విరాట్ వెలవెల..భారత్ విలవిల!

భారత క్రికెట్ నయా పరుగుల యంత్రం, స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ టెస్టుజట్టుకే అలకరణగా మారాడు

Advertisement
Update:2023-03-05 09:30 IST

భారత క్రికెట్ నయా పరుగుల యంత్రం, స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ టెస్టుజట్టుకే అలకరణగా మారాడు. రెండంకెల స్కోర్లతో టాపార్డర్ కే భారంగా నిలిచాడు..

టెస్టు క్రికెట్లో భారత నయా పరుగుల యంత్రం విరాట్ కొహ్లీకి ఏమయ్యింది. గత మూడేళ్లుగా ఎందుకు విఫలమవుతూ వస్తున్నాడు. ప్రస్తుత బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో సైతం విరాట్ వెలవెలబోతుంటే భారతజట్టు విలవిలలాడిపోతోంది.

గత 15 ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ కరువు..

ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టు ఆస్ట్ర్రేలియాతో జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లోని మూడో టెస్టు వరకూ 34 సంవత్సరాల విరాట్ కొహ్లీకి ఆడిన 107 మ్యాచ్ ల్లో 27 శతకాలు, 28 అర్థశతకాలు బాదిన రికార్డు ఉంది.

అయితే..గత మూడేళ్లుగా సెంచరీ సాధించని విరాట్ ...గత 15 ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచ‌రీ సైతం నమోదు చేయలేకపోయాడు. గత మూడుటెస్టులు, 5 ఇన్నింగ్స్ లో విరాట్ కేవలం 111 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

నాగపూర్, అహ్మదాబాద్ టెస్టుల్లో దారుణంగా విఫలమైన విరాట్...ఢిల్లీ టెస్టులో మాత్రం పర్వాలేదనిపించాడు.

స్పిన్నర్లకు దొరికిపోతున్న విరాట్..

14 సంవత్సరాల తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ లో అత్యంత వేగంగా 25వేల పరుగులు, 74 శతకాలు బాదిన మొనగాడిగా రికార్డుల మోత మోగించిన విరాట్..

గత మూడేళ్లుగా ప్రత్యర్థి స్పిన్ బౌలర్లకు అడ్డంగా దొరికిపోతున్నాడు.

స్పిన్న‌ర్లను ఎదుర్కొనడంలో ఇబ్బంది ప‌డుతున్నాడు. ప్రస్తుత బోర్డ‌ర్ – గ‌వాస్క‌ర్ ట్రోఫీలో అయితే విరాట్ ఐదుకు ఐదుసార్లూ స్పిన్న‌ర్లకే చిక్కాడు. కంగారూ స్పిన్ త్ర‌యం నాథ‌న్ లియాన్, టాడ్ మ‌ర్ఫీ, కున్ మాన్‌ల‌పై ఆధిప‌త్యం చెలాయించ‌లేక‌పోయాడు.

లెఫ్టామ్ స్పిన్నర్ కున్ మాన్ కు ప్రస్తుత సిరీస్ లో ఇప్పటికే మూడుసార్లు తన వికెట్ ను అప్పజెప్పాడు.

గత మూడేళ్లుగా వెలవెల!

ప్రధానంగా టెస్టు క్రికెట్లో గత మూడేళ్లుగా ఆడిన 23 టెస్టుమ్యాచ్ ల్లో విరాట్ 1000 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మూడంకెల స్కోరు సాధించడంలో విఫలమైన కొహ్లీ సగటు 26.20గా మాత్రమే ఉంది. 2022 జ‌న‌వ‌రిలో ద‌క్షిణాఫ్రికాపై సాధించిన 79 ప‌రుగుల స్కోరే కోహ్లీ గత మూడేళ్లలో సాధించిన అత్యధిక వ్యక్తిగత టెస్టు స్కోరు కావడం విశేషం.

మూడేళ్ల క్రితం ముగిసిన ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ త‌ర్వాత కోహ్లీ టెస్టుల్లో విరాట్ అంతగా రాణించలేకపోయాడు.. ఫామ్ కోల్పోయిన కోహ్లీ ఈ ఫార్మాట్‌లో ఒక్క సెంచ‌రీ సాధించలేకపోయాడు. 2019లో బంగ్లాదేశ్ తో జరిగిన డే-నైట్ టెస్టులో సాధించినదే విరాట్ కు టెస్టు క్రికెట్లో చివరి శతకంగా ఉంది.

నేథన్ లయన్ బన్నీ విరాట్ కొహ్లీ...

ఆస్ట్ర్రేలియా ఆఫ్ స్పిన్ జాదూ నేథన్ లయన్ బౌలింగ్ కు దిగాడంటే చాలు విరాట్ గుండెల్లో గుబులు పుడుతుంది. వెంటనే వికెట్ సమర్పించుకొని పెవీలియన్ దారి పట్టడం విరాట్ కు ఓ ప్రధాన బలహీనతగా మారింది.

ఫాస్ట్ , మీడియా పేస్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ వస్తున్న విరాట్ కొహ్లీకి స్పిన్నర్ల దడ పట్టుకొంది. ప్రధానంగా టెస్టు క్రికెట్లో నాణ్యమైన స్పిన్ బౌలర్లను ఎదుర్కొనడంలో విరాట్ తడబడుతూ వస్తున్నాడు. దీటుగా ఎదుర్కొనలేక నానాపాట్లు పడుతున్నాడు.

ఆస్ట్ర్రేలియా తురుపుముక్క, ఆఫ్ స్పిన్నర్ నేథన్ లయన్ అంటే విరాట్ కు ఏదో తెలియని భయం పట్టుకొంది. టెస్టుమ్యాచ్ ల్లో విరాట్ ను లయన్ ఇప్పటి వరకూ 7సార్లు పడగొట్టడం చూస్తే ఎంతగా తడబడుతున్నదీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

విరాట్ ఫామ్ పై ఇర్ఫాన్ పఠాన్ ఆందోళన..

టెస్టు ఫార్మాట్లో భార‌త స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ ఫామ్ ఆందోళ‌న కలిగిస్తోందని మాజీ ఆల్‌రౌండ‌ర్, వ్యాఖ్యాత ఇర్ఫాన్ ప‌ఠాన్ చెప్పాడు. 2020 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ టెస్టుల్లో కోహ్లీ సాధించిన ప‌రుగులు చూస్తే విస్మయం క‌లుగుతోందని అన్నాడు. ‘ప్ర‌పంచంలోనే మేటి క్రికెట‌ర్, మూడు ఫార్మాట్ల‌లో దాదాపు 25 వేల ప‌రుగులు చేసిన కోహ్లీ లాంటి ఆట‌గాడు స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోడం బాధ కలిగిస్తోందని వాపోయాడు. అంతేకాదు స్పిన్న‌ర్ల‌ను ఎద‌ర్కోవ‌డంలో కొహ్లీ తెగ ఇబ్బంది ప‌డిపోతున్నాడని గుర్తు చేశాడు.

స్పిన్ బౌలర్లను ఎదుర్కొంటున్న సమయంలో విరాట్ స్ట్రయిక్ రేటు చాలా త‌క్కువ ఉంది. ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్‌లో నేథన్ లయన్, మర్ఫీ, కున్ మాన్ లాంటి కంగారూ స్పిన్న‌ర్ల‌ను విరాట్ ధీటుగా ఎదుర్కొనలేక రెండంకెల స్కోర్లకే పరిమితమవుతున్నాడు.

అహ్మదాబాద్ వేదికగా ఈనెల 9నుంచి జరిగే ఆఖరిటెస్టులో నైనా విరాట్ మూడంకెల స్కోరు సాధించలేకపోతే తుదిజట్టులో చోటుపై చర్చకు తెరలేచే ప్రమాదం లేకపోలేదు.

Tags:    
Advertisement

Similar News