ప్ర‌స్తుత భార‌త జ‌ట్టులో నాలా బ్యాటింగ్ చేసే ఆట‌గాళ్లు లేరు.. - సెహ్వాగ్

టెస్టు క్రికెట్‌లో రిష‌బ్ పంత్ 90-100తో సంతృప్తి చెందుతున్నాడని, కానీ తాను 200, 250, 300 ప‌రుగులు చేసి సంతృప్తి చెందాన‌ని సెహ్వాగ్ వివ‌రించారు.

Advertisement
Update:2023-03-21 09:00 IST

ప్ర‌స్తుత భార‌త జ‌ట్టులో త‌న‌లా బ్యాటింగ్ చేసే ఆట‌గాళ్లు లేర‌ని వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. ఇటీవ‌ల ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. అయితే ఇద్ద‌రు ఆట‌గాళ్లు మాత్రం కాస్త ద‌గ్గ‌ర‌గా వ‌చ్చార‌ని ఆయ‌న చెప్పారు. వారిద్ద‌రూ పృథ్వీషా, రిష‌బ్ పంత్ అని ఆయ‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. రిష‌బ్ పంత్ మాత్రం ఇంకాస్త స‌న్నిహితంగా వ‌చ్చిన‌ట్టు ఆయ‌న చెప్పారు.

టెస్టు క్రికెట్‌లో రిష‌బ్ పంత్ 90-100తో సంతృప్తి చెందుతున్నాడని, కానీ తాను 200, 250, 300 ప‌రుగులు చేసి సంతృప్తి చెందాన‌ని సెహ్వాగ్ వివ‌రించారు. అతను తన ఆటను ఆ స్థాయికి తీసుకెళితే అభిమానులను మరింత అలరించగలడని తాను భావిస్తున్న‌ట్టు చెప్పారు.

వెయిట్‌లిఫ్టింగ్ వ‌ద్దు.. ఆట‌పైనే దృష్టిపెట్టాలి..

ప‌లువురు ఆట‌గాళ్లు త‌ర‌చూ గాయాల‌పాల‌వ‌డంపై సెహ్వాగ్ స్పందిస్తూ.. ఇటీవ‌ల కాలంలో భారత ఆటగాళ్లు మైదానంలో కాకుండా జిమ్‌లో గాయపడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఆటగాళ్ల గాయంలో వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఆటగాళ్లు వెయిట్ లిఫ్టింగ్‌కు వెళ్లకుండా తమ ఆటపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని సెహ్వాగ్ సూచించారు.

క్రికెట్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌కు స్థానం లేదని సెహ్వాగ్ చెప్పారు. దానికి బదులుగా.. ఆట‌గాళ్లు త‌మ‌ ఆటను మెరుగుపరిచే వ్యాయామాలు చేయాల‌ని ఆయ‌న సూచించారు. వెయిట్‌లిఫ్టింగ్ బలాన్ని ఇస్తుందని, కానీ గాయ‌పడేలా చేస్తుందని చెప్పారు. తాము ఆడిన కాలంలో ఆకాష్ చోప్రా, గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్.. ఎవ‌రూ వీపు గాయాలు, న‌రాలు ప‌ట్టేయ‌డం వంటి కార‌ణాల‌తో జ‌ట్టు నుంచి తొల‌గించ‌బ‌డ‌లేద‌ని సెహ్వాగ్ వివ‌రించారు.

Tags:    
Advertisement

Similar News