వాళ్లిద్దరూ ఆర్.ఎస్. బ్రదర్స్!
రేవంత్, బండి సంజయ్ ది ఫెవికాల్ బంధం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆర్.ఎస్. బ్రదర్స్ అని.. వాళ్లిద్దరిది ఫెవికాల్ బంధమని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తో కలిసి శుక్రవారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎంపీ డీకే అరుణను లగచర్లకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నా సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అక్కడి రైతులను పోలీసులు హింసిస్తుంటే, అరెస్టు చేస్తుంటే ఎందుకు నోరు విప్పడం లేదో చెప్పాలన్నారు. కొడంగల్ అగ్నిగుండంలా మారితే సంజయ్ ఎక్కడ నిద్రపోతున్నారని నిలదీశారు. కేటీఆర్ బామ్మర్ది ఇంట్లో పార్టీ జరిగితే రేవంత్ ఫోన్ చేయగానే సంజయ్ స్పందించారని అన్నారు. రేవంత్, సంజయ్ కలిసి కేటీఆర్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని అన్నారు. వాళ్లిద్దరు కలిసి బీఆర్‌ఎస్ పార్టీ లేకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. సొంత అల్లుడి కోసం రేవంత్ రైతుల భూములు లాక్కుంటుంటే.. రేవంత్ కోసం సంజయ్ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేందుకు సహకరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 11 నెలలుగా ఆటవిక పాలన నడుస్తోందన్నారు. అక్రమ కేసులు, అరెస్టులు తప్ప పాలనలో రేవంత్ తన మార్క్ చూపించలేకపోయారన్నారు. నిత్యం కేటీఆర్, హరీశ్ రావుపై బుదర చల్లడం, కేసీఆర్ నాయకత్వాన్ని బలహీన పరచాలని చూడటం తప్ప రేవంత్ చేసిందేమి లేదన్నారు.
మూసీ ప్రక్షాళన పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేయాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. లగచర్ల ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. అధికారులపై దాడి చేసింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలేనని తెలిపారు. రైతులు పార్టీలకు అతీతంగా తమ భూములు ఇవ్వబోమని తిరుగుబాటు చేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. లగచర్ల మరో నందిగ్రామ్ లా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ను బద్‌నాం చేయడానికి రేవంత్ ఎన్నో ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదన్నారు. రేవంత్ అన్న తిరుపతి రెడ్డికి ఎందుకు ఎస్కార్ట్ ఇస్తున్నారో సీఎస్, డీజీపీ సమాధానం చెప్పాలని ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. లగచర్ల తండాల్లో రజాకార్ల పాలన సాగిస్తున్నారు, ఆ రాజాకార్లకు తిరుపతి రెడ్డి నాయకుడు అన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఎటో పోయాయని, ఏడో గ్యారంటీ కింద రాజాకార్ల పాలన తెచ్చారన్నారు. కేసీఆర్ గిరిజనుల పోడు భూముల పట్టాలిస్తే.. ఆ భూములు గుంజుకోవడానికి రేవంత్ రెడ్డి ఒక్కో గిరిజనుడిని పోలీసులతో గంట సేపు కొట్టించాడని, సమైక్య పాలనలో కూడా ఇంతటి దారుణాలు జరగలేదన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడమంటే తెలంగాణానే లేకుండా చేస్తారా అని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్‌ఎస్ పై వేయాలని చూస్తున్నారని అన్నారు.
ఏం సాధించారని విజయోత్సవాలు : వాసుదేవరెడ్డి
11 నెలల్లో ఏం సాధించారని ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకుడు వాసుదేవ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం పార్టీ నాయకులు మహేశ్ రెడ్డి, నరేందర్ తో కలిసి తెలంగాణ భవన్ లో విలేకరులతో మాట్లాడారు. పాలనను గాలికొదిలేశారని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని స్వయంగా ముఖ్యమంత్రే చెప్తున్నారని, గురుకులాల్లో ఇప్పటి వరకు 36 మంది విద్యార్థులు చనిపోయారని తెలిపారు. వాళ్ల చావులకు కారణమైనందుకే విజయోత్సవాలు జరుపుతున్నారా అని ప్రశ్నించారు. ఖమ్మం ప్రజలు వరదలో మునిగిపోతుంటే సీఎం కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూశారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం విఫలమైందని నిన్నటి ప్రసంగంలో రేవంత్ ఒప్పుకున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎక్కడ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసినా అది బీఆర్‌ఎస్ కుట్రే అంటున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఇక్కడ ఆర్.ఆర్. ట్యాక్స్ వసూలు చేస్తూ ఢిల్లీలో రాహుల్ గాంధీకి కప్పం కడుతున్నాడని ఆరోపించారు. ఒక్కటంటే ఒక్క హామీని నెరవేర్చని ప్రభుత్వానికి విజయోత్సవాలు చేసుకోవడానికి సిగ్గుండాలన్నారు.