కోట్లతో గాలం...మహిళా ఐపీఎల్ వేలం!

భారత మహిళా క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. ప్రారంభ మహిళా ఐపీఎల్ వేలం రికార్డులతో దద్దరిల్లింది.

Advertisement
Update:2023-02-14 11:34 IST
WPL 2023 Auction: Full list of most expensive Indian players

కోట్లతో గాలం...మహిళా ఐపీఎల్ వేలం!

  • whatsapp icon

భారత మహిళా క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. ప్రారంభ మహిళా ఐపీఎల్ వేలం రికార్డులతో దద్దరిల్లింది. ఇప్పటి వరకూ లక్షాధికారులుగా మాత్రమే ఉన్న పలువురు మహిళా క్రికెటర్లు కోట్లకు పడగలెత్తబోతున్నారు. భారత ఓపెనర్ స్మృతి మంథానాకు 3 కోట్ల 40 లక్షల రూపాయల రికార్డు ధర పలికింది.....

క్రికెట్ ను పెట్టుబడిలేని, లాభసాటి వ్యాపారంగా మార్చి, అంబానీ, అదానీ, విజయ్ మాల్యా, శ్రీనివాసన్ లాంటి బిజినెస్ మాగ్నెట్లను భాగస్వాములుగా చేసి..ప్రతిభావంతులైన క్రికెటర్లను కుబేరులుగా తీర్చిదిద్దటంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి తర్వాతే ఏదైనా.

గత 15 సీజన్లుగా పురుషుల ఐపీఎల్ తో వేలకోట్ల రూపాయలు వెనకేసుకొన్న బీసీసీఐ ఇప్పుడు మహిళా క్రికెట్ తోనూ వ్యాపారానికి తెరతీసింది.

మార్చి 4 నుంచి ముంబై వేదికగా జరిగే ప్రారంభ మహిళా ఐపీఎల్ తో వివిధ రూపాలలో ఆరువేల కోట్ల రూపాయలకు పైగా ఆర్జించింది. అంతేకాదు.. మొత్తం ఐదు ఫ్రాంచైజీల జట్ల కోసం నిర్వహించిన వేలం ద్వారా పలువురు జాతీయ, అంతర్జాతీయ క్రికెటర్లను కోట్లకు పడగలెత్తేలా చేసింది.

రికార్డు ధర పలికిన స్మృతి మందన...

ఐపీఎల్ వేలం పుణ్యమా అంటూ గ్రౌండ్ లోకి దిగకుండానే భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మందన, ఆస్ట్ర్రేలియా స్పిన్ ఆల్ రౌండర్ యాష్లీగా గార్డ్నర్, భారత స్పిన్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగేజ్ లాంటి క్రికెటర్లు కోటీశ్వరులుగా మారిపోయారు.

ఇప్పటి వరకూ మ్యాచ్ ఫీజులు, వార్షిక కాంట్రాక్టులతో లక్షల రూపాయలు మాత్రమే ఆర్జించిన మహిళా క్రికెటర్లు ప్రస్తుత ఐపీఎల్ వేలంతో కోట్ల రూపాయలను కళ్ల చూడబోతున్నారు.

భారత డాషింగ్ ఓపెనర్ స్మృతి మందనకు అత్యధికంగా 3 కోట్ల 40 లక్షల రూపాయల ధర పలికింది. 50 లక్షల రూపాయల కనీసధర తో ప్రారంభమైన వేలంలో స్మృతి కోసం ముంబై, బెంగళూరు ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోటీపడి 3 కోట్ల 40 లక్షల రూపాయల వద్ద ముగించాయి. చివరకు బెంగళూరు ఫ్రాంచైజీ స్మృతి మందనను సొంతం చేసుకోగలిగింది.

భారత యువబ్యాటర్ జెమీమా రోడ్రిగేజ్ ను ఢిల్లీ క్యాపిటల్స్ 2 కోట్ల 20 లక్షల రూపాయలకు వేలం ద్వారా దక్కించుకోగలిగింది. డాషింగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ సైతం 2 కోట్ల రూపాయల ధరకు ఢిల్లీ ఫ్రాంచైజీలో చేరింది.

టాప్ -5 లో ముగ్గురు భారత క్రికెటర్లు...

అత్యధిక ధర పలికిన మొదటి ఐదుగురు క్రికెటర్లలో ముగ్గురు భారత ప్లేయర్లు ఉన్నారు. డాషింగ్ ఓపెనర్ స్మృతి మందనకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 3 కోట్ల 40 లక్షల రూపాయలు చెల్లించడానికి ముందుకు వస్తే..ఆస్ట్ర్రేలియా స్పిన్ ఆల్ రౌండర్ యాష్లే గార్డ్నర్ ను 3 కోట్ల 20 లక్షల ధరకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకొంది. ఇంగ్లండ్ ప్లేయర్ నటాలియా స్కీయివర్ ను 3 కోట్ల 20 లక్షలకు, ఆల్ రౌండర్ దీప్తి శర్మను లక్నో వారియర్స్ 2 కోట్ల 60 లక్షలు, జెమీమా రోడ్రిగేజ్ ను 2 కోట్ల 20 లక్షల ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకొన్నాయి.

విదేశీ క్రికెటర్లలో గార్డ్నర్ టాప్...

ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక్కోజట్టు వేలం ద్వారా ఆరుగురు విదేశీ క్రికెటర్లను సొంతం చేసుకొనే అవకాశం ఉంది. వేలం ద్వారా 20 మంది సభ్యుల జట్టును సమకూర్చుకోడానికి ఒక్కో ఫ్రాంచైజీకి 12 కోట్ల రూపాయల మొత్తాన్ని మాత్రమే అనుమతించారు.

గౌతం అదానీ యజమానిగా ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టు ఆస్ట్ర్రేలియాకు చెందిన స్పిన్ ఆల్ రౌండర్ యాష్లీగా గార్డ్నర్ కు 3 కోట్ల 20 లక్షల రూపాయల రికార్డు ధర చెల్లించి మరీ దక్కించుకొంది.

భారత స్పిన్ ఆల్ రౌండర్ దీప్తి శర్మను యూపీ వారియర్స్ జట్టు 2కోట్ల 60 లక్షల రూపాయల ధరకు ఖాయం చేసుకొంది. ఇక..భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ను ముంబై ఫ్రాంచైజీ కేవలం కోటీ 80 లక్షల రూపాయల ధరకే సొంతం చేసుకోగలిగింది.

ఆస్ట్ర్రేలియా స్టార్ ఆల్ రౌండర్ ఎల్సీ పెర్రీని కేవలం కోటీ 70 లక్షల రూపాయల ధరకే బెంగళూరుజట్టు దక్కించుకోగలిగింది. న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డేవిస్ ను కారుచౌక ధరకే బెంగళూరు ఫ్రాంచైజీ గెలుచుకోగలిగింది. మొత్తం 12 కోట్ల నుంచి కేవలం ముగ్గురు స్టార్ ప్లేయర్ల కోసమే బెంగళూరు యాజమాన్యం 5 కోట్ల 60 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. మిగిలిన 6కోట్ల 40 లక్షల రూపాయలతో 17 మంది సభ్యులను సమకూర్చుకోవాల్సి ఉంది.

ఇంగ్లండ్ లెఫ్టామ్ స్పిన్నర్ సోఫియా ఈకెల్ స్టోన్ ను కోటీ 80 లక్షల రూపాయల ధరకు యూపీ వారియర్స్ సొంతం చేసుకోగలిగింది.

కనీస ధర దక్కని స్టార్ ప్లేయర్లు...

న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ సుజీ బేట్స్, హీథర్ నైట్, టామీ బ్యూమోంట్, అన్నాబెల్ సదర్లాండ్, సునీ లూస్, డానీ వెయిట్, దేవేంద్ర డోటిన్ లాంటి అంతర్జాతీయ స్టార్ ప్లేయర్లకు కనీస ధర సైతం దక్కలేదు. వేలంలో ఈ ప్లేయర్లె్వ్వరూ అమ్ముడు పోకుండా మిగిలిపోయారు.

దేశవిదేశాలకు చెందిన మొత్తం 409 మంది ప్లేయర్ల జాబితాతో వేలం కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరిలో 246 మంది భారత క్రికెటర్లు, మిగిలిన 163 మంది వివిధ దేశాలకు చెందిన ప్లేయర్లు. 202 మంది అంతర్జాతీయ క్రికెటర్లు కాగా.. మిగిలిన 199 మంది అంతర్జాతీయ అనుభవం లేని ప్లేయర్లు గా ఉన్నారు. మొత్తం ఐదు జట్లలో 90 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కనీస వేలం ధర రూ.50 లక్షల విభాగంలో 24 మంది ప్లేయర్లు,.40 లక్షల విభాగంలో 30 మంది ఉన్నారు. మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్ ) వేలం కార్యక్రమాన్ని ఓ మహిళే ( మల్లికా సాగర్ ) నిర్వహించడం ద్వారా చరిత్ర సృష్టించారు.

ముంబై వేదికగా 4 నుంచి మహిళా ఐపీఎల్...

ముంబై వేదిక‌గా మార్చి 4న ప్రారంభ మ‌హిళా ప్రీమియ‌ర్ లీగ్ మొద‌లు కానుంది. ఐదు జ‌ట్లు మొత్తం 22 మ్యాచ్‌లు ఆడ‌నున్నాయి. మార్చి 22న ఫైన‌ల్ మ్యాచ్ నిర్వహిస్తారు. లీగ్ బరిలో నిలిచే జట్లలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ ఉన్నాయి. ఐపీఎల్ మొదటి మూడు సీజన్లు ( 2023 నుంచి 2025 వరకూ) సీజన్ కు 22 మ్యాచ్ లు చొప్పున నిర్వహిస్తారు. లీగ్ దశలో ఒక్కోజట్టు మిగిలిన ప్రత్యర్థిజట్లతో రెండేసిమార్లు తలపడనుంది. లీగ్ దశలో టేబుల్ టాపర్ గా నిలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుకొంటుంది. రెండు, మూడుస్థానాలలో నిలిచిన జట్లు ఎలిమినేటర్ రౌండ్లో తలపడనున్నాయి. ప్రతి ఏడాది మార్చి నెలలో మాత్రమే మహిళా ఐపీఎల్ టోర్నీని నిర్వహిస్తారు.2026 సీజన్ నుంచి మ్యాచ్ ల సంఖ్య 33 లేదా 34 వరకూ ఉండే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.

పురుషుల ఐపీఎల్ జరిగినంత పట్టుగా, ఉత్కంఠభరితంగా మహిళా ఐపీఎల్ జరుగుతుందా?..వేచిచూడాల్సిందే.!

Tags:    
Advertisement

Similar News