శ్రీలంకతో వన్డే సిరీస్ కు దిగ్గజ జోడీ దూరం!
ఐసీసీ మినీ ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ కు భారత దిగ్గజ ఆటగాళ్లు విరాట్, రోహిత్ దూరం కానున్నారు.
ఐసీసీ మినీ ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ కు భారత దిగ్గజ ఆటగాళ్లు విరాట్, రోహిత్ దూరం కానున్నారు.
అమెరికా- కరీబియన్ క్రికెట్ బోర్డుల సంయుక్త ఆతిథ్యంలో ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ముగిసిందో లేదో...ఐసీసీ మినీ ప్రపంచకప్ ( చాంపియన్స్ ట్రోఫీ)కు టాప్ ర్యాంకర్ భారత్ సన్నాహాలు ప్రారంభించనుంది.
ఈ నెల ఆఖరి వారంలో శ్రీలంకతో జరిగే తీన్మార్ వన్డే సిరీస్ బరిలో ప్రపంచ నంబర్ వన్ టీమ్ భారత్ నిలువనుంది. అయితే..దిగ్గజ జోడీ , కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ లేకుండానే భారతజట్టు సరికొత్త కెప్టెన్ సారథ్యంలో పోటీకి దిగనుంది.
రాహుల్ లేదా హార్థిక్ పాండ్యా....
గత ఆరుమాసాలుగా తీరికలేని విధంగా క్రికెట్ సిరీస్ లు, టోర్నీలు ఆడుతూ వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ సైతం కొద్దివారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఎంపిక సంఘానికి తెలపడంతో స్టాప్ గ్యాప్ కెప్టెన్ కోసం అన్వేషణ మొదలయ్యింది.
వికెట్ కీపర్ బ్యాటర్ కెల్ రాహుల్ లేదా పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాలలో ఒకరిని శ్రీలంకతో సిరీస్ కు కెప్టెన్ గా ఎంపిక చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
గత ఆరుమాసాలుగా భారత్ ఆడిన ప్రతి ఒక్క సిరీస్ లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొంటూ వచ్చాడు. గత డిసెంబర్- జనవరి మాసాలలో దక్షిణాఫ్రికాతో టెస్టు లీగ్ సిరీస్, ఆ వెంటనే అప్ఘనిస్థాన్ తో టీ-20 సిరీస్ , ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ లు ఆడిన రోహిత్...మూడుమాసాల ఐపీఎల్ లీగ్, టీ-20 ప్రపంచకప్ టోర్నీలలో పాల్గొన్నాడు. దీంతో క్రికెట్ నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించాడు.
మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ సైతం కుటుంబసభ్యులతో కలసి గడపడం కోసం కొద్దివారాలపాటు క్రికెట్ కు దూరం కావాలని నిర్ణయించాడు.
వన్డే, టెస్టు ఫార్మాట్లకే పరిమితం..
ఐసీసీ టీ-20 ప్రపంచకప్ సాధించిన వెంటనే రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ..అంతర్జాతీయ టీ-20కి రిటైర్మెంట్ ప్రకటించారు. 50 ఓవర్ల వన్డే, సాంప్రదాయ టెస్టు ఫార్మాట్లలో కొనసాగాలని నిర్ణయించారు.దీనికితోడు టెస్టు, వన్డే ఫార్మాట్లలో భారతజట్లకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడంటూ బీసీసీఐ కార్యదర్శి జే షా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
వచ్చే సెప్టెంబర్ నుంచి జనవరి మధ్యకాలంలో భారత్ ఆడే మొత్తం 10 టెస్టులు, వన్డే మ్యాచ్ ల్లో రోహిత్, విరాట్ పాల్గొనాల్సి ఉంది. ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా బంగ్లాదేశ్ తో రెండుమ్యాచ్ లు, న్యూజిలాండ్ తో మూడుమ్యాచ్ ల టెస్టు సిరీస్ ల్లో భారత్ కు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. ఆ తరువాత ఆస్ట్ర్రేలియాతో జరిగే ఐదుమ్యాచ్ ల బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో సైతం భారత్ పాల్గొనాల్సి ఉంది.
రానున్న వర్క్ లోడ్ ను దృష్టిలో ఉంచుకొని రోహిత్, విరాట్ ..సాధ్యమైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు. శ్రీలంకతో ఈనెల ఆఖరి వారంలో ప్రారంభమయ్యే తీన్మార్ వన్డే సిరీస్ లో రోహిత్,విరాట్ పాల్గొనబోరని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.