వన్డే ప్రపంచకప్ లో నాలుగుస్తంభాలాట!
వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్స్ బెర్త్ ల కోసం పోరు ఆసక్తికరంగా సాగుతోంది. 10 జట్ల సమరం రౌండ్ రౌండ్ కూ కీలకంగా మారింది.
వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్స్ బెర్త్ ల కోసం పోరు ఆసక్తికరంగా సాగుతోంది. 10 జట్ల సమరం రౌండ్ రౌండ్ కూ కీలకంగా మారింది.
భారత్ వేదికగా నాలుగోసారి జరుగుతున్న 2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ రికార్డుల హోరు, సంచలనాల జోరుతో సాగిపోతోంది. సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్లోని నాలుగు బెర్త్ ల కోసం మొత్తం 10 జట్లు 9 మ్యాచ్ ల రౌండ్ రాబిన్ లీగ్ లో సమరం చేస్తున్నాయి.
నాలుగుజట్లకే నాకౌట్ రౌండ్ చేరే అవకాశం ఉండటంతో రౌండ్ రౌండ్ కూ పోరు ఉత్కంఠభరితంగా సాగుతోంది. మొదటి ఐదురౌండ్ల పోటీలు ముగిసే సమయానికి మొత్తం 10 జట్లలో 8 జట్ల సెమీస్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి.
అగ్రస్థానంలో భారత్....
ఆతిథ్య భారత్ మొదటి 5 రౌండ్లలో ఐదుకు ఐదుమ్యాచ్ లు నెగ్గి సెమీస్ లో చోటుకు ఓ గెలుపు దూరంలో నిలిచింది. ఆస్ట్ర్రేలియా, అఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లను చిత్తు చేయడం ద్వారా 10 పాయింట్లతో లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచింది. మిగిలిన నాలుగురౌండ్లలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లతో భారత్ తలపడాల్సి ఉంది. మిగిలిన నాలుగు మ్యాచ్ ల్లో ఒక్క మ్యాచ్ నెగ్గినా భారత్ కు సెమీస్ బెర్త్ ఖాయమవుతుంది. ఆరునూరైనా టాప్ ర్యాంకర్ భారత్ సెమీఫైనల్స్ చేరుకోడం ఖాయంగా కనిపిస్తోంది.
టాప్ గేర్ లో దక్షిణాఫ్రికా....
భారత్ తరువాత అత్యంత దూకుడుగా ఆడుతున్న జట్టు ఏదంటే మర్కరమ్ నాయకత్వంలోని దక్షిణాఫ్రికా అని చెప్పక తప్పదు. భీకరమైన బ్యాటింగ్, పదునైన బౌలింగ్ తో సఫారీటీమ్ మొదటి 5 రౌండ్లలో 4 విజయాలు, ఓ ఓటమి రికార్డుతో 8 పాయింట్లతో లీగ్ టేబుల్ రెండోస్థానంలో కొనసాగుతోంది. మొదటి 5 రౌండ్లలోని మూడుమ్యాచ్ ల్లో దక్షిణాఫ్రికా మూడుసార్లు 350కి పైగా స్కోర్లు సాధించడం విశేషం. మిగిలిన నాలుగురౌండ్లలో మరో రెండుమ్యాచ్ లు నెగ్గితేనే సెమీఫైనల్స్ చేరుకో గలుగుతుంది. పాకిస్థాన్, న్యూజిలాండ్, భారత్, అఫ్ఘనిస్థాన్ జట్లతో సఫారీటీమ్ తలపడాల్సి ఉంది. భారత్ తర్వాత నాకౌట్ రౌండ్ ఖాయంగా చేరే జట్టు దక్షిణాఫ్రికా మాత్రమే.
న్యూజిలాండ్ జోరుకు భారత్ పగ్గాలు...
లీగ్ దశ మొదటి నాలుగురౌండ్లలో నాలుగు విజయాలు సాధించిన న్యూజిలాండ్ జోరుకు భారత్ తో జరిగిన 5వ రౌండ్ లో బ్రేక్ పడింది. మొదటి 5 రౌండ్ల పోటీలు ముగిసే సమయానికి 8 పాయింట్లతో లీగ్ టేబుల్ మూడో స్థానంలో కివీజట్టు కొనసాగుతోంది. ఆఖరి నాలుగు రౌండ్లలో ఆస్ట్ర్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంకజట్లతో న్యూజిలాండ్ తలపడనుంది. మిగిలిన నాలుగురౌండ్లలో రెండు విజయాలు సాధించగలిగితేనే సెమీస్ చేరుకొనే అవకాశం ఉంది.
గాడిలో పడిన కంగారూ టీమ్....
ఐదుసార్లు విజేత ఆస్ట్ర్రేలియా గట్టి ప్రత్యర్థులపై తడబడుతున్నా..చిన్నజట్ల పైన మాత్రం పెద్ద విజయాలతో గాడిలో పడింది. ప్రారంభమ్యాచ్ లో భారత్ చేతిలో కంగుతిన్న కంగారూ టీమ్ మొదటి ఐదురౌండ్ల మ్యాచ్ ల్లో 3విజయాలు, 2 పరాజయాలతో 6 పాయింట్లు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ నాలుగోస్థానంలో నిలిచింది.
మిగిలిన నాలుగురౌండ్లలో మూడు విజయాలు సాధించగలిగితేనే సెమీస్ చేరుకొనే అవకాశం ఉంది. న్యూజిలాండ్, ఇంగ్లండ్, అప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ జట్లతో చివరి నాలుగురౌండ్లలో తలపడాల్సి ఉంది. పసికూన నెదర్లాండ్స్ పై 309 పరుగుల భారీవిజయం సాధించడం ద్వారా ఆస్ట్ర్రేలియా ఆత్మవిశ్వాసం కూడగట్టుకొంది.
అయోమయంలో పాకిస్థాన్...
ప్రపంచ రెండోర్యాంకర్ పాకిస్థాన్ పరిస్థితి రెండడుగులు ముందుకు, నాలుగడుగులు వెనక్కు అన్నట్లుగా తయారయ్యింది. మొదటి 5 రౌండ్లలో 2 విజయాలు, 3 పరాజయాలతో 4 పాయింట్లు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ 5వ స్థానంలో కొనసాగుతోంది.
భారత్, అప్ఘనిస్థాన్ జట్ల చేతిలో ఎదురైన పరాజయాలతో డీలా పడిపోయింది. సెమీస్ చేరాలంటే దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లతో జరిగే ఆఖరి నాలుగురౌండ్లలో ప్రతిమ్యాచ్ లోనూ నెగ్గి తీరాల్సి ఉంది.
పాక్ పై గెలుపుతో అప్ఘన్ హుషార్!
ప్రస్తుత ప్రపంచకప్ లో పెద్దజట్లను కంగుతినిపించడంలో ముందున్న అప్ఘనిస్థాన్ మొదటి ఐదురౌండ్లలో 2 విజయాలు, 3 పరాజయాలతో 4 పాయింట్లు సంపాదించింది. లీగ్ టేబుల్ 6వ స్థానంలో కొనసాగుతోంది.
ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్ల పై సాధించిన సంచలన విజయాలతో జోరు మీదున్న అప్ఘన్ జట్టు మిగిలిన నాలుగురౌండ్లలో శ్రీలంక, నెదర్లాండ్స్, ఆస్ట్ర్రేలియా, దక్షిణాఫ్రికాలను ఓడించి తీరాల్సి ఉంది.
గాల్లో దీపంలా శ్రీలంక...
మాజీ చాంపియన్ శ్రీలంక మొదటి 4 రౌండ్లలో ఓగెలుపు, మూడు ఓటమిలతో 2 పాయింట్లు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ 7వ స్థానంలో నిలిచింది.
చివరి 5 రౌండ్లలోనూ ఇంగ్లండ్, అప్ఘనిస్థాన్, భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లను ఓడించగలిగితేనే సెమీస్ చేరుకొనే అవకాశం ఉంది.
8వ స్థానంలో ఇంగ్లండ్...
ప్రస్తుత ప్రపంచకప్ లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలో నిలిచిన ఇంగ్లండ్ పరిస్థితి దయనీయంగా తయారయ్యింది. మొదటి నాలుగు రౌండ్లలో 2 పాయింట్లు మాత్రమే సాధించడం ద్వారా లీగ్ టేబుల్ 8వ స్థానానికి దిగజారిపోయింది.
చివరి ఐదురౌండ్లలో శ్రీలంక, భారత్, ఆస్ట్ర్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్థాన్ జట్లను ఓడించితీరగలిగితేనే నాకౌట్ రౌండ్ చేరే అవకాశం ఉంది.
9వ స్థానంలో బంగ్లాదేశ్...
మొదటి 5 రౌండ్లలో నాలుగు పరాజయాలు, ఒక్క గెలుపుతో 2 పాయింట్లు సాధించడం ద్వారా బంగ్లాదేశ్ 9వ స్థానానికి పడిపోయింది. మిగిలిన నాలుగు రౌండ్లలో నెదర్లాండ్స్, పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్ర్రేలియాజట్లను ఓడించగలిగితేనే సెమీస్ అవకాశాల్ని సజీవంగా నిలుపుకోగలుగుతుంది.
2 పాయింట్లతో నెదర్లాండ్స్...
రౌండ్ రాబిన్ లీగ్ మొదటి 5 రౌండ్లలో ఒకే ఒక్క గెలుపుతో 2 పాయింట్ల సాధించడం ద్వారా నెదర్లాండ్స్ లీగ్ టేబుల్ చిట్టచివరి స్థానంలో ఉంది. సెమీస్ చేరాలంటే మిగిలిన నాలుగురౌండ్లలో ప్రతిమ్యాచ్ నెగ్గాల్సి ఉంది.
మొదటి ఐదురౌండ్లలో మొత్తం 10 జట్లు కనీసం ఒక్కో విజయం సాధించడం విశేషం.
మొదటి 5 రౌండ్లలో సాధించిన విజయాలు, పాయింట్లు బట్టి చూస్తే భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సెమీస్ చేరుకోడం ఖాయంగా కనిపిస్తోంది. నాలుగో బెర్త్ కోసం ఆస్ట్ర్రేలియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ తీవ్రంగా పోటీపడుతున్నాయి.