బీఆర్ఎస్ తొలి విడత సమీక్షలు పూర్తి.. ఏం తేల్చారంటే..?
ఈ పార్లమెంటు సన్నాహాక సమావేశాలు ఆరంభం మాత్రమేనని, ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు మొదలవుతాయని చెప్పారు కేటీఆర్.
నిన్నటితో బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు పూర్తయ్యాయి. మొత్తం 17 నియోజకవర్గాలకు సంబంధించి తెలంగాణ భవన్ లో విడివిడిగా ఈ సమావేశాలు నిర్వహించారు. నాయకులతో మాట్లాడారు, కొన్నిచోట్ల అనధికారికంగా ఇన్ చార్జ్ లను ప్రకటించి వారిని పని చేసుకోవాలని సూచించారు. మొత్తమ్మీద ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ ఓటమిపై బలమైన చర్చ జరిగింది.
గ్యారెంటీ అనుకున్నాం కానీ...
లోక్ సభ నియోజకవర్గాల వారీగా జరిగిన సమీక్షల్లో ఓటమిపై నాయకులు స్పందించారు. గెలుపు గ్యారెంటీ అనుకున్నాం కానీ స్వల్ప తేడాతో ఓడిపోయామన్నారు. అభివృద్ధిపై దృష్టిపెట్టాం కానీ, అసత్య ప్రచారాన్ని ఆపలేకపోయామన్నారు. సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారమే పార్టీ ఓటమికి కారణం అని తేల్చారు. పారీ సంస్థాగత నిర్మాణంపై కూడా దృష్టిపెడతామని చెప్పారు. పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందని కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశాలతో ఒక విషయంలో క్లారిటీ వచ్చింది. బీఆర్ఎస్ ఓటమితో కుంగిపోలేదు. అలాగని ఈ ఓటమిని లైట్ తీసుకోలేదు. ఈ ఓటమితో మరింత రాటుదేలి ముందుకెళ్లాలనుకుంటోంది. సర్వీసింగ్ తర్వాత కారు ఫుల్ స్వింగ్ లోకి వస్తుందంటున్నారు నేతలు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా నిరూపిద్దామంటున్నారు.
పార్ట్-2
లోక్ సభ నియోజకవర్గాల వారీగా చర్చలు ముగిశాయి. త్వరలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరుగుతాయి. ఈ పార్లమెంటు సన్నాహాక సమావేశాలు ఆరంభం మాత్రమేనని, ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు మొదలవుతాయని చెప్పారు కేటీఆర్. అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలకు కేసీఆర్ హాజరయ్యే అవకాశాలున్నాయి. అయితే విడివిడిగా సమావేశాలు ఉంటాయా, లేక కొన్ని నియోజకవర్గాలను కలిపి ఒకేసారి సమావేశాలు నిర్వహిస్తారా అనేది తేలాల్సి ఉంది.