ఉందని తానే చెప్పానన్నారు. అందులో 400 ఎకరాల భూమి కాలేజీల పేరిటే ఉందని.. అగ్రికల్చర్ కానప్పుడు రైతుబంధు ఎలా పడుతుందని ప్రశ్నించారు. మంచి మనిషిగా పేరున్న సీతక్క కూడా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇలా ఆరోపణలు చేసి బద్నాం చేయడం ఎందుకన్నారు మల్లారెడ్డి. సీఎం రేవంత్ మంత్రులను ఎగదోస్తున్నాడని ఆరోపించారు. ఆన్‌లైన్‌లో చూస్తే తనకు ఎంత రైతుబంధు పడుతుందనే విషయం స్పష్టమవుతుంది కదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం దగ్గర వివరాలుంటే విడుదల చేయాలన్నారు.
మరో 200 ఎకరాలు ఫ్యామిలీలోని ఇతర మెంబర్ల పేరిట ఉందని.. తనది ఉమ్మడి ఫ్యామిలీ అని చెప్పారు మల్లారెడ్డి. తనకు మరో ఇద్దరు సోదరులు ఉన్నారని.. తనది ఉమ్మడి ఫ్యామిలీ అని చెప్పుకొచ్చారు. ఒక్కొక్కరి పేరిట 20 నుంచి 30 ఎకరాలకు మించి భూమి లేదని స్పష్టంచేశారు.