ఆ రెండు అంశాలపై గవర్నర్ కి బీఆర్ఎస్ ఫిర్యాదు
పార్టీ ఫిరాయింపులతో రాజ్యాంగ హననం జరుగుతోందని గవర్నర్ కి వివరించారు బీఆర్ఎస్ నేతలు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్ లో చేర్చుకున్నారని వివరించారు.
తెలంగాణలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై కొంతకాలంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేరుగా వారు రాష్ట్ర గవర్నర్ కి ఫిర్యాదు చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగంపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు నేతలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నేతలు గవర్నర్ ని కలిశారు. కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.
బీఆర్ఎస్ కి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కేటీఆర్ ఆధ్వర్యంలో రాజ్ భవన్ కి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఆరోపించారు. హామీలు అమలు చేయాలని అడిగిన విద్యార్థుల మీద నిర్భంధం, అణిచివేత, అరెస్ట్ లు, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పారు. సిటీ సెంట్రల్ లైబ్రరీలో లాఠీ ఛార్జ్ చేశారని, ఓయూ విద్యార్థులపై దాడులు చేశారని.. తెలంగాణ ఉద్యమకాలంనాటి నాటి అణిచి వేత వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ కొనసాగిస్తోందని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ కు సంబంధించి కాంగ్రెస్ ఇచ్చిన ప్రకటనలు, హామీలను కూడా బీఆర్ఎస్ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఇక రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులతో రాజ్యాంగ హననం జరుగుతోందని గవర్నర్ కి వివరించారు బీఆర్ఎస్ నేతలు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్ లో చేర్చుకున్నారని వివరించారు. ఈ ఫిరాయింపులపై న్యాయపోరాటం చేస్తున్నట్టు తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ కి కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు. బీఆర్ఎస్ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్, నెలల వ్యవధిలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారని గవర్నర్ కి గుర్తు చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘన ఘటనలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు బీఆర్ఎస్ నేతలు. గవర్నర్ కే కాదు, త్వరలో రాష్ట్రపతికి కూడా ఈ విషయాలపై ఫిర్యాదులు చేస్తామన్నారు కేటీఆర్.