రేవంత్‌ రెడ్డిపై బ్రదర్ అనిల్ కుమార్ పోటీ?

కాంగ్రెస్‌లో విలీనానికి అడ్డుపడ్డాడని రేవంత్‌పై షర్మిల తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రేవంత్‌ను టార్గెట్ చేసినట్లు సమాచారం.

Advertisement
Update:2023-10-13 07:53 IST

కాంగ్రెస్‌ పార్టీలో విలీనం కుదరకపోవడంతో తెలంగాణలోని 119 స్థానాల్లో బరిలో ఉంటామని గురువారం వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. తల్లి విజయమ్మ, భర్త అనిల్‌ కుమార్, తాను పోటీలో ఉంటామని స్పష్టం చేశారు షర్మిల. షర్మిల పాలేరు స్థానం నుంచి పోటీ చేయనుండగా.. విజయమ్మ సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

అయితే షర్మిల భర్త బ్రదర్‌ అనిల్ కుమార్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బ్రదర్‌ అనిల్ కుమార్ కొడంగల్‌లో పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లో విలీనానికి అడ్డుపడ్డాడని రేవంత్‌పై షర్మిల తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రేవంత్‌ను టార్గెట్ చేసినట్లు సమాచారం. రేవంత్‌పై వైఎస్సార్టీపీ తరపున బ్రదర్ అనిల్ కుమార్ పోటీ చేస్తారని.. ఇప్పటికే కొడంగల్‌లో ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రారంభమైనట్లు సమాచారం.

కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనానికి రేవంత్ రెడ్డి మొదటి నుంచి అడ్డు చెప్పారు. షర్మిల రాకను పార్టీలోని పలువురు సీనియర్లు స్వాగతించినా రేవంత్ రెడ్డి మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. షర్మిలను ఏపీకి పంపాలని హైకమాండ్‌ను కోరారని తెలిసింది. మొత్తంగా కాంగ్రెస్‌ నిర్ణయం కోసం నాలుగు నెలల పాటు వేచి చూసిన షర్మిల తెలంగాణలో ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించారు.


Tags:    
Advertisement

Similar News