బీజేపీలో బాస్ లు.. కాంగ్రెస్ లో హోం గార్డ్ లు

అసెంబ్లీ ఎన్నికలకోసం తమ పార్టీలో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ ఉందని, కాంగ్రెస్ మాత్రం అభ్యర్థులు దొరక్క అవస్థలు పడుతోందన్నారు బండి సంజయ్.

Advertisement
Update:2023-06-02 16:56 IST

తమ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు బాస్ లు గా ఉంటారని, అదే సీనియార్టీ కాంగ్రెస్ లో వస్తే మాత్రం వారు హోమ్ గార్డ్ ల స్థాయిలో ఉంటారని సెటైర్లు పేల్చారు బండి సంజయ్. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. సెప్టెంబర్ 17 న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించామని, తెలంగాణ ఆవిర్భవాన్ని కూడా అధికారికంగా నిర్వహించామని తెలిపారు. ఆ క్రెడిట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిదే అని కితాబిచ్చారు బండి సంజయ్.

టార్గెట్ రేవంత్ రెడ్డి..

రేవంత్ రెడ్డి లాగ పార్టీలు మారడం తనకు చేతకాదని, ఎమ్మెల్సీ ఎన్నికలకోసం ఓటుకు నోట్లు పంచడం తనకు చేతకాదని అన్నారు బండి సంజయ్. రేవంత్ రెడ్డి పార్టీ ఎలా నడుపుతున్నారో జానారెడ్డి, కోమటిరెడ్డి, జగ్గారెడ్డిని అడిగితే తెలుస్తుందన్నారు. అసలు తెలంగాణలో కాంగ్రెస్ ఎవరి చెప్పు చేతల్లో ఉందో అంటూ కౌంటర్ ఇచ్చారు. హుజురాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తూ.. తాము విజయాల పరంపర కొనసాగిస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం ప్రతి ఎన్నికల్లోనూ ఓడిపోతూ డిపాజిట్లు కోల్పోయిన పరంపర కొనసాగిస్తోందంటూ ఎద్దేవా చేశారు బండి సంజయ్. అసెంబ్లీ ఎన్నికలకోసం తమ పార్టీలో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ ఉందని, కాంగ్రెస్ మాత్రం అభ్యర్థులు దొరక్క అవస్థలు పడుతోందన్నారు.

దారుస్సలాంకు తాళం..

ఒవైసీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనలేదని, దీనికి బీఆర్ఎస్, కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. నిజమైన తెలంగాణ ముస్లింలు ఎంఐఎం పార్టీని వ్యతిరేకించాలని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున జెండా ఎగురవేయనోడికి తెలంగాణలో పోటీ చేసే అర్హత లేదని చెప్పారు. తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చాక దారుస్సలాంను స్వాధీనం చేసుకుని పేద ముస్లింలకు ఇచ్చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. 

Tags:    
Advertisement

Similar News