రంజాన్ నెలలో బిర్యానీ ఆర్డర్లు.. హైదరాబాదీల కొత్త రికార్డ్

రంజాన్ నెలలో బిర్యానీ రికార్డ్ విషయానికొస్తే.. బిర్యానీకి ఈనెల, ఆ నెల అనే తేడా లేకుండా అన్ని రోజుల్లోనూ డిమాండ్ ఉందనే సంగతి తేలిపోయింది. హలీం పోటీకి వచ్చినా, బిర్యానీ ప్రియులు మాత్రం తగ్గేదే లేదంటున్నారు.

Advertisement
Update:2023-04-22 06:24 IST

ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు సీజన్ ని బట్టి కొన్ని అంచనాలు వేసుకుంటాయి. రంజాన్ మాసంలో అత్యథికంగా హలీంకి డిమాండ్ ఉంటుందని, బిర్యానీలకు డిమాండ్ తగ్గుతుందని, ఆన్ లైన్ లో కూడా తమకు ఆర్డర్లు తక్కువగా వస్తాయని భావించింది స్విగ్గీ సంస్థ. కానీ హైదరాబాదీలు గత రికార్డ్ ని బ్రేక్ చేశారంటూ తాజాగా ఓ లిస్ట్ విడుదల చేసింది. రంజాన్ మాసంలో ఆన్ లైన్ లో బిర్యానీకోసం స్విగ్గీ సంస్థకు 10లక్షల ఆర్డర్లు వచ్చాయట. గతేడాదికంటే ఇది 20శాతం అధికం.

ఒక్క స్విగ్గీకే 10లక్షల బిర్యానీల ఆర్డర్లు వస్తే, ఇక జొమాటో వంటి ఇతర సంస్థలకు కూడా ఆ స్థాయిలోనే బిజినెస్ జరిగి ఉంటుంది. నేరుగా బిర్యానీ పాయింట్ లకు వెళ్లి పార్శిళ్లు తీసుకెళ్లే వారి సంఖ్యా తక్కువేం కాదు. మొత్తానికి రంజాన్ నెలలో బిర్యానీకి డిమాండ్ తగ్గి హలీంకి డిమాండ్ పెరుగుతుందనే అంచనా పటాపంచలైంది. కేవలం హలీం కోసమే ఇతర నగరాలు, పట్టణాలనుంచి హైదరాబాద్ కి వచ్చేవారు కూడా బిర్యానీని ఓ పట్టు పట్టకుండా తిరిగి వెళ్లలేదని అర్థమవుతోంది. నెలరోజల వ్యవధిలో హలీం కోసం స్విగ్గీకి 4 లక్షల ఆర్డర్లు వచ్చాయి. బిర్యానీకి 10 లక్షల మంది ఆర్డర్ ఇచ్చారు.

గతేడాది ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు వేసిన లెక్కల ప్రకారం బిర్యానీయే టాప్ ఆర్డర్ గా నిలిచింది. అత్యథిక ఆన్ లైన్ డెలివరీలు బిర్యానీవే. ఇక బ్రేక్ ఫాస్ట్ విషయానికొస్తే ఇడ్లీ టాప్ ప్లేస్ లో ఉంది. ప్రతి రోజూ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చేవారు ఆన్ లైన్ డెలివరీ సంస్థలకు పర్మినెంట్ కస్టమర్లుగా ఉన్నారు. రోజూ ఇడ్లీ తిన్నా.. కనీసం వారానికోసారైనా బోర్ కొట్టకుండా ఆర్డర్ మారుస్తుంటారు. కానీ కొంతమంది ఇడ్లీ ప్రేమికులు మాత్రం మిగతా టిఫిన్ ఐటమ్ లపై ఇష్టాన్ని వదిలేసుకున్నారు. ఆన్ లైన్ లో ఏడాది మొత్తం ఇడ్లీకే జై కొట్టారు. ఇక రంజాన్ నెలలో బిర్యానీ రికార్డ్ విషయానికొస్తే.. బిర్యానీకి ఈనెల, ఆ నెల అనే తేడా లేకుండా అన్ని రోజుల్లోనూ డిమాండ్ ఉందనే సంగతి తేలిపోయింది. హలీం పోటీకి వచ్చినా, బిర్యానీ ప్రియులు మాత్రం తగ్గేదే లేదంటున్నారు. 

Tags:    
Advertisement

Similar News