ఒవైసీ సోదరులతో హనుమాన్ చాలీసా చదివించగలరా..? బండి సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అధికారంలోకి రాగానే భైంసాను మైసాగా మారుస్తామని అన్నారు బండి సంజయ్. భైంసాలో ఎంఐఎం గూండాలు చేసిన అరాచకాలు కళ్ల ముందు ఇంకా మెదులుతున్నాయని... అల్లర్ల బాధితులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ముస్లిం ఓట్ల కోసం బీఆర్ఎస్ నేతలు టోపీ పెట్టుకుని మసీదుల్లోకి వెళ్లి నమాజ్ చేస్తున్నారని.. వారే నిజమైన హిందువులైతే ఒవైసీ సోదరులను హనుమాన్ ఆలయానికి తీసుకొచ్చి చాలీసా చదివించే దమ్ముందా? అని ప్రశ్నించారు కరీంనగర్ బీజేపీ అభ్యర్థి, ఎంపీ బండి సంజయ్. రాష్ట్రంలో 12 శాతం ఓట్లను బీఆర్‌ఎస్, ఎంఐఎం నమ్ముకున్నాయని, కాంగ్రెస్ మతపెద్దలను నమ్ముకుందని, వీరందరికి బదులు చెప్పాలంటే.. హిందువులు ఓటు బ్యాంకుగా మారి సత్తా చాటాలని చెప్పారు. ఆ సమయం ఆసన్నమైందని అన్నారు బండి.
తెలంగాణ బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా బండి సంజయ్ పై తీవ్ర ఆరోపణలున్నాయి. తాజాగా మరోసారి బండి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బీజేపీ అధికారంలోకి రాగానే భైంసాను మైసాగా మారుస్తామని అన్నారు బండి. భైంసాలో ఎంఐఎం గూండాలు చేసిన అరాచకాలు కళ్ల ముందు ఇంకా మెదులుతున్నాయని... అల్లర్ల బాధితులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ముధోల్ నియోజకవర్గాన్ని తాను దత్తత తీసుకుంటానని చెప్పారు. నాందేడ్ నుంచి భైంసా–నిర్మల్ మీదుగా మంచిర్యాల వరకు రైల్వేలైన్ వేయిస్తామని హామీ ఇచ్చారు బండి సంజయ్.
సుష్మా పోరాటం వల్లే..
కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి జనం నవ్వుకుంటున్నారని, వాళ్ల మేనిఫెస్టో చెల్లని రూపాయని ఎద్దేవా చేశారు బండి సంజయ్. ఆ పార్టీ ఇచ్చే హామీలకు విలువ లేదని కొట్టిపారేశారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ 1,400 మందిని బలితీసుకుందని, సుష్మాస్వరాజ్ పార్లమెంటులో పోరాడిన తర్వాతే అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని చెప్పారు బండి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు ఓట్ల కోసమే ముస్లింల వద్దకు వస్తున్నారని, ఆ విషయంపై ముస్లిం సమాజం ఆలోచన చేయాలన్నారు. టోపీలు పెట్టుకొని నమాజ్ పేరుతో వారిని మోసం చేస్తున్నారన్నారు.
♦