కన్వీన‌ర్ కోటా మెడిక‌ల్‌ పీజీ సీట్ల‌న్నీ తెలంగాణ విద్యార్థుల‌కే..

తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 2014 జూన్ రెండో తేదీ నాటికి పీజీ సీట్లు 515 ఉండ‌గా.. ప్రైవేటు కాలేజీల్లో సీట్లు 668 ఉన్నాయి. ఆ తర్వాత నెలకొల్పిన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అదనంగా వచ్చిన పీజీ సీట్లు 755.

Advertisement
Update:2023-07-29 08:05 IST

తెలంగాణ రాష్ట్రానికి చెందిన వైద్య విద్యార్థుల‌కు అద‌నంగా 117 మెడిక‌ల్ పీజీ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు రిజర్వేషన్లలో మార్పులు చేస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్త‌ర్వుల ప్ర‌కారం.. తెలంగాణ రాష్ట్రంలో 2014 జూన్ 2వ తేదీ తర్వాత ప్రారంభించిన అన్ని వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాలోని మొత్తం పీజీ సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి.

భ‌ర్తీ విధానం ఇదీ..

మెడికల్ పీజీలో తెలంగాణ ప్రభుత్వ కళాశాలల్లో 50 శాతం సీట్లు ఆలిండియా కోటా కింద జాతీయస్థాయి కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. మిగిలిన 50 శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద కేటాయిస్తారు. వీటితో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని పీజీ సీట్లలో 50 శాతం కూడా కన్వీనర్ కోటా కింద భర్తీ అవుతాయి. ఈ రెండింటికీ కాళోజీ విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేస్తుంది. గత ఏడాది వరకు ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద భర్తీ అయ్యే పీజీ సీట్లలో 15 శాతం సీట్లకు తెలంగాణ, ఏపీ విద్యార్థులు పోటీపడేవారు. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో 2014 జూన్ 2కు ముందు ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో మాత్రమే ఈ విధానాన్ని అమలు చేస్తారు. ఆ తర్వాత ఏర్పాటైన వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లు పూర్తిగా తెలంగాణ విద్యార్థులకు మాత్రమే కేటాయించనున్నారు.

తెలంగాణ విద్యార్థుల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగేలా నిబంధ‌న‌ల్లో మార్పు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విభ‌జ‌న సంద‌ర్భంగా ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపుపై నిబంధ‌న‌లు రూపొందించారు. వాటి ప్ర‌కారం విభజన అనంతరం పదేళ్లపాటు ఎంబీబీఎస్, మెడికల్ పీజీ కన్వీనర్ కోటా సీట్లలో 15 శాతం సీట్ల కోసం తెలంగాణ, ఏపీ విద్యార్థులు పోటీపడే అవ‌కాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ నిబంధనను రాష్ట్రం ఏర్పాటు కాకమునుపు ఉన్న మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లకు మాత్రమే వర్తించేలా తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ కూడా ఇటీవ‌ల ఇలాంటి ఉత్తర్వులనే జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. తాజాగా పీజీ మెడికల్ సీట్ల భర్తీ నిబంధనల్లో తెలంగాణ కూడా మార్పులు చేసింది.

సీట్లు ఇలా..

తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 2014 జూన్ రెండో తేదీ నాటికి పీజీ సీట్లు 515 ఉండ‌గా.. ప్రైవేటు కాలేజీల్లో సీట్లు 668 ఉన్నాయి. ఆ తర్వాత నెలకొల్పిన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అదనంగా వచ్చిన పీజీ సీట్లు 755. ప్రైవేటు కాలేజీల్లో అందుబాటులోకి వచ్చినవి 808. మొత్తం 1563 సీట్లలో కన్వీనర్ కోటా కింద భర్తీ అయ్యేవి 781. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఇందులో 15 శాతం కోటా సీట్లు 117 కాగా.. అవి కూడా తెలంగాణ విద్యార్థుల‌కే ద‌క్క‌నున్నాయి.

Tags:    
Advertisement

Similar News