హైదరాబాద్‌లో పట్టపగలు మరో దారుణం.. రాడ్‌తో భార్యను కొట్టి చంపిన భర్త

శుక్రవారం ఆమె స్కూల్ కు వెళ్తున్న సమయంలో రోడ్డుపై కాపు కాచిన యూసుఫ్ ఆమె రాగానే తలపై రాడ్ తో బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలతో కరీనా బేగం అక్కడికక్కడే మృతి చెందింది.

Advertisement
Update:2023-02-03 18:23 IST

హైదరాబాద్‌లో మరో దారుణ హత్య జరిగింది. వారం కిందట జియాగూడలో ముగ్గురు వ్యక్తులు కత్తులు చేతపట్టి వెంటాడి వేటాడి అందరి ముందు ఓ వ్యక్తిని నరికి చంపిన ఘటన మరువకముందే లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిఫెన్స్ కాలనీలో మరో దారుణ హత్య జరిగింది. తనను దూరం పెట్టిందన్న కోపంతో కట్టుకున్న భార్యను నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఇనుప రాడ్డుతో త‌ల‌ప‌గ‌ల‌గొట్టి చంపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

డిఫెన్స్ కాలనీలో నివాసం ఉండే యూసుఫ్ కు, కరీనా బేగంతో ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కరీనా బేగం ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పని చేస్తుంది. ఇదిలా ఉండగా.. ఏడాది నుంచి భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. తరచూ దంపతుల మధ్య గొడవలు జరిగేవి. దీంతో వారిద్ద‌రూ కొద్ది రోజులుగా వేర్వేరుగా ఉంటున్నారు.

తన నుంచి దూరంగా ఉంటుండటంతో కరీనా బేగంపై యూసుఫ్ కక్ష పెంచుకున్నాడు. ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం ఆమె స్కూల్ కు వెళ్తున్న సమయంలో రోడ్డుపై కాపు కాచిన యూసుఫ్ ఆమె రాగానే తలపై రాడ్ తో బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలతో కరీనా బేగం అక్కడికక్కడే మృతి చెందింది.

చుట్టుపక్కల వారు అప్రమత్తమై యూసుఫ్ ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు న‌మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై మహిళను హత్య చేయడం డిఫెన్స్ కాలనీలో కలకలం రేపింది.

Tags:    
Advertisement

Similar News