తెలంగాణలో బీజేపీ ఖాళీ కావడం ఖాయమేనా..? ఇతర పార్టీల వైపు వలస నేతల చూపు!

కొంత కాలంగా బీజేపీలోని పాత నాయకులకు, వలస నాయకులకు మధ్య విభేదాల నెలకొన్నాయి. వలస నాయకులకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తితో ఉన్నారు.

Advertisement
Update:2023-06-21 15:01 IST

తెలంగాణలో బీజేపీ పని ఖతమ్ అయినట్లేనా..? అధికారంలోకి వస్తామని ఇన్నాళ్లూ చెప్పిన మాటలు కల్లలు కాబోతున్నాయా..? పార్టీని కాపాడుకోవడమే ఇప్పుడు రాష్ట్ర నాయకులకు పెద్ద తలనొప్పిగా మారిందా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని గత నాలుగేళ్లుగా చెప్పుకున్న బీజేపీకి.. ఇప్పుడు సొంత పార్టీ నాయకులే చుక్కలు చూపిస్తున్నారు. పార్టీ బలోపేతం కోసమని చేర్చుకున్న ఇతర పార్టీ నాయకులు ఇప్పుడు బీజేపీకి ఝలక్ ఇచ్చే పనిలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండ‌డంతో బీజేపీలో అసంతృప్తి నాయకుల సంఖ్య పెరిగిపోతున్నది.

తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల కోసం పూర్తిగా సన్నద్దం అవుతున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసింది. దశాబ్ది ఉత్సవాల తర్వాత పార్టీ పరంగా మరిన్ని కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధం చేసింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇతర పార్టీల్లోని అసంతృప్త నాయకులకు గాలం వేస్తోంది. ముఖ్యంగా తమ పార్టీ నుంచి వలసపోయిన వారిని టార్గెట్ చేసింది.

తెలంగాణ బీజేపీలో వలస నాయకులు ఎక్కువగా కాంగ్రెస్‌కు చెందిన వారే ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి వెళ్లిన ఈటల రాజేందర్, రఘునందన్ తప్ప మిగిలిన కీలక నాయకులు కాంగ్రెస్‌కు చెందిన వారే. కాగా, గత కొంత కాలంగా బీజేపీలోని పాత నాయకులకు, వలస నాయకులకు మధ్య విభేదాల నెలకొన్నాయి. వలస నాయకులకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో పలువురు ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లు తెలుస్తున్నది.

ఇటీవల ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారే విషయంపై ఒక రహస్య భేటీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంట్లోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినా.. చివరి నిమిషంలో రద్దు అయినట్లు తెలుస్తున్నది. వీరందరూ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. రాజగోపాల్ రెడ్డి విషయాన్ని ఇప్పటికే అన్న వెంకట్‌రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకొని వెళ్లారు. ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా బీజేపీ రాష్ట్ర నాయకుల తీరు, అధిష్టానం వ్యవహార శైలితో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తున్నది.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైతే.. తాము కూడా వస్తామని పలువురు బీజేపీ నాయకులు చెబుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. బీజేపీలోకి వలస వెళ్లిన డీకే అరుణ మినహా.. మిగిలిన వారందరూ సొంత గూటికి చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ లేదా అధికార బీఆర్ఎస్‌లో చేరేందుకు చాలా మంది బీజేపీ నాయకులు పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక్క జి. వివేక్ విషయంలో తప్ప.. మిగిలిన వారు రావడానికి పెద్ద అభ్యంతరం చెప్పడం లేదని తెలుస్తోంది.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీలో వలస నాయకులే ఉండరని.. చివరకు పాత నాయకులే మిగులుతారని తెలుస్తున్నది. అదే జరిగితే బీజేపీకి అతిపెద్ద నష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీజేపీ తరపున పోటీ చేయడానికి సరైన అభ్యర్థులు లేక రాష్ట్ర నాయకత్వం తల పట్టుకుంటోంది. వలస నాయకుల్లో కొంత మందికి టికెట్లు ఇచ్చి ఆ లోటును భర్తీ చేసుకోవాలని చూస్తోంది. కానీ ఇప్పుడు వాళ్లు ఇతర పార్టీల వైపు చూస్తుండటంతో పరిస్థితి మళ్లీ మొదటకు వచ్చింది. మరో రెండు మూడు నెలల్లో బీజేపీ నుంచి వలస నాయకులు పూర్తిగా బయటకు వస్తారని.. అప్పుడు రాష్ట్ర బీజేపీ ఖాళీ కావడం ఖాయమనే చర్చ జరుగుతోంది.

Tags:    
Advertisement

Similar News