కేసీఆర్ ప్రశ్నలకు జవాబులు లేవు... పాత విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్పిన అమిత్ షా
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అమిత్ షా చేతుల మీదుగా బీజేపీ లో చేరిపోయారు. ఈ సందర్భంగా మునుగోడులో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్ సర్కార్ కూలిపోతుందన్నారు.
తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే అభివృద్ది ని వరదలా పారిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిన సందర్భంగా మునుగోడులో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు.
దాదాపు 20 నిమిషాల సేపు మాట్లాడిన అమిత్ షా కొత్త విషయాలు గానీ, నిన్న కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు జవాబులు కానీ చెప్పలేదు. గతంలో చాలా సార్లు మాట్లాడిన మాటలనే మళ్ళీ మాట్లాడారు.
రాజ్ గోపాల్ రెడ్డి బీజేపీలో చేరడమంటే కేసీఆర్ సర్కార్ కూలిపోబోతోందనడానికి గుర్తు అని అమిత్ షా అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని ఇవ్వలేదని, దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చేయలేదని, నిరుద్యోగులకు 3 వేల భృతి ఇస్తామని ఇవ్వలేదని, సెప్టంబర్ 17 న తెలంగాణ విమోచన దినం జరుపుతానని చెప్పి మజ్లిస్ పార్టీకి భయపడి జరపడం లేదని, టూ బెడ్ రూంల ఇళ్ళు ఇస్తామని ఇవ్వలేదని, దళిత బంధు ఇస్తామని ఇవ్వలేదని. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లా తయారయ్యిందని....ఇలా పాత విమర్షలనే అమిత్ షా సంధించారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవబోతోందని తమ సీఎం రాగానే సెప్టంబర్ 17 తెలంగాణ విమోచన దినం జరుపాతామని చెప్పారు అమిత్ షా. ప్రతి రైతు పండించిన పంటను కొంటామని అమిత్ షా హామీ ఇచ్చారు.
అయితే ,మోటర్లకు మీటర్ల అంశంపై అమిత్ షా మాట్లాడుతారని అందరూ ఆశించినప్పటికీ ఆ విశయాన్నే అయన ఎత్తలేదు. మోడీ సర్కార్ తెలంగాణ కు ఈ ఎనిమిదేళ్ళలో 2 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందని చెప్పారు కానీ ఎప్పుడు ? ఎలా? ఏ ఖాతాలో ఇచ్చారో మాత్రం వివరించలేదు.
మొత్తానికి అందరూ ఉత్కంటగా ఎదురు చూసిన అమిత్ షా ప్రసంగం చప్పగా సాగింది. రాజ గోపాల్ రెడ్డిని ఎందుకు గెలిపించాలో చెప్పలేదు. రాజ్ గోపాల్ రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్ సర్కార్ కూలిపోతుందని చెప్పిన అమిత్ షా అదెలా సాధ్యమో మాత్రం చెప్పలేదు.