అవును..వీరు వయసునే జయించారు!

క్రీడారంగంలో వయసును జయించిన క్రీడాకారుల సంఖ్య రానురాను పెరిగిపోతోంది. టెన్నిస్, ఫుట్ బాల్ లాంటి క్రీడల్లోనే ఇది ఎక్కువగా కనిపిస్తోంది.

Advertisement
Update:2023-07-03 15:01 IST

అవును..వీరు వయసునే జయించారు!

క్రీడారంగంలో వయసును జయించిన క్రీడాకారుల సంఖ్య రానురాను పెరిగిపోతోంది. టెన్నిస్, ఫుట్ బాల్ లాంటి క్రీడల్లోనే ఇది ఎక్కువగా కనిపిస్తోంది.

క్రీడలు అనగానే రక్తం ఉరకలేసే నవతరం క్రీడాకారులే రాణించగలరు అనుకొంటే అంతకు మించిన పొరపాటు మరొకటి లేదు. భారత టెన్నిస్ కు గత రెండుదశాబ్దాల కాలంగా సింగిల్స్, డబుల్స్ విభాగాలలో పలు అపురూపవిజయాలు అందించిన రోహన్ బొపన్న 43 సంవత్సరాల లేటు వయసులోనూ అంతర్జాతీయ టైటిల్స్ సాధిస్తూ వారేవ్వా! అనిపించుకొంటున్నాడు.

డేవిస్ కప్, ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ తో పాటు గ్రాండ్ స్లామ్ ( ఆస్ట్ర్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ తో) టెన్నిస్ టోర్నీలలోనూ రోహన్ గత 23 సంవత్సరాలుగా రాణిస్తూ దేశానికే గర్వకారణంగా నిలిచాడు.

2002లో డేవిస్ కప్ అరంగేట్రం...

2002 నుంచి గత 21 సంవత్సరాలుగా భారత డేవిస్ కప్ జట్టులో కీలక సభ్యుడిగా సేవలు అందిస్తున్న రోహన్ బొపన్నసింగిల్స్ తో పాటు డబుల్స్ లోనూ భారత్ కు పలు మ్యాచ్ ల్లో ప్రాతినిథ్యం వహించాడు.రోహన్ కు ప్రపంచ పురుషుల డబుల్స్ మేటి ఆటగాళ్లలో ఒకడిగా పేరుంది.

ప్రొఫెషనల్ టెన్నిస్ మిక్సిడ్ డబుల్స్ , పురుషుల డబుల్స్ విభాగాలలో పలు టైటిల్స్ సాధించిన రికార్డు సైతం రోహన్ కు ఉంది.

లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జాల తరువాత అత్యధిక 'ప్రో' టైటిల్స్ సాధించిన మొనగాడు రోహన్ మాత్రమే.

రోహన్ బొపన్న


32 డేవిస్ కప్ మ్యాచ్ లు..

22 ఏళ్ల వయసులో భారత డేవిస్ కప్ జట్టులో సభ్యుడిగా తన తొలిమ్యాచ్ ఆడిన రోహన్ గత సీజన్ వరకూ మొత్తం 32మ్యాచ్ లు ఆడాడు.

భారత్ తరపున గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టైటిల్స్ నెగ్గిన నలుగురు ప్లేయర్లలో రోహన్ కూడా ఒకడు కావటం విశేషం.

తన డేవిస్ కప్ కెరియర్ లో 32 సింగిల్స్, డబుల్స్ మ్యాచ్ లు ఆడిన రోహన్ 12 సింగిల్స్, 10 డబుల్స్ విజయాలు సాధించాడు. 43 సంవత్సరాల వయసులో తన ఆఖరి డేవిస్ కప్ మ్యాచ్ కు సిద్ధమవుతున్నాడు.

కెనడా ఆటగాడు డేనియల్ నెస్టర్ 42 సంవత్సరాల వయసులో సిన్ సినాటీమాస్టర్స్ టైటిల్ నెగ్గిన అత్యధిక వయసు కలిగిన ఆటగాడిగా నెలకొల్పిన రికార్డును.43 సంవత్సరాల వయసులో ఇండియన్ వెల్స్ ఏటీపీ టూర్ మాస్టర్స్ టైటిల్ నెగ్గడం ద్వారా రోహన్ బొపన్న తెరమరుగు చేశాడు.

అంతేకాదు..లండన్ లో ప్రారంభమైన 136వ వింబుల్డన్ టోర్నీలో పాల్గొంటున్న భారత ఏకైక క్రీడాకారుడిగా నిలిచాడు.

అలుపెరుగని వీరుడు సునీల్ ఛెత్రీ....

భారత ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ 38 సంవత్సరాల వయసులోనూ కుర్రాడిలా మ్యాచ్ లు ఆడేస్తూ అబ్బురపరుస్తున్నాడు. గత 18 సంవత్సరాలుగా

కేవలం తన ఆటతీరుతోనే భారత ఫుట్ బాల్ అస్థిత్వాన్ని కాపాడుతూ వస్తున్నాడు.

దేశంలోని గోవా, మహారాష్ట్ర, బెంగాల్, ఈశాన్య భారత రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన భారత ఫుట్ బాల్ ఇంకా బుడిబుడి అడుగుల దశలోనే ఉంది.

కేవలం బెంగాల్, గోవా, కేరళ రాష్ట్ర్రాలకు , ఈశాన్య భారత రాష్ట్ర్రాలకు మాత్రమే పరిమితమైన భారత్ ఫుట్ చరిత్రను ఓసారి తిరగేస్తే...వంద అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్లు ఇద్దరంటే ఇద్దరు మాత్రమే కనిపిస్తారు.

సిక్కిం నుంచి భారత్ ఫుట్ బాల్ లోకి దూసుకొచ్చిన బైచుంగ్ భూటియా దశాబ్దకాలం పాటు జాతీయ ఫుట్ బాల్ కు అసమాన సేవలు అందించి రిటైర్మెంట్ ప్రకటిస్తే..

ఆ స్థానాన్ని కెప్టెన్ సునీల్ చెత్రీ గత కొద్ది సంవత్సరాలుగా భర్తీ చేస్తూ వచ్చాడు.

గతంలో కేరళ స్ట్రయికర్ విజయన్, ఆ తర్వాత బైచుంగ్ భూటియా...ఈ ఇద్దరి వారసుడుగా సునీల్ చెత్రీ మాత్రమే అంతర్జాతీయస్థాయి ఫుట్ బాలర్లు గా గుర్తింపు సంపాదించుకొన్నారు.

భారత్ తరపున ఇప్పటికే పలు అత్యుత్తమ రికార్డులు నెలకొల్పిన సునీల్ 38 సంవత్సరాల వయసులోనూ అదే దూకుడు కొనసాగిస్తున్నాడు. భారత్ తరపున

వందకు పైగా అంత్జాతీయమ్యాచ్ లు ఆడి 913 గోల్స్ సాధించిన ఏకైక ఆటగాడు సునీల్ ఛెత్రీ మాత్రమే.

దక్షిణాసియా దేశాల (శాఫ్ ) ఫుట్ బాల్ టోర్నీలో సునీల్ ను సరికొత్త రికార్డు ఊరిస్తోంది. లెబనాన్ తో ముగిసిన సెమీఫైనల్స్ వరకూ 23 గోల్స్ సాధించడం ద్వారా మాల్దీవుల కెప్టెన్ అలీ అష్ఫాక్ రికార్డును సమం చేశాడు.

సునీల్ చెత్రీ 18 ఏళ్ల ఫుట్ బాల్ ప్రస్థానంలో..భారత్ ఐదుగురు రాష్ట్రపతులను, ఇద్దరు ప్రధానులను, ఎనిమిదిమంది క్రికెట్ కెప్టెన్లను, ఎనిమిదిమంది ఫుట్ బాల్ శిక్షకులను చూసింది. అంతేకాదు భారత జనాభా 19.00 శాతానికి పెరిగిపోయింది. భారత ఫుట్ బాల్ ర్యాంక్ 127 నుంచి 100కి మెరుగు పడింది.

క్రీడాకారుల సత్తాకు పరీక్షగా నిలిచే ఫుట్ బాల్ లో 38 సంవత్సరాల వయసులో సైతం ఆడగలుగుతున్న సునీల్ ఛెత్రీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

సునీల్ ఛెత్రీ

గ్రాండ్ స్లామ్ శిఖరం జోకోవిచ్...

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలో సెర్బియా ఆటగాడు నొవాక్ జోకోవిచ్ 36 సంవత్సరాల వయసులో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గడం ద్వారా తనకుతానే సాటిగా నిలిచాడు.

ప్రస్తుత వింబుల్డన్ పురుషుల సింగిల్స్ బరిలోకి దిగడం ద్వారా 24వ గ్రాండ్ స్లామ్ టైటిల్ వేటకు దిగాడు.

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో సెర్బియన్ థండర్ నొవాక్ జోకోవిచ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.23 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన తొలిఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు...

ఆధునిక టెన్నిస్ దిగ్గజాలు రోజర్ ఫెదరర్, రాఫెల్ నడాల్ సాధించలేని గ్రాండ్ రికార్డును సెర్బియన్ థండర్ నొవాక్ జోకోవిచ్ 36 సంవత్సరాల వయసులో సాధించాడు.

2023 సీజన్ ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ మూడోసారి కైవసం చేసుకోడం ద్వారా 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

పోరాటయోధుడు జోకోవిచ్...

గ్లోబల్ గేమ్ టెన్నిస్ లో నొవాక్ జోకోవిచ్ సాధించినన్ని అరుదైన ఘనతలు, అసాధారణ విజయాలు మరే ఆటగాడు సాధించలేదు. గాయాలు, శారీరక, మానసిక సమస్యలు...చివరకు కరోనా వైరస్ సైతం జోకోవిచ్ సంకల్పం, పట్టుదల, అంకితభావం ముందు చిన్నబోయాయి.

రోజర్ ఫెదరర్, రాఫెల్ నడాల్ లాంటి దిగ్గజ ప్రత్యర్థుల నుంచి ఓ వైపు గట్టిపోటీ ఎదుర్కొంటూ, వ్యక్తిగత సమస్యలతో మరోవైపు సతమతమైనా, పడుతూలేస్తూ తన కెరియర్ ను కొనసాగిస్తూ వచ్చిన జోకోవిచ్ అనుకొన్న లక్ష్యాన్ని సాధించడం ద్వారా గ్రాండ్ స్లామ్ టెన్నిస్ శిఖరంగా నిలిచాడు.

వింబుల్డన్ వండర్ రోజర్ ఫెదరర్, ఫ్రెంచ్ ఓపెన్ థండర్ రాఫెల్ నడాల్ ల ప్రాభవం అడుగంటడంతో జోకోవిచ్ కు ఎదురేలేకుండా పోయింది.

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లోని నాలుగు ( వింబుల్డన్, ఫ్రెంచ్, ఆస్ట్ర్రేలియన్, అమెరికన్ ఓపెన్ ) రకాల టోర్నీలలోనూ నిలకడగా రాణిస్తూ...కెరియర్ ట్రిపుల్ ను సాధించడం ద్వారా జోకోవిచ్ తనకుతానే సాటిగా నిలిచాడు.

నొవాక్ జోకోవిచ్


54 సంవత్సరాలలో ఒకే ఒక్కడు....

పచ్చిక కోర్టుల్లో జరిగే వింబుల్డన్, ఎర్రమట్టి కోర్టులో జరిగే ఫ్రెంచ్ ఓపెన్, నేర్పు, ఓర్పులకు పరీక్షగా నిలిచే యూఎస్ ఓపెన్, విపరీతమైన బౌన్స్ తో కూడిన సింథటిక్ కోర్టుల్లో జరిగే ఆస్ట్ర్రేలియన్ గ్రాండ్ స్లామ్ పోరులో ఒక్కసారి విజేతగా నిలిచినా గొప్పఘనతగానే భావిస్తారు. అయితే..జోకోవిచ్ మాత్రమే ఈ నాలుగు రకాల ట్రోఫీలను ఒకే ఏడాదిలో మూడు వేర్వేరు సందర్భాలలో సాధించడం ద్వారా కెరియర్ గ్రాండ్ స్లామ్ పూర్తి చేయగలిగాడు.

టెన్నిస్ పురుషుల చరిత్రలో ‘కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌’ (నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన) ఘనతను రెండుసార్లు చొప్పున సాధించిన ఆటగాళ్ళలో ఆస్ట్ర్రేలియా దిగ్గజాలు రాయ్‌ ఎమర్సన్‌( 1967 ), రాడ్‌ లేవర్‌ (1969) మాత్రమే ఉన్నారు.

అయితే...పారిస్ లో ముగిసిన 2023 ఫ్రెంచ్ ఓపెన్ పైనల్లో విజేతగా నిలవడం ద్వారా 3వ సీడ్ జోకోవిచ్ తన గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సంఖ్యను 23కు పెంచుకొన్నాడు.

ఇప్పటి వరకూ నడాల్ 22, రోజర్ ఫెదరర్ 21 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ మాత్రమే సాధించగా..ఈ ఇద్దరు మొనగాళ్లను జోకోవిచ్ అధిగమించడం ద్వారా 23 టైటిల్స్ నెగ్గిన తొలి ప్లేయర్ గా తనకుతానే సాటిగా నిలిచాడు.

ఓపెన్‌ శకంలో...అదీ 1968 తర్వాత నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ను కనీసం మూడుసార్లు చొప్పున గెలిచిన తొలి ఆటగాడిగా జోకోవిచ్ చరిత్ర సృష్టించాడు.

2016లో తొలిసారిగా ఫ్రెంచ్ఓపెన్ విజేతగా నిలిచిన జోకోవిచ్ మరో క్లే కోర్టు టైటిల్ కోసం 2021 వరకూ వేచిచూడక తప్పలేదు. కేవలం రెండేళ్ల విరామం లోనే మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ అందుకోగలిగాడు.

ప్రపంచ నంబర్ వన్ గా 378 వారాలు....

జోకోవిచ్ తన రెండుదశాబ్దాల కెరియర్ లో 10సార్లు ఆస్ట్ర్రేలియన్, 3 సార్లు యూఎస్ ఓపెన్, 7 సార్లు వింబుల్డన్, 3 ఫ్రెంచ్ ఓపెన్ లతో కలుపుకొని మొత్తం 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో అగ్రస్థానంలో నిలిచాడు.36 సంవత్సరాల వయసుకే 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో సహా మొత్తం 90 టోర్నీలు నెగ్గడంతో పాటు 1000 కోట్ల రూపాయలకు పైగా ప్రైజ్ మనీ ఆర్జించాడు.

2011 నుంచి 2023 మధ్యకాలంలో జోకోవిచ్ 20 గ్రాండ్ స్లామ్, 31 మాస్టర్స్, 4 ఏటీపీ టైటిల్స్ నెగ్గడం ద్వారా నడాల్, ఫెదరర్ లాంటి ప్రత్యర్థులపై తిరుగులేని ఆధిక్యం సాధించగలిగాడు. 2023 గ్రాండ్ స్లామ్ సీజన్ లో ఇప్పటికే రెండు టోర్నీలలో విజేతగా నిలిచిన జోకోవిచ్ మిగిలిన రెండు ( వింబుల్డన్, యూఎస్ ఓపెన్ ) టైటిల్స్ నెగ్గినా ఆశ్చర్యపోనక్కరలేదు. అంతేకాదు...378 వారాలపాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ లో నిలవడం ద్వారా మరోప్రపంచ రికార్డు సాధించాడు.

2008లో తన తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన జోకోవిచ్ గత 15 సంవత్సరాల కాలంలో మరో 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించడం ఓ తిరుగులేని రికార్డుగా మిగిలిపోతుంది.

43 ఏళ్ళ రోహన్, 38 సంవత్సరాల సునీల్ ఛెత్రీ, 36 సంవత్సరాల జోకోవిచ్ వివిధ తరాలకు చెందిన ప్రత్యర్థులతో పాటు వయసునూ జయించిన తీరు అమోఘం, అసాధారణం, అపూర్వం కూడా!

Tags:    
Advertisement

Similar News