సెలబ్రిటీలంతా ఓటేశారు.. మీరూ ఓటేయండని అభ్యర్థిస్తున్నారు
రండి.. మీకు నచ్చిన పార్టీకి ఓటేయండి.. కానీ అందరూ ఓటేయండి అని యువ హీరో విజయ్ దేవరకొండ పిలుపునిచ్చారు
హైదరాబాద్ నగరంలో ఓటేయడానికి చదువుకున్న యువతకే తీరిక లేదు. మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 36.68 శాతం పోలింగ్ నమోదైతే హైదరాబాద్ మహానగర పరిధిలోని 90 శాతం నియోజకవర్గాల్లో 20% కూడా నమోదు కాలేదు. ఓ పక్క సినీతారలు, కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ రంగాల ప్రముఖులు క్యూలో నిల్చుని ఓట్లేస్తుంటే సామాన్యులు మాత్రం ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో సినిమాలు చూస్తున్నారా..? అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఓటేసిన సెలబ్రిటీలు
నటుడు అల్లు అర్జున్ పోలింగ్ బూత్ తెరిచిన తొలి గంటలోనే ఓటేస్తారు. ఈసారీ అలాగే వేశారు. జూనియర్ ఎన్టీఆర్ తన తల్లి, భార్యతో కలిసి వచ్చి ఓటేశారు. చిరంజీవి-సురేఖ దంపతులు, నాగార్జున -అమల దంపతులు, శ్రీ కాంత్, అల్లు అరవింద్, విజయ్ దేవరకొండ, నాగచైతన్య ఇలా సినీ తారలంతా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటేయకపోతే మీకు నిలదీసే హక్కేది..?
రండి.. మీకు నచ్చిన పార్టీకి ఓటేయండి.. కానీ అందరూ ఓటేయండి అని యువ హీరో విజయ్ దేవరకొండ పిలుపునిచ్చారు. ఆయన కుటుంబంతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటేయకుండా ఇంట్లో పడుకుంటే మీరు ఏ నాయకుణ్ని ఎన్నుకున్నట్లు అని నిర్మాత అల్లు అరవింద్ ప్రశ్నించారు. రండి లేచి వచ్చి ఓటేయండి అని యువతను కోరారు.