నెరవేరిన రెండు దశాబ్దాల కల.. ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

సీఎం కేసీఆర్ రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని కింది నుంచి మీదకు తీసుకొని వచ్చారు. అందుకే ఈ రోజు కాలువలు కళకళలాడుతున్నాయి. అందుకే కేసీఆర్‌ను అపర భగీరథుడిగా రైతన్నలు ప్రశంసిస్తున్నారని అన్నారు.

Advertisement
Update:2023-10-04 13:50 IST

ప్రతీ ఎకరానికి సాగు నీరు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వలోని తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. రెండు దశాబ్దాల నిర్మాల్‌వాసుల కల సీఎం కేసీఆర్ చొరవతోనే సాకారమైందని మంత్రి కేటీఆర్ అన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలం గుండంపెల్లి వద్ద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ నెంబర్-27లో భాగంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎత్తిపోతల పథకాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ఎత్తిపోతల పథకం స్విచ్ ఆన్ చేసి కేటీఆర్ నీటిని విడుదల చేసి ప్రాజెక్టును రైతులకు అంకితం ఇచ్చారు.

కొత్తగా ప్రారంభించిన ఈ పథకం కోసం రూ.714 కోట్ల వ్యయం అయ్యింది. ఈ పథకం ద్వారా నిర్మల్ నియోజకవర్గంలోని దిలావర్‌పూర్, నేర్సాపూర్(జి), కుంటాల, సారంగాపూర్, నిర్మల్, లక్ష్మణ చాంద, మామడ, సోన్ మండలాల్లోని 99 గ్రామాల పరిధిలో గల చెరువులు, కుంటలకు నీరందించే అవకాశం ఉన్నది. 20 ఏళ్లుగా ఒకే పంటకు పరిమితం అయిన భూముల్లో ఇకపై మూడు పంటలకు నీళ్లు అందనున్నాయి. ప్రాజెక్టును మంజూరు చేసి, ప్రారంభించినందుకు సీఎం కేసీఆర్‌కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

పాక్‌పట్లలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్..

నిర్మల్ జిల్లా పాక్‌పట్ల గ్రామంలో ప్రి యునీక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్మించనున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ఇందాక ఇక్కడకు వస్తుంటే ఎస్సారెస్పీ కాలువ నిండుగా ఉన్నది. సీఎం కేసీఆర్ రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని కింది నుంచి మీదకు తీసుకొని వచ్చారు. అందుకే ఈ రోజు కాలువలు కళకళలాడుతున్నాయి. అందుకే కేసీఆర్‌ను అపర భగీరథుడిగా రైతన్నలు ప్రశంసిస్తున్నారని అన్నారు.

గతంలో కాకతీయ కాల్వ నీటి కోసం ఊర్ల మధ్య పంచాయితీలు జరిగేవి. కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేవు. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాల్వలపై మోటార్లు పెడితే ప్రభుత్వ అధికారులు వచ్చి కరెంటు వైర్లు కట్ చేసే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి కష్టాలు రైతులకు ఏమీ లేవని అన్నారు. రైతులు ఈ నీళ్లను ఉపయోగించుకొని ఎన్ని పుట్ల ధాన్యం పండించినా.. కేసీఆర్ ప్రభుత్వమే అంతా కొనుగోలు చేస్తోందని చెప్పారు.

శ్రీలక్ష్మీనరసింహసింహ స్వామి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లను అందించనున్నాము. ఇక పాక్‌పట్లలో రూ.300 కోట్లతో పామ్ ఆయిల్ పరిశ్రమను ప్రారంభించుకోనున్నాము. ఇండియా అవసరాల కోసం ఇండోనేషియా, మలేషియా నుంచి పామాయిల్ దిగుమతి చేసుకోవల్సి వస్తోంది. అంతే కాకుండా అందరూ వడ్లే పండిస్తే భవిష్యత్‌లో మనకు ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకే ఆయల్ పామ్‌ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని మంత్రి చెప్పారు. ఈ పంట నుంచి ఇక్కడే పామ్ ఆయిల్ తయారు చేయనున్నట్లు కేటీఆర్ చెప్పారు.

నిజామాబాద్, ఆదిలాబాద్, సిరిసిల్ల, నిర్మల్ జిల్లాకు చెందిన ఆయిల్ పామ్ పంటను ఈ కంపెనీనే కొనుగోలు చేస్తుంది. ఒక సారి ఆయిల్ పామ్ వేస్తే.. నాలుగేళ్ల తర్వాత నుంచి 30-35 ఏళ్ల పాటు రైతులకు ఆదాయం వస్తూనే ఉంటుందని కేటీఆర్ చెప్పారు. కాబట్టి రైతులు తప్పకుండా ఈ ఆయిల్ పామ్ పంట వైపు చూడాలని మంత్రి కేటీఆర్ సూచించారు. సారవంతమైన నేలలు ఉన్న తెలంగాణలో రైతులందరూ ఒకే పంట వేయకుండా.. వివిధ రకాల పంటలు వేయడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని కేటీఆర్ చెప్పారు.

రాబోయే ఎన్నికల్లో ఇంద్రకరణ్ రెడ్డిని గెలిపించండి.. కేసీఆర్‌ను మళ్లీ సీఎంగా ఎన్నుకోవాలని మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. ఆ విధంగా తెలంగాణ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని అన్నారు.

Tags:    
Advertisement

Similar News