హైదరాబాద్‌కు బిగ్ అలర్ట్.. మరో ఆరు రోజుల పాటు వర్ష సూచన

ఏప్రిల్ 27, 28 తేదీల్లో ఆకాశం మేఘావృతమై ఉండి.. పలు చోట్లు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.

Advertisement
Update:2023-04-26 17:41 IST

హైదరాబాద్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆరు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మంగళ, బుధవారాల్లో నగరంలో కురిసిన వర్షానికి జనజీవనం అతలాకుతలమైంది. అకాల వర్షాల కారణంగా పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. రామచంద్రాపురంలో అత్యధికంగా 92 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. మరో ఆరు రోజుల పాటు ఇలాంటి వర్షాలే కురిసే అవకాశం ఉందని.. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజాముల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఏప్రిల్ 27, 28 తేదీల్లో ఆకాశం మేఘావృతమై ఉండి.. పలు చోట్లు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే 29, 30వ తేదీల్లో సాయంత్రం, రాత్రి వేళల్లో భారీ వర్షాలు లేదా చిరు జల్లులు కురిసే అవకశం ఉందని, మే 1,2 తేదీల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా తేలిక పాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని కూడా అధికారులు చెప్పారు. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడుతుందని.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని పేర్కొన్నది. వడగండ్ల వానలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాగా, ఈ రోజు ఉదయం రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి.

ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతోనే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి శ్రావణి తెలిపారు. రాబోయే ఆరు రోజుల పాటు ఇలాంటి పరిస్థితే ఉండే అవకాశం ఉంటుందని చెప్పారు. ద్రోణి ప్రభావం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉందని.. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు, వడగండ్ల వానలు పడే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్ జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా ఉండొచ్చని చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News