నిజాయితీగల పోలీసులు.. ప్రతీకార రాజకీయాల్లో బాధితులు

ఆంధ్రప్రదేశ్ సహా ఇతర ప్రాంతాల్లో సీనియర్ పోలీస్ అధికారులపై కక్షసాధింపులు జరుగుతున్నాయని అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వారిపై నమోదు చేసిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.

Advertisement
Update:2024-07-13 18:52 IST

వైసీపీ హయాంలో సీఐడీ డీజీగా పనిచేసిన ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పై ఇటీవల కేసు నమోదైన విషయం తెలిసిందే. విచారణ పేరుతో తనను సీఐడీ పోలీసులు హింసించారని, హత్యాయత్నం చేశారంటూ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ తో పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చడం సంచలనంగా మారింది. నిష్పక్షపాతంగా విధులు నిర్వహించిన ఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టడమేంటని బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నిస్తున్నారు. ఈ కేసు వ్యవహారంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డీజీపీ ర్యాంకులో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులపై కేసు పెట్టడమేంటని  అన్నారు. ఆ వార్త విని తాను షాక్ కి గురయ్యానని అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.


అసలు రఘురామ ఎలా గెలిచారు..?

రఘురామ కృష్ణంరాజుకి అబద్ధాలు ఆడటం అలవాటు అని అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 2021లో పార్లమెంటులో తనపై కూడా నిరాధార ఆరోపణలు చేశారని గుర్తు చేసుకున్నారు. పేదలకు విద్య అందించడం ఏమాత్రం ఇష్టం లేని రఘురామకృష్ణంరాజు.. ఎమ్మెల్యేగా ఎలా ఎన్నికయ్యారో అర్థం కావట్లేదని చెప్పారు. ప్రభుత్వం మారిన తర్వాత కేసు పెట్టడం దారుణం అన్నారు. ఈ అంశాన్ని అప్పట్లోనే కోర్టులు విచారించాయని చెప్పారు. అధికారం మారడం తప్ప మూడేళ్లలో ఏం జరిగిందని..? ఘటన జరిగిన మూడేళ్ల తర్వాత అకస్మాత్తుగా ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయాల్సి వచ్చిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ సహా ఇతర ప్రాంతాల్లో సీనియర్ పోలీస్ అధికారులపై కక్షసాధింపు చర్యలు జరుగుతున్నాయని అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వారిపై నమోదు చేసిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఈమేరకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లను కూడా ట్యాగ్ చేస్తూ ఆర్ఎస్పీ ట్వీట్ వేశారు. 

Tags:    
Advertisement

Similar News