హైదరాబాద్ క్రికెట్ జట్టు రంజీ ఎప్పుడు గెలిచింది? వీవీఎస్ లక్ష్మణ్ స్మరించుకొనే బాబ్జీ ఎవరు?
హైదరాబాద్ రెండో సారి రంజీ గెలిచినప్పుడు కెప్టెన్‌గా ఎంవీ నరసింహారావు వ్యవహరించారు.
వెంకటపతి రాజు టీమ్ ఇండియాలోకి ఎలా వచ్చాడో తెలుసా? వీవీఎస్ లక్ష్మణ్ క్రికెటింగ్ పాఠాలు ఎక్కడ నేర్చుకున్నాడో ఎపుడైనా చదివారా? అసలు హైదరాబాద్ క్రికెట్ జట్టు రంజీ ట్రోఫీ చివరి సారిగా ఎప్పుడు గెలుచుకున్నది? దేశవాళీ క్రికెట్‌లో అత్యున్నత టోర్నీలో హైదరాబాద్ ఎన్ని సార్లు ఛాంపియన్‌గా నిలిచింది? ఇవన్నీ మీకు ఏమైనా తెలుసా? సరే ఇన్ని ప్రశ్నలు ఎందుకు? అసలు ఈ ముచ్చట ఇప్పుడు ఎందుకు అంటారా? అక్కడికే వస్తున్నా.. అసలు విషయం ఏంటో ఇప్పుడు చదివి తెలుసుకోండి.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్వాతంత్రానికి పూర్వమే 1934లో ప్రారంభమైంది. అప్పట్లో నిజాం సర్కారు క్రికెటర్లను ఎంతో ప్రోత్సహించేది. బ్రిటిష్ వాళ్ళతో పాటు, హైదరాబాద్ ముస్లింలే ఎక్కువగా ఆ జట్టులో ఉండేవారు. అయితే హైదరాబాద్ జట్టు ఏర్పడిన నాలుగేళ్లకే రంజీ ఛాంపియన్‌గా మారింది. సెమీఫైనల్‌లో అనూహ్యంగా వాకోవర్ వచ్చినా.. ఫైనల్‌లో మాత్రం కెప్టెన్ ఎడ్డీ ఐబారా జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టాడు.1942-43, 1964-65లో ఫైనల్స్ చేరినా గెలవలేక పోయింది. కానీ చివరి సారిగా హైదరాబాద్ జట్టు 1986-87లో రెండో సారి రంజీ గెలిచింది.
హైదరాబాద్ రెండో సారి రంజీ గెలిచినప్పుడు కెప్టెన్‌గా ఎంవీ నరసింహారావు వ్యవహరించారు. ఆ జట్టులో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు కూడా ఉన్నాడు. రంజీ గెలిపించిన కెప్టెన్ నరసింహారావు ఆ తర్వాత కాలంలో హైదరాబాద్‌లో గ్రేట్ కోచ్‌గా మారారు. ఎంతో మంది భావి క్రికెటర్లకు శిక్షణ ఇచ్చారు. అలా శిక్షణ తీసుకున్న వారిలో ఆల్ టైం గ్రేటెస్ట్ టెస్ట్ క్రికెటర్లలో ఒకరైన వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఉన్నాడు. ఎంవీ నరసింహారావుతో కలిసి ఆడిన, శిక్షణ తీసుకున్న, పరిచయం ఉన్న క్రికెటర్లు ముద్దుగా బాబ్జీ అని పిలిచుకుంటారు. కొంత మంది బాబ్జీ అని పిలిస్తే మరి కొంత మంది బాబీ అంటారు.
రంజీ ట్రోఫీ విన్నింగ్ కెప్టెన్ బాబీ చాలా కాలం హైదరాబాద్‌లోనే యువకులు శిక్షణ ఇచ్చారు. అనంతరం రెండు దశాబ్దాల క్రితం ఐర్లాండ్ వెళ్లారు. అక్కడ కూడా తన క్రికెట్ ఆసక్తిని కొనసాగించారు. కోచ్‌గా అక్కడ చాలా పాపులర్ అయ్యారు. 20 ఏళ్ల తర్వాత శనివారం హైదరాబాద్ వచ్చారు. 'బాబీ-ఇండియా అండ్ ఐర్లాండ్.. ఏ లవ్ స్టోరీ' పేరుతో వెలువడిన తన బయోగ్రఫీని నిన్న ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, వీవీఎస్ లక్ష్మణ్, ఇతర బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన స్మృతులను ఆయన గుర్తు చేసుకున్నారు. అనంతరం క్రికెట్‌లో వస్తున్న మార్పులు, ఇతర విషయాలపై చర్చించారు. దీనికి సంబంధించిన పోస్టును వీవీఎస్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశారు.