పరాజయం నుంచి పాఠాలు నేర్వని బీజేపీ.. మళ్లీ అదే మతం కార్డు!
అస్సోం సీఎం హిమంత బిశ్వశర్మ కూడా అదే తరహాలో విద్వేష పూరితంగా మాట్లాడారు. ఒక్కొక్కరు నలుగురిని పెళ్లి చేసుకోవచ్చని అనుకుంటున్నారు.. అవన్నీ త్వరలోనే ఆగిపోతాయని పరోక్షంగా ఓ వర్గం వారిని హెచ్చరించారు.
రాజకీయాల్లో పరాజయాల నుంచి వేగంగా పాఠాలు నేర్చుకోవాలి.. లేదంటే మనుగడే కష్టమవుతుంది. కానీ, బీజేపీ మాత్రం గుణపాఠాలకి చాలా దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కర్ణాటకలో హిందూ కార్డుతో గెలవాలని ప్రయత్నించిన బీజేపీ చావు దెబ్బతింది. ఎన్నికల ప్రచారంలో ముస్లిం రిజర్వేషన్లని ఎత్తివేస్తామని ప్రకటించిన బీజేపీ.. హిందువుల ఓట్లనీ తమకే పడతాయని ఆశించింది. కానీ.. కర్ణాటక ప్రజలు మత సామరస్యానికే ఓటేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు వ్యవధిలోనే తెలంగాణలో బీజేపీ ‘హిందూ ఏక్తా యాత్ర’కి తెరదీసింది.
పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్‌లో ఈ ‘హిందూ ఏక్తా యాత్ర’ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. కాంగ్రెస్ గెలవగానే కర్ణాటకలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేశారని.. 15 నిమిషాలు టైమిస్తే హిందువుల సంగతి చూస్తామంటూ బెదిరింపులకి దిగుతున్నారంటూ బండి సంజయ్ చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఇలాంటి విద్వేష వ్యాఖ్యలు చేయడంలో బండి సంజయ్ ముందుంటారు. కానీ ఇప్పుడు కర్ణాటకలోని వారిపై నెపం నెడుతున్నారు. అయినా ఆ వ్యాఖ్యల్ని ‘హిందూ ఏక్తా యాత్ర’లో చెప్పడం వెనుక బండి సంజయ్ ఉద్దేశం ఏంటి? ఇది హిందువుల్ని రెచ్చగొట్టడటం కాదా? అనేది ప్రశ్న.
ఈ ‘హిందూ ఏక్తా యాత్ర’కి వచ్చిన అస్సోం సీఎం హిమంత బిశ్వశర్మ కూడా అదే తరహాలో విద్వేష పూరితంగా మాట్లాడారు. ఒక్కొక్కరు నలుగురిని పెళ్లి చేసుకోవచ్చని అనుకుంటున్నారు.. అవన్నీ త్వరలోనే ఆగిపోతాయని పరోక్షంగా ఓ వర్గం వారిని హెచ్చరించారు. ఇలాంటి మాటలతో మత సామరస్యం పెరగకపోగా విద్వేష వాతావరణం పెరుగుతుంది. బీజేపీ నేతలు అదే కోరుకుంటున్నారా? కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని బీజేపీ వాగ్దానాలు చేసినప్పుడు ఏ హిందువు కూడా సంతోషించి ఉండడు. పైపెచ్చు ఆ ప్రకటన వారిలో ఆందోళనలు పెంచి ఉంటాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో మత ఘర్షణలు దక్షిణాదిన జరిగిన సందర్భాలు లేవు. ఒకవేళ ముస్లిం, హిందువులు అంటూ విభజించడాన్ని మొదలుపెడితే అప్పుడు ఘర్షణలు చెలరేగే అవకాశం ఉంది. అందుకే విభజించు- పాలించు అనే సూత్రాన్ని పట్టుకున్న బీజేపీకి కర్ణాటకలో సరైన గుణపాఠాన్ని నేర్పారు. కానీ తెలంగాణ బీజేపీ నేతలే సరిగా ఆ పాఠాన్ని అర్థం చేసుకున్నట్లు లేరు!