6 అబద్ధాలు.. 66 మోసాలు

రేవంత్‌ సర్కార్‌ ఏడాది వైఫల్యాలపై నేడు బీజేపీ చార్జిషీట్‌

Advertisement
Update:2024-12-01 12:08 IST

రాష్ట్రప్రభుత్వ ఏడాది వైఫల్యాలను ప్రజలకు వివరించడానికి బీజేపీ సిద్ధమైంది. కాంగ్రెస్‌ పార్టీ విజయోత్సవాలను నిర్వహిస్తుంటే అందుకు ధీటుగా '6 అబద్ధాలు.. 66 మోసాలు' పేరుతో ప్రజల్లోకి వెళ్లడానికి బీజేపీ నిర్ణయించింది. ఇందులో ప్రభుత్వ వైఫల్యాల పేరిట నేడు చార్జిషీట్‌ విడుదల చేస్తున్నది. నేటి నుంచి బైక్‌ ర్యాలీలు, సదస్సులు నిర్వహించి ఈ నెల 6న భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ప్రణాళిక రూపొందిస్తున్నది. సరూర్‌ నగర్‌ వేదికగా నిర్వహించే బహిరంగ సభకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లేదా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను తీసుకురావాలని రాష్ట్ర నాయకత్వం సన్నాహాలు చేస్తున్నది.

ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చింది. 6 అబద్ధాలు.. 66 మోసాలు పేరుతో చార్జిషీట్‌ను కమలం పార్టీ సిద్ధం చేసింది. పాలకులే మారారు గానీ, పాలన మారలేదని, పేదల బతుకులు మారలేదనే నినాదాన్ని ప్రజల్లో గట్టిగా వినిపించబోతున్నది. మహాలక్ష్మి పథకం మొదలుకొని రైతుభరోసా, పింఛన్‌ సమస్యలు, సొంత ఇళ్లు, గృహజ్యోతి, యువతకు విద్యా భరోసా వంటి అంశాలను చార్జిషీట్‌లో పొందుపరిచింది. ఫిర్యాదు పత్రం ద్వారా రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యానికి బోనస్‌ వంటి అంశాల వారీగా గ్యారెంటీలు అందని బాధితుల వివరాలు తీసుకోనున్నది. అరాచక పాలన పేరుతో మూసీ, హైడ్రా, తెలంగాణ ఉద్యమకారులు, ఫార్మా సిటీ, పోలీస్‌ దౌర్జన్యాలు, ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ కమీషన్ల బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నది.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డిసెంబర్‌ 5 వరకు రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ, మండల స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కమలం పార్టీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను నేడు విడుదల చేయనున్నది. డిసెంబర్‌ 2,3 తేదీల్లో 119 నియోజకవర్గాల్లో బైక్‌ ర్యాలీలు చేపట్టనున్నది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 100 మంది కార్యకర్తలతో ర్యాలీలు నిర్వ హించి చార్జిషీట్‌లను పంపిణీ చేయాలని కార్యకర్తలకు పార్టీ దిశానిర్దేశం చేసింది. మండల కేంద్రాల్లో కార్నర్‌ మీటింగులు, రేవంత్‌ సర్కార్‌ పాలనా వైఫల్యాలపై ప్రచారం చేయాలని ఆదేశించింది. వీటితో ప్రజాసభ నిర్వహించాలని సూచించింది. రైతులు, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో నష్టపోయిన బాధితులను గుర్తించి వారిని సభలకు తీసుకొచ్చేలా ప్లాన్‌ చేస్తున్నది. కాంగ్రెస్‌ ఏడాది వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలనే బీజేపీ వ్యూహంగా కనిపిస్తున్నది. 

Tags:    
Advertisement

Similar News