హైదరాబాద్ కు బ్రిస్టల్ మేయర్స్.. భారత్ లోనే తొలి యూనిట్
బ్రిస్టల్ మేయర్స్ సంస్థ ప్రపంచంలోనే టాప్ టెన్ ఫార్మా కంపెనీల్లో ఒకటి. ఫార్మారంగంలో సరికొత్త ఔషధాల పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి లక్ష్యంగా ఈ కంపెనీ పనిచేస్తోంది.
అంతర్జాతీయ కంపెనీ ఏదయినా భారత్ లో మొట్టమొదటి యూనిట్ ప్రారంభించాలంటే బీజేపీ పాలిత రాష్ట్రాలవైపు చూడటం సహజం. ఎందుకంటే కేంద్రం అలా స్కెచ్ వేస్తుంది, పెట్టుబడులను అటువైపు మళ్లిస్తుంది. కానీ తెలంగాణ విషయంలో విదేశీ కంపెనీలు నేరుగా ఇక్కడే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా బ్రిస్టల్ మేయర్స్ అనే ఫార్మా కంపెనీ భారత్ లో తొలి బ్రాంచ్ ఓపెన్ చేయడానికి రెడీ అయింది. తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో బ్రిస్టల్ మేయర్స్ సంస్థ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. రూ.800 కోట్లకు పైగా పెట్టుబడితో ముందుకొచ్చిన ఈ సంస్థ ద్వారా 1500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తామని మంత్రి తెలిపారు. హైదరాబాద్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నామని బ్రిస్టల్ మేయర్స్ ప్రతినిధులకు వివరించారు మంత్రి కేటీఆర్.
బ్రిస్టల్ మేయర్స్ సంస్థ ప్రపంచంలోనే టాప్ టెన్ ఫార్మా కంపెనీల్లో ఒకటి. ఫార్మారంగంలో సరికొత్త ఔషధాల పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి లక్ష్యంగా ఈ కంపెనీ పనిచేస్తోంది. క్యాన్సర్, ఇమ్యునాలజీ, సెల్ థెరపీ, అంకాలజీ, గుండె రక్తనాళాల వ్యాధులకు ఔషధాలను అభివృద్ధి చేస్తోంది బ్రిస్టల్ మేయర్స్. భారత్ లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామని తెలిపారు సంస్థ సమిత్ హిరావత్. ఈ రంగంలో మెరుగైన అవకాశాల కోసం చూస్తున్నామని, వచ్చే మూడేళ్లలో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని వివరించారు.
తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగం బలంగా, వేగంగా ఎదుగుతోందని అన్నారు మంత్రి కేటీఆర్. ఈ రంగంలో ఉన్న యువతకు ఇదొక మంచి అవకాశమని చెప్పారు. ఇప్పటివరకు భారత్ లో లేని ఒక సంస్థ హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడం గొప్ప విషయం అని అన్నారు. దేశంలో ఎక్కడైనా ఒక సంస్థ నూతన యూనిట్ పెట్టాలంటే 12 నుంచి 18 నెలల వ్యవధి పడుతుందని, హైదరాబాద్ ఫార్మా సిటీలో అలా కాకుండా అన్ని అనుమతులు రోజుల వ్యవధిలోనే లభిస్తాయని, ఎలాంటి ఆలస్యం లేకుండా ఇక్కడ వెంటనే సంస్థ కార్యకలాపాలు మొదలుపెట్టొచ్చని చెప్పారు. హైదరాబాద్ లో ఉన్న ఇతర అనుకూలతలను కూడా సంస్థ పరిగణనలోకి తీసుకోవాలని సంస్థ ప్రతినిధులకు సూచించాం. తయారీ రంగంలోనూ బ్రిస్టల్ మేయర్స్ దృష్టి సారించాలన్నారు కేటీఆర్.