నేడు బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశం
హాజరుకానున్న ఆ పార్టీ అధినేత కేసీఆర్.. వివిధ అంశాలపై దిశానిర్దేశం చేయనున్న గులాబీ బాస్
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ భవన్‌లో జరగనున్నది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొననున్నారు. కేసీఆర్ ఉద్యమ పంథాను ఎంచుకుని 2001లో బీఆర్‌ఎస్ ఏర్పాటు చేశారు. ఈ ఏప్రిల్ 27 నాటికి 24 ఏళ్లు పూర్తయి పాతికేళ్లలోకి అడుగుపెట్టనున్నది. ఈ సందర్భంగా చేపట్టాల్సిన కార్యాచరణపై సమీక్ష నిర్వహించనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, ఆవిర్భావ వేడుకలు, భారీ బహిరంగ సభ నిర్వహణ తదితర అంశాలపై కేసీఆర్ డ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతున్నది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆ పార్టీ విఫలమైంది. దీంతో అన్నివర్గాల ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని కేసీఆర్ ఏడాది కాలంగా పెద్దగా స్పందించలేదు. కానీ రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడటంపై సర్వత్రా నిరసన వ్యక్తమౌతున్నది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయని వాదన వినిపిస్తున్నది. దీనికితోడు స్థానిక సంస్థల ఎన్నికల వంటి వాటిపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది. ఈ 25 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ఎన్నో ఉత్థానపతనాలు చూసింది. అయినా అధినేత ఎన్నడూ అధైర్య పడలేదు. తెలంగాణ ప్రయోజనాలు, హక్కులను కాపాడటంలో బీఆర్‌ఎస్సే ముందున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదికి పైగా పాలనలో పురోగమనం కంటే తిరోగమనం దిశగా వెళ్తున్నది. రైతుబంధు, నియామకాలు, సంక్షేమ పథకాల అమలు, రుణమాఫీ, సాగునీరు, తాగునీరు అందించడంలో ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నది. మళ్లీ కేసీఆరే కావాలనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమౌతున్నది. ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం అనంతరం కేసీఆర్ ఏం మాట్లాడుతారు అనేదానిపై ఆసక్తి నెలకొన్నది.