350 వికెట్ల ఒకే ఒక్కడు!

భారత్ కమ్ రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ ను అవుట్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు.

Advertisement
Update:2024-05-08 17:15 IST

భారత్ కమ్ రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ ను అవుట్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు.

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ అనగానే వీరబాదుడు బ్యాటర్ల గేమ్ అన్నమాటే గుర్తుకు వస్తుంది. బ్యాటర్లకు మాత్రమే నిబంధనలు అత్యంత అనుకూలంగా ఉంటాయి.

ఇలాంటి పరిస్థితిలో బౌలర్లు రాణించడం, వికెట్లు పడగొట్టటం అరుదుగా జరుగుతూ ఉంటుంది.

బౌలర్ల ఊచకోతలా సాగే టీ-20 ఫార్మాట్లో 350 వికెట్లు పడగొట్టిన భారత తొలి బౌలర్ గా రాజస్థాన్ రాయల్స్ కమ్ భారత స్టార్ లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ రికార్డు నెలకొల్పాడు.

రిషభ్ పంత్ వికెట్ తో....

న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ప్రస్తుత 17వ సీజన్ 56వ మ్యాచ్ లో ఢిల్లీ సారథి రిషభ్ పంత్ ను అవుట్ చేయడం ద్వారా చహాల్ తన టీ-20 వికెట్ల సంఖ్యను 350కి పెంచుకోగలిగాడు.

తన కెరియర్ లో భారత్ తరపున ఆడిన అంతర్జాతీయ టీ-20లతో పాటు ఐపీఎల్ మ్యాచ్ లు కలుపుకొని...మొత్తం 301 మ్యాచ్ ల్లో 350 వికట్లతో చహాల్ అగ్రస్థానంలో నిలిచాడు. క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఆసియా ఆరవ బౌలర్ గా, 5వ స్పిన్నర్ గా రికార్డుల్లో చోటు సంపాదించాడు.

ముంబై ఇండియన్స్ లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా 310 వికెట్లతో రెండో అత్యంత విజయవంతమైన భారత టీ-20 బౌలర్ గా రికార్డుల్లో చేరాడు.

డ్వయన్ బ్రావో తరువాతే ఎవరైనా...

టీ-20 క్రికెట్ చరిత్రలోనే అత్యధికంగా 625 వికెట్లు పడగొట్టిన ప్రపంచ రికార్డు..చెన్నై సూపర్ కింగ్స్ మాజీ మీడియం పేస్ ఆల్ రౌండర్ డ్వయన్ బ్రావో పేరుతో ఉంది.

బ్రావో తన కెరియర్ లో 574 మ్యాచ్ లు ఆడి 625 వికెట్లు పడగొట్టగలిగాడు.

చహాల్ సాధించిన మొత్తం 350 వికెట్లలో భారత్ తరపున 96 వికెట్లు, ఐపీఎల్ లో వివిధ ఫ్రాంచైజీల తరపున 201 వికెట్లు సాధించాడు. తన అమ్ముల పొదిలోని లెగ్ బ్రేక్, గుగ్లీ, టాప్ స్పిన్ అస్త్ర్రాలతో ప్రపంచ మేటి బ్యాటర్లను సైతం బోల్తా కొట్టించగల దమ్ము, నేర్పు ఉన్న బౌలర్ గా చహాల్ కు గుర్తింపు ఉంది.

వెస్టిండీస్, అమెరికా సంయుక్త ఆతిథ్యంలో జరిగే 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టులో సైతం చహాల్ చోటు సంపాదించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుత ప్రపంచకప్ లో భారత తురుపుముక్క బౌలర్లలో చహాల్ కూడా ఒకడని భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News