రుణమాఫీపై బీజేపీ విమర్శలు.. కానీ క్రెడిట్ బీఆర్ఎస్ కి పోకూడదు

విలీన డ్రామాలు అని మాట్లాడటం బండి సంజయ్ కి తగునా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం అవుతుందనే ప్రచారాన్ని మొదలు పెట్టింది బండి సంజయ్ అని గుర్తు చేస్తున్నారు.

Advertisement
Update:2024-08-18 20:00 IST

తెలంగాణలో రైతు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తిగా ఇరుకున పెట్టింది. ఎన్నికల ముందు రూ.40వేల కోట్లతో రుణమాఫీ చేస్తామన్నారు. తీరా ప్రభుత్వం ఏర్పాటయ్యాక బడ్జెట్ లో కేవలం రూ.26 కోట్లు కేటాయించారు. చివరకు రూ.18వేలకోట్ల మేర రుణాలు మాఫీ చేసి సరిపెట్టారు. లెక్కలతో ఇలా పక్కాగా దొరికిపోవడంతో కాంగ్రెస్ కొత్త నాటకానికి తెరతీసింది. రుణమాఫీ కాని అర్హులకోసం స్పెషల్ డ్రైవ్ అంటూ కవరింగ్ గేమ్ మొదలు పెట్టింది. రుణమాఫీ అంశం ప్రతిపక్షాలకు కీలక అస్త్రంగా మారింది. బీఆర్ఎస్ ఈ పోరాటంలో ముందుంది, బీజేపీ వెనక పడింది. అయితే ఇక్కడ రుణమాఫీ అంశాన్ని ప్రస్తావిస్తే ఆ క్రెడిట్ అంతా బీఆర్ఎస్ కి పోతుందని బీజేపీ భయపడుతోంది. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాటలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి.

రుణమాఫీపై రైతుల్లో తిరుగుబాటు రావడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలసి విలీన డ్రామాలాడుతున్నాయని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్‌ పార్టీకే ఉందని చెప్పారాయన. బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ తమకు లేదన్నారు. రుణమాఫీ కాక రైతులు కాంగ్రెస్ దిష్టిబొమ్మలు కాల్చేస్తున్నా పట్టించుకోరా? అని ప్రశ్నించారు. రుణమాఫీ సహా 6 గ్యారంటీలపై చర్చను పక్కదారి పట్టించేందుకు విలీన డ్రామాలు మొదలయ్యాయని అన్నారు బండి సంజయ్.

విలీన డ్రామాలు అని మాట్లాడటం బండి సంజయ్ కి తగునా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం అవుతుందనే ప్రచారాన్ని మొదలు పెట్టింది బండి సంజయ్ అని గుర్తు చేస్తున్నారు. రైతు రుణమాఫీ పూర్తిగా కాలేదని చెబుతున్న బీజేపీ.. పోరాటాలకు ఎందుకు మద్దతివ్వడం లేదని నిలదీస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనట్టుగా తెలంగాణ నుంచి గణనీయమైన సీట్లు ఇస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా బీజేపీ నేతలు డ్రామాలాడుతున్నారని మండిపడుతున్నారు. రుణమాఫీపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఉన్నా.. రైతులు చేస్తున్న పోరాటంలో క్రెడిట్ అంతా బీఆర్ఎస్ కే దక్కుతుందని బీజేపీ కలవరపడటం ఇక్కడ కొసమెరుపు. 

Tags:    
Advertisement

Similar News