తమ్ముళ్లూ రెడీగా ఉండండి.. తెలంగాణలో చంద్రబాబు కామెడీ..

ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో చంద్ర‌బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అద్భుతమైన స్పందన ఉందద‌ని, ఎన్నికలకు సిద్ధంగా ఉండండి అని చెప్పారు.

Advertisement
Update:2022-07-29 13:03 IST


రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కేఏ పాల్ కామెడీ ఓ రేంజ్ లో కొనసాగుతోంది. తాజాగా చంద్రబాబు కూడా అంతకు మించి తెలంగాణలో కామెడీ పండించారు. ఏపీలోని జిల్లాల్లో చంద్రబాబు పర్యటనకు వెళ్లడం, అధికార వైసీపీపై విమర్శలు గుప్పించడం, ప్రజలు మారిపోయారని చెప్పడం, తమ బలం పెరిగిందని చెప్పుకోవడం... ఇవన్నీ సహజమే. అయితే ఇప్పుడాయన తెలంగాణలో పర్యటిస్తూ అద్భుతమైన స్పందన వస్తుంది తమ్ముళ్లూ.. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి అని చెప్పడమే హాస్యాస్పదంగా మారింది. ఖమ్మం జిల్లాలో టీడీపీ సామాజిక వర్గం బలంగా ఉండొచ్చు, చంద్రబాబు పర్యటన అనగానే వారంతా బ్యానర్లు కట్టి హడావిడి చెయొచ్చు, అంత మాత్రాన తెలంగాణలో టీడీపీ బలం పుంజుకుంటోందనే అంచనాకు చంద్రబాబు రావడం ఇప్పుడు హైలెట్.

తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటా పోటీగా ఉన్నాయి. మధ్యలో వైఎస్సార్టీపీ లాంటి పార్టీలు కూడా తమ ఉనికి చాటుకోవాలనుకుంటున్నాయి. ఈ దశలో చంద్రబాబు వరద బాధితుల పరామర్శ కోసం విలీన మండలాలకు వెళ్లి పనిలో పనిగా భద్రాచలం కూడా వెళ్లారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ అభివృద్ధి తనవల్లే జరిగిందని, ఇప్పుడు యువతకు వచ్చిన ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు తానే కారణం అని చెప్పుకుంటూ.. తెలంగాణలో అద్భుతమైన స్పందన ఉందని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీకి అనుకూల వాతావరణం ఉందని, తన పర్యటనతో నూతన ఉత్తేజం వచ్చిందని కూడా చెప్పుకొచ్చారు. అంతే కాదు, సెప్టెంబర్ రెండో వారంలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు బాబు.

టీడీపీ ఆవిర్భావమే తెలంగాణలో జరిగిందనే విషయాన్ని గుర్తి చేశారు చంద్రబాబు. యువత భవిష్యత్ కోసం తెలంగాణలో కూడా టీడీపీ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. టీడీపీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా కంచుకోట అని చెప్పారు. ఖమ్మంతో టీడీపీకి విడదీయరాని బంధం ఉందన్నారు. మాటలు బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు తెలంగాణలో టీడీపీ ఉనికి అసలు ఉందా అనేదే ప్రశ్నార్థకం. ఆ మధ్య పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడి నియామకం కోసం చంద్రబాబు రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ఇక పార్టీ తరపున పోటీ అంటే ఎవరైనా ముందుకొస్తారా..? ఏపీలోనే టీడీపీ పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. 2024 ఎన్నికల్లో ఆ 23 సీట్లు కూడా టీడీపీకి రాకుండా చేయాలనే ఆలోచనలో వైసీపీ ఉంది. 175 సీట్లు టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నారు వైసీపీ నేతలు. ముఖ్యంగా కుప్పంలో చంద్రబాబు సీటుకి ఎసరు పెట్టాలనుకుంటున్నారు. ఈ దశలో ఏపీలోనే అంతంతమాత్రంగా ఉన్న టీడీపీ తెలంగాణలో బలపడుతుందా, కనీసం ఉనికి చాటుకోగలదా అనేది ప్రశ్నార్థకం. కానీ చంద్రబాబు మాత్రం తెలంగాణలో టీడీపీ పుంజుకుంటోందంటూ కామెడీ చేశారు. కేఏపాల్ ని గుర్తు చేశారు.

Tags:    
Advertisement

Similar News