అది విలీనం, ఇవి ఫిరాయింపులు.. కేటీఆర్ క్లారిటీ
కాంగ్రెస్ లో చేరేవారు బీఆర్ఎస్ పార్టీతోపాటు, పదవులకు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు కేటీఆర్. వారితో రాజీనామాలు చేయించకుండా కాంగ్రెస్ లోకి తీసుకెళ్లడం సరికాదంటున్నారు.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపులు హాట్ టాపిక్ గా మారాయి. ఆరుగురు ఎమ్మెల్యేలు, మరో ఆరుగురు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఈ జంపింగ్ లు ఇక్కడితో ఆగేలా లేవు. మరికొందర్ని కూడా కాంగ్రెస్ తమవైపు లాగేసుకోడానికి రెడీగా ఉంది. అయితే ఈ ఫిరాయింపులతో తాము భయపడేది లేదంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆరుగురు ఎమ్మెల్సీల ఫిరాయింపుపై ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు.
పార్టీల భావజాలం నాయకులకు నచ్చకపోవచ్చు, అలాంటి సందర్భాల్లో వేరే పార్టీలోకి వారు వెళ్లొచ్చు, దీన్ని ఎవరూ కాదనరు, కానీ ఆ వెళ్లే విధానమే సరిగా ఉండాలంటున్నారు కేటీఆర్. గతంలో బీఆర్ఎస్ లోకి కూడా కాంగ్రెస్ నేతలు వచ్చి చేరారని, అయితే వారంతా మూకుమ్మడిగా తమ లేజిస్లేటివ్ పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేశారని, అంటే.. అక్కడ ఫిరాయింపు అనే ప్రస్తావనే లేదన్నారు కేటీఆర్. అది విలీనం అని, పూర్తి రాజ్యాంగబద్ధంగా జరిగిన పార్టీ మార్పు అని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మాత్రం, వచ్చినవారిని వచ్చినట్టు రాజీనామాలు లేకుండానే పార్టీలో చేర్చుకుంటోందని, ఇది అక్రమం అని స్పష్టం చేశారు. చేరికలు అనేవి రాజ్యాంగబద్ధంగా జరగాలంటున్నారు కేటీఆర్.
కాంగ్రెస్ లో చేరేవారు బీఆర్ఎస్ పార్టీతోపాటు, పదవులకు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు కేటీఆర్. వారితో రాజీనామాలు చేయించకుండా కాంగ్రెస్ లోకి తీసుకెళ్లడం సరికాదంటున్నారు. నీతిసూత్రాలు చెప్పే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ.. ఇలా చేయడమేంటని నిలదీస్తున్నారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని పార్లమెంట్ లో ఘనంగా చూపించే రాహుల్ గాంధీ.. అదే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ఫిరాయింపుల్ని ప్రోత్సహించడమేంటని ప్రశ్నిస్తున్నారు కేటీఆర్.