మహిళా టెస్టులో భారత్ కు చిక్కిన కంగారూలు!

మహిళా క్రికెట్ శిఖరం ఆస్ట్ర్రేలియా ఎట్టకేలకు భారత్ కు చిక్కింది. నాలుగురోజుల టెస్టు తొలిరోజు ఆటలోనే కంగారూజట్టు 219 పరుగులకే కుప్పకూలింది

Advertisement
Update:2023-12-22 09:30 IST

మహిళా క్రికెట్ శిఖరం ఆస్ట్ర్రేలియా ఎట్టకేలకు భారత్ కు చిక్కింది. నాలుగురోజుల టెస్టు తొలిరోజు ఆటలోనే కంగారూజట్టు 219 పరుగులకే కుప్పకూలింది...

మహిళాటెస్టు క్రికెట్లో భారత్ వరుసగా రెండో విజయానికి ఉరకలేస్తోంది. గతవారం నవీముంబై వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన టెస్టులో 347 పరుగుల భారీవిజయం సాధించిన భారత్ కేవలం కొద్దిరోజుల వ్యవధిలోనే మరో దిగ్గజ జట్టు ఆస్ట్ర్రేలియాను కంగు తినిపించడానికి రంగం సిద్ధం చేసుకొంది.

పూజా స్వింగ్ కు కంగారూ కంగు...

ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈ నాలుగురోజుల టెస్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య భారత్ ప్రతర్థిని ఆలౌట్ చేయటమే కాదు..

తన తొలి ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 98 పరుగుల స్కోరుతో పటిష్టస్థితిలో నిలిచింది.

అంతకు ముందు కంగారూకెప్టెన్ అలీసా హేలీ కీలక టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొంది. అయితే..భారత బౌలర్లు మాత్రం స్థానబలంతో, పటిష్టమైన వ్యూహంతో చెలరేగిపోయారు.

ఓపెనింగ్ బౌలర్ పూజా వస్త్రకర్ ఇన్ స్వింగర్లతో కంగారూ టాపార్డర్ ను బెంబేలెత్తించింది. మరో వైపు ఆఫ్ స్పిన్నర్ స్నేహ రాణా సైతం పొదుపుగా బౌల్ చేస్తూ కంగారూలను ఉక్కిరిబిక్కిరి చేసింది.

ఓపెనర్ లిచ్ ఫీల్డ్ డకౌట్ కాగా..వన్ డౌన్ ఎల్సీ పెర్రీ 10 పరుగుల స్కోరుకే వెనుదిరిగింది. మరోస్టార్ ఓపెనర్ బెత్ మూనీ 40, తాహ్లా మెక్ గ్రాత్ 50, కెప్టెన్ అలీసా 38, సదర్లాండ్ 16 పరుగులతో పోరాడినా ప్రయోజనం లేకపోయింది.

చివరకు ఆస్ట్ర్రేలియా 77.4 ఓవర్లలో 219 పరుగులు మాత్రమే చేయగలిగింది.

భారత బౌలర్లలో మీడియం పేసర్ పూజా వస్త్రకర్ 53 పరుగులిచ్చి 4 వికెట్లు, స్నేహా రాణా 56 పరుగులిచ్చి 3 వికెట్లు, దీప్తి శర్మ 46 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టారు.

భారత ఓపెనర్ల జోరు....

ఆ తరువాత..భారత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన స్మృతి మందన- షెఫాలీవర్మ 90 పరుగుల భాగస్వామ్యంతో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. షెఫాలీ 59 బంతుల్లోనే 8 ఫోర్లతో 40 పరుగుల స్కోరుకు తొలి రోజు ఆట ముగియటానికి కొద్ది బంతుల ముందే అవుటయ్యింది. మరో ఓపెనర్ స్మృతి 49 బంతుల్లో 8 బౌండ్రీలతో 43 పరుగులతో అజేయంగా నిలిచింది. స్పిన్ ఆల్ రౌండర్ స్నేహ రాణా 4 పరుగులతో క్రీజులో ఉంది.

కంగారూ బౌలర్లు కేవలం 19 ఓవర్లలోనే 17 ఫోర్లు సమర్పించుకొని తీవ్రఒత్తిడిలో పడిపోయారు.

ఈరోజు జరిగే రెండోరోజు ఆటలో భారత్ నిలదొక్కుకొని భారీగా పరుగులు సాధించగలిగితే కంగారూజట్టుకు కష్టాలు తప్పవు. ఆస్ట్రేలియా తొలిఇన్నింగ్స్ స్కోరును అధిగమించాలంటే భారత్ 122 పరుగులు చేస్తే చాలు.

తొలిఇన్నింగ్స్ లో ఆతిథ్య భారత్ కనీసం 250కి పైగా పరుగుల ఆధిక్యత సాధించగలిగితేనే విజయావకాశాలు ఉంటాయి.

ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా ఇప్పటి వరకూ ఆడిన 10 టెస్టుల్లో 4 పరాజయాలు, 6 డ్రాల రికార్డుతో ఉన్న భారత్ తొలి విజయం కోసం ఎదురుచూస్తోంది.

Tags:    
Advertisement

Similar News