హైదరాబాద్‌లో రూ.1,250 కోట్లతో టెక్‌నిప్ ఎఫ్ఎంసీ గ్లోబల్ డెలివరీ సెంటర్
ఫ్రెంచ్ అమెరికన్ ఆయిల్ అండ్ గ్యాస్ దిగ్గజ కంపెనీ టెక్‌నిప్ ఎఫ్ఎంసీ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా తమ గ్లోబల్ డెలివరీ సెంటర్, ఇంజనీరింగ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయనున్నది.
అమెరికాలో పర్యటిస్తున్న ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్.. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంలో సఫలం అవుతున్నారు. ఇప్పటికే అనేక ప్రతిష్టాత్మక కంపెనీలు హైదరాబాద్ సహా కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్, నల్గొండ వంటి ప్రాంతాల్లో తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ఒప్పందాలు చేసుకున్నాయి. ఇంత వరకు ఐటీ, బయో సైన్సెస్, ఫైనాన్స్, ఇన్స్యూరెన్స్ రంగాల్లోని కంపెనీలు పెట్టబడులకు ఆసక్తి చూపగా.. తాజగా ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించడానికి ఒప్పందం చేసుకున్నది.
ఫ్రెంచ్ అమెరికన్ ఆయిల్ అండ్ గ్యాస్ దిగ్గజ కంపెనీ టెక్‌నిప్ ఎఫ్ఎంసీ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా తమ గ్లోబల్ డెలివరీ సెంటర్, ఇంజనీరింగ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయనున్నది. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌తో టెక్‌నిప్ ఎఫ్ఎంసీ కంపెనీ ప్రతినిధులు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో రూ.1,250 కోట్ల పెట్టుబడితో డెలివరీ సెంటర్, మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని వల్ల ఇంజనీరింగ్‌లో 2,500 ఉద్యోగాలు.. మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో 1,000 ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ నిర్ణయం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
కాగా, హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ నుంచి ఏడాదికి రూ.5,400 కోట్ల విలువైన ఎగుమతులు ఉండనున్నాయి. ఇది హైదరాబాద్ ఎగుమతి రంగానికి మరింత ఊతాన్ని ఇవ్వనున్నది. హైదరాబాద్‌లో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలకు ఈ ఒప్పందం ఒక నిదర్శనమని మంత్రి కేటీఆర్ అన్నారు.
అమెరికాకు చెందిన ఎఫ్ఎంసీ టెక్నాలజీస్, ఫ్రాన్స్‌కు చెందిన టెక్‌నిప్ కంపెనీల విలీనం కారణంగా ఏర్పడిందే టెక్‌నిప్ ఎఫ్ఎంసీ. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఆఫ్ షోర్, ఆన్ షోర్, సబ్‌సీ ప్రాజెక్టులు చేపడుతోంది. ఎనర్జీ రంగంలో ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ వంటి ప్రాజెక్టులను దిగ్విజయంగా పూర్తి చేసింది. రష్యా, ఆస్ట్రేలియా, నార్వే, యూఏఈ, గయానా, మెక్సికో వంటి దేశాలతో పాటు ఇండియాలోని ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీ పలు ప్రాజెక్టులు చేపట్టింది. ఏపీలోని వశిష్ట, ఎస్1 ఫీల్డ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఈ కంపెనీనే చేపట్టింది.