ఒక్క ఎమ్మెల్యేతో...అధికారం ఆశిస్తారా?

తెలంగాణలో అధికారం కోసం బీజేపీ పడరాని పాట్లు పడుతోందా ? అడ్డదారులు కూడా వెతుక్కుంటోందా ? మహారాష్ట్ర మాదిరిగానే తెలంగాణలో కూడా టీఆరెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మాటలకు అర్ధం అదేనా ?

Advertisement
Update:2022-07-21 21:30 IST

తెలంగాణలో అధికారం కోసం తహతహలాడుతున్న బీజేపీ నాయకులు అందుకోసం అడ్డ‌దారులు తొక్కేందుకు కూడా సిద్దమవుతున్నారా ? ఈప్రశ్నకు ఈ రోజు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడిన మాటలు అవుననే సమాధానం ఇస్తున్నవి. త్వరలో తెలంగాణలో మహారాష్ట్ర వంటి పరిస్థితులే రాబోతున్నాయన్నారు రాజాసింగ్. మహారాష్ట్ర లో శివసేనను చీల్చిన ఏక్ నాథ్ షిండే బీజేపీ మద్దతుతో అధికారంలోకి వచ్చినట్టే తెలంగాణలో టీఆరెస్ లో ఏక్ నాథ్ షిండేలు తిరుగుబాటు చేసి అధికారంలోకి వస్తారని ఆయన ఉద్దేశం.

''టీర్ఎస్ పార్టీలో అసంతృప్తి చాలా ఎక్కువగా ఉంది. తమ పదవులు ఉంటాయనే నమ్మకం మంత్రులకు, ఎమ్మెల్యేలకు లేదు. ఏ క్షణంలోనైనా వారు పార్టీ నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉంది''అని రాజా సింగ్ వ్యాఖ్యానించారు.

ఇదే విధమైన వ్యాఖ్యలు ఇతర బీజేపీనాయకులు కూడా చేశారు. అంతే కాదు కేసీఆర్ కుటుంబం అరెస్టు తప్పదంటూ బండి సంజయ్ పదే పదే వార్నింగులు ఇస్తున్నాడు. ఈ రోజు కూడా మళ్ళీ ఆయన అదే మాట మాట్లాడాడు. ఈడీ ని ఎదుర్కోవడానికి కేసీఆర్ సిద్దంగా ఉండాలంటూ హెచ్చరించారాయన.

చాలాకాలంగా బీజేపీ నేతలు ఇలాంటి మాటలే మాట్లాడుతున్నారు. అందులో నిజముంటే ఇప్పటి వరకు ఆచరణలోకి ఎందుకు దిగనట్టు ?

నిజానికి మహారాష్ట్ర రాజకీయాలకు , తెలంగాణ రాజకీయాలకు పోలికే లేదు. అక్కడ శివసేనకు పూర్తి మెజార్టీ లేదు. కాంగ్రెస్, ఎన్సీపీల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణలో టీఆరెస్ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉన్నది. మహారాష్ట్రలో ఈడీని చూపించి అనేక మంది ఎమ్మెల్యేలను, ఎంపీలను బ్లాక్ మెయిల్ చేసింది బీజేపీ. అలా ఈడీకి భయపడడానికి ఇక్కడ టీఆరెస్ ఎమ్మెల్యేల మీద కేసులేమీ లేవు. పైగా ఇక్కడ‌ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, టీఆరెస్ నాయకులకు కేసీఆర్ పై అచంచలమైన విశ్వాసం ఉన్నది. దానికి కారణం టీఆరెస్ ఉద్యమంలోంచి వచ్చిన పార్టీ కాబట్టి. 14 ఏళ్ళ పాటు ఉద్యమం నడిపిన పార్టీ కాబట్టి. ఇలా రెండు రాష్ట్రాల రాజకీయాలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇక మహారాష్ట్రలో బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలంగాణలో ముగ్గురున్నారు. అందులో ఒక్క రాజా సింగ్ తప్ప మిగతా ఇద్దరూ టీఆరెస్ నుంచి వచ్చిన వారే. కేసీఆర్ గేట్లు తెరిస్తే ఏ క్షణమైనా వాళ్ళిద్దరూ టీఆరెస్ లోకి రావచ్చు కూడా.

ఇక ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ బీజేపీ నాయకులు టీఆరెస్ లో ఏక్నాథ్ షిండే లను వెతికే పనిలో బిజీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా వాళ్ళెలాగూ గెలవలేరని వాళ్ళ సర్వేల్లోనే తేలిపోయింది. 119 సీట్లకు గానూ దాదాపు 80 సీట్లలో ఇప్పటికీ వాళ్ళకు అభ్యర్థులు లేరు. గత ఎన్నికల్లో మెజార్టీ సీట్లలో బీజేపీ డిపాజిట్లు కోల్పోయింది. అందువల్ల అధికారం కోసం అడ్డదారులు తొక్కేందుకు సిద్దమవుతున్నామని ఆ పార్టీ నాయకులే చెప్పకనే చెప్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు కూల్చేద్దామా అని తహతహలాడుతున్నారు. కానీ పరిస్థితులు వాళ్ళకు అనుకూలంగా లేకపోవడంతో ఇరిటేట్ అయిపోయి మాట్లాడుతున్నారు.

చివరకు గవర్న‌ర్ ద్వారా కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకరావడం కోసం గవర్నర్ పడరాని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వానికి పోటీగా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినా బీజేపీ అనుకున్నంతగా ఫలితం కనపడటం లేదు.

ఇక ఇప్పటికే బీజేపీలో రెండు వర్గాలు ప్రతి రోజు ఒకరిపై ఒకరు ఎత్తులు, పై ఎత్తులు వేసుకుంటున్నారని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. సీనియర్ నాయకులకు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి పొసగడం లేదన్నది బహిరంగ రహస్యం. కొత్తగా బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ కు బండి సంజయ్ కు సైలెంట్ వార్ నడుస్తోంది. వాళ్ళ పార్టీ కింది స్థాయి నాయకులు ఒక్కొక్కరుగా ఇతర పార్టీలకు వలసలు వెళ్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన బీజేపీ జాతీయ కారవర్గ సమావేశాల సందర్భంగా పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయనుకుని ఆశపడ్డ వాళ్ళకు నిరాశే మిగిలింది. కేంద్ర నాయకులు కూడా ప్రయత్నించినప్పటికీ వాళ్ళు ఊహించిన చేరికలు జరగలేదు.

ఇక తెలంగాణ పట్ల ఆ పార్టీ అధికారంలో ఉన్న కేంద్ర‌ ప్రభుత్వం వివక్ష‌ చూపిస్తున్నదన్న విషయం తెలంగాణ ప్రజల్లోకి లోతుగా వెళ్ళిపోయింది. వరి ధాన్యం విషయంలో ఆ పార్టీ ద్వంద వైఖరిని టీఆరెస్ ప్రజల్లోకి బాగానే తీసుకెళ్ళగల్గింది. వరద‌ల సందర్భంగా కనీస సహాయం చేయకపోవడం పట్ల కూడా ప్రజలు ఆగ్రహంగానే ఉన్నారు. పైగా ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం కు జాతీయ హోదా ఇవ్వబోమంటూ ఇవ్వాళ్ళ పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ పట్ల ఇంత వ్యతిరేకత ఉన్న పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు ఎలా ఆదరిస్తారన్నది అతి పెద్ద ప్రశ్న.

ఎలాగూ ఆదరించరు కాబట్టే ఏక్ నాథ్ షిండేల కోసం చూస్తున్నదా బీజేపీ? ముగ్గురు ఎమ్మెల్యేల మద్దతుతో ఏక్ నాథ్ షిండేలను ముఖ్యమత్రులను చేయడం ఎలా సాధ్యమన్న సందేహం కూడా వాళ్ళకు రాకపోవడం ఆశ్చర్యమే.ఉట్టికెక్కలేనయ్య‌ స్వర్గానికి ఎక్కుతానన్నాడట.

Tags:    
Advertisement

Similar News