పాపం.. బాబుమోహన్ పరిస్థితి చూశారా!
కె.ఎ.పాల్ కండువా కప్పి బాబుమోహన్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజాశాంతి పార్టీ తరపున వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తారని తెలుస్తోంది.
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాబుమోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్ కండువా కప్పి బాబుమోహన్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజాశాంతి పార్టీ తరపున వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తారని తెలుస్తోంది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆందోల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాబుమోహన్ ఘోర పరాజయం పాలయ్యారు. కేవలం 5 వేల ఓట్లు సాధించి మూడో స్థానానికి పరిమితమయ్యారు. తర్వాత పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై కామెంట్స్ చేసిన బాబుమోహన్.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తానని..గతంలో ఆ నియోజకవర్గ ప్రజలకు మాట ఇచ్చానని చెప్పారు.
1998లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన బాబుమోహన్... ఆ ఏడాది జరిగిన ఉపఎన్నికలో ఆందోల్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి చంద్రబాబు కేబినెట్‌లో కార్మికశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక 2004, 2009 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయిన బాబుమోహన్.. రాష్ట్ర విభజన తర్వాత 2014లో బీఆర్ఎస్‌లో చేరారు. ఆందోల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బాబుమోహన్‌కు కేసీఆర్ టికెట్ నిరాకరించడంతో బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీని వదిలి ప్రజాశాంతి పార్టీ గూటికి చేరారు బాబుమోహన్.