ఆసియా కప్‌కు టీమ్ ఇండియా జట్టు ప్రకటన.. హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మకు చోటు
హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మకు తొలి సారి వన్డే జట్టులో స్థానం దక్కింది.
ఆసియా కప్ - 2023 టోర్నీ ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు శ్రీలంక, పాకిస్తాన్ వేదికలుగా నిర్వహిస్తున్నారు. టోర్నీకి మరో 8 రోజులే సమయం ఉండటంతో భారత క్రికెట్ జట్టును బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సోమవారం ప్రకటించారు. 17 మందితో కూడిన భారత జట్టులోకి కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, జస్ప్రిత్ బుమ్రా తిరిగి వచ్చారు. జస్ప్రిత్ బుమ్రా ప్రస్తుతం ఐర్లాండ్‌లో టీమ్ ఇండియా టీ20 జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అయితే వన్డే జట్టులోకి ఆసియా కప్ ద్వారా బుమ్రా తిరిగి జట్టులోకి చేరబోతున్నాడు.
ఈ ఏడాది చివర్లో ఇండియా వేదికగానే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌లో ప్లేయర్ల ప్రదర్శనను తప్పకుండా టీమ్ సెలెక్టర్లు పరిగణలోకి తీసుకుంటారు. వరల్డ్ కప్ జట్టు ప్రకటన కూడా ఆసియా కప్ తర్వాత ఉండే అవకాశాలు ఉన్నాయి.
ఆసియా కప్‌లో టీమ్ ఇండియాకు రోహిత్ శర్మ సారథ్యం వహించనుండగా.. హార్దిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్సీ అప్పగించారు. కేఎల్ రాహుల్ జట్టులోకి తిరిగి వచ్చిన తర్వాత కూడా హార్దిక్‌ను వైస్ కెప్టెన్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మకు తొలి సారి వన్డే జట్టులో స్థానం దక్కింది. బౌలర్ ప్రసిద్ క్రిష్ణ కూడా జట్టులో స్థానం సంపాదించాడు. అయితే వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక చేశారు.
టీమ్ ఇండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ క్రిష్ణ
స్టాండ్ బై ప్లేయర్ : సంజూ శాంసన్