విరాట్ కొహ్లీని ఊరిస్తున్న అరడజను రికార్డులు!

Virat Kohli Records: భారత సూపర్ స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ ఈ రోజు ప్రారంభమయ్యే టెస్టు లీగ్ ఫైనల్లో ఒక్క శతకంతో భారీస్కోరు సాధించినా పలు సరికొత్త రికార్డులు నెలకొల్పే అవకాశం ఉంది.

Advertisement
Update:2023-06-07 11:49 IST

Virat Kohli Records: విరాట్ కొహ్లీని ఊరిస్తున్న అరడజను రికార్డులు!

భారత సూపర్ స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ ఈ రోజు ప్రారంభమయ్యే టెస్టు లీగ్ ఫైనల్లో ఒక్క శతకంతో భారీస్కోరు సాధించినా పలు సరికొత్త రికార్డులు నెలకొల్పే అవకాశం ఉంది.

భారత క్రికెట్ పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ..ఓవల్ వేదికగా ఈరోజు ఆస్ట్ర్రేలియాతో జరిగే ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్లోనూ గత ఏడాదికాలంజోరునే కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

జూన్ 7 నుంచి ఐదురోజులపాటు ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా జరిగే టెస్టు లీగ్ టైటిల్ సమరంలో భారత బ్యాటింగ్ ఆర్డర్ కే 34 సంవత్సరాల విరాట్ కొహ్లీ వెన్నెముకగా నిలిచాడు.

కొద్దిరోజుల క్రితమే ముగిసిన ఐపీఎల్ -16 వ సీజన్ సమరంలో రెండు సెంచరీలు, అరడజను హాఫ్ సెంచరీలతో పరుగుల మోత మోగించిన విరాట్ ..టెస్టు లీగ్ ఫైనల్లో సైతం ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగబోతున్నాడు.

ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగానే విరాట్ కు అత్యధిక పరుగులు...

అత్యున్నత ప్రమాణాలకు మరో పేరైన ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా ఉంటే అత్యుత్తమంగా రాణించడంలో విరాట్ కొహ్లీ తర్వాతే ఎవరైనా. ఆస్ట్ర్రేలియాపైన విరాట్ ఆడిన 24 టెస్టుమ్యాచ్ ల్లో 1979 పరుగులతో 48.26 సగటు నమోదు చేశాడు. ఇందులో 8 శతకాలు, ఐదు అర్థశతకాలు సైతం ఉన్నాయి. 186 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నమోదయ్యింది.

మొత్తం మూడు ఫార్మాట్లలోనూ ఆస్ట్ర్రేలియాపైన ( టెస్టులు, వన్డేలు, టీ-20) 92 మ్యాచ్ లు ఆడిన విరాట్ 4 వేల 945 పరుగులు సాధించాడు. 16 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలతో 50. 97 సగటు నమోదు చేశాడు.

ప్రస్తుత టెస్టు లీగ్ ఫైనల్లో విరాట్ భారీశతకం సాధించగలిగితే..టెస్టుల్లో 2వేల పరుగులు, మూడుఫార్మాట్లలోనూ కలిపి 5వేల పరుగుల రికార్డులను చేరుకోగలుగుతాడు.

ఐసీసీ టోర్నీ నాకౌట్ మ్యాచ్ ల్లో...

ఐసీసీ టోర్నమెంట్ నాకౌట్ మ్యాచ్ ల్లో భాగంగా ఇప్పటి వరకూ 16 ఇన్నింగ్స్ ఆడిన విరాట్ 620 పరుగులతో 51.66 సగటు సాధించాడు. 96 పరుగుల నాటౌట్ స్కోరుతో మొత్తం అరడజను హాఫ్ సెంచరీలు సాధించాడు. సచిన్ 14 నాకౌట్ ఇన్నింగ్స్ లో ఓ సెంచరీ, 5 హాఫ్ సెంచరీలతో 657 పరుగులు సాధించిన భారత క్రికెటర్ గా ఉంటే..ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 18 ఇన్నింగ్స్ లో 3 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీతో 731 పరుగులతో టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు.

ప్రస్తుత టెస్టు లీగ్ ఫైనల్లో విరాట్ భారీస్కోరు సాధించగలిగితే..సచిన్ పేరుతో ఉన్న రికార్డును అధిగమించగలుగుతాడు.

ఒకే బౌలర్ ప్రత్యర్థిగా అత్యధిక పరుగుల రికార్డు

ప్రత్యర్థిజట్లకు చెందిన ఒకే బౌలర్ ను ఎదుర్కొన్న సమయంలో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్ రికార్డు చతేశ్వర్ పూజారా పేరుతో ఉంది. ఆస్ట్ర్రేలియా ఆఫ్ స్పిన్నర్ నేథన్ లయన్ పైన పూజారా 570 పరుగులు సాధిస్తే..విరాట్ 511 పరుగులతో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుత టెస్టు లీగ్ ఫైనల్లో లయన్ ను మరోసారి ఎదుర్కొనబోతున్న విరాట్ పూర్తిస్థాయిలో చెలరేగితో మరో రికార్డును తనఖాతాలో జమచేసుకొనే అవకాశం లేకపోలేదు.

ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్ రికార్డు సైతం విరాట్ ను ఊరిస్తోంది. భారతజట్టు చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇంగ్లండ్ గడ్డపై ఆడిన 46 మ్యాచ్ ల్లో 2645 పరుగులు సాధించాడు. 55.10 సగటుతో 8 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు సైతం సాధించాడు.

43మ్యాచ్ ల్లో 7 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీలతో సహా సచిన్ 2వేల 626 పరుగులు సాధించడం ద్వారా రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ 56 మ్యాచ్ ల్లో 3 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలతో సహా 2, 574 పరుగులతో మూడోస్థానంలో కొనసాగుతున్నాడు. మరో 72 పరుగులు సాధించగలిగితే..ద్రావిడ్, సచిన్ ల రికార్డులను విరాట్ తెరమరుగు చేయటం ఖాయం.

టెస్టు క్రికెట్లో 941 ఫోర్ల విరాట్...

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో విరాట్ ఇప్పటి వరకూ 941 ఫోర్లు బాదాడు. మరో 9 బౌండ్రీలు సాధించగలిగితే 950 ఫోర్ల మైలురాయిని చేరుకోగలుగుతాడు. టెస్టు చరిత్రలో అత్యధికంగా 2వేల 58 ఫోర్లు బాదిన ప్రపంచ రికార్డు మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉంది.

ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా..టెస్టుల్లో సచిన్ 11 శతకాలు బాదితే..సునీల్ గవాస్కర్, విరాట్ కొహ్లీ 8 సెంచరీల చొప్పున సాధించడం ద్వారా రెండోస్థానంలో కొనసాగుతున్నారు.

ప్రస్తుత టెస్టు లీగ్ ఫైనల్లో విరాట్ మరో శతకం సాధించగలిగితే గవాస్కర్ రికార్డును అధిగమించే అవకాశం ఉంది.

అంతేకాదు..టెస్టు క్రికెట్లో అత్యుత్తమజట్లుగా ఉన్న దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థులుగా 34 ఏళ్ల వయసుకే మాస్టర్ సచిన్ 22 శతకాలు సాధించిన రికార్డును విరాట్ సైతం 34 సంవత్సరాల వయసులోనే సమం చేసే అవకాశం ఉంది.

ఓవల్ టెస్టులో విరాట్ శతకం సాధించగలిగితే సచిన్ 22 సెంచరీల రికార్డును సమం చేయగలుగుతాడు.

అత్యంత వేగంగా 76శతకాల రికార్డు...

అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 76 శతకాలు బాదిన బ్యాటర్ గా నిలిచే రికార్డు సైతం విరాట్ కు చేరువగా ఉంది. తన కెరియర్ లో ఇప్పటి వరకూ క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ కలిపి విరాట్ 75 శతకాలు సాధించాడు. సచిన్ 587 ఇన్నింగ్స్ లో 76 సెంచరీల రికార్డును చేరితే విరాట్ మాత్రం 555 ఇన్నింగ్స్ లోనే ఈ అరుదైన రికార్డు చేరుకొనే అవకాశం ఉంది.

ఒకే జట్టు పై అత్యధిక సెంచరీల రికార్డు...

ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా మాస్టర్ సచిన్ టెండుల్కర్ కు 20 సెంచరీలు బాదిన రికార్డు ఉంది. ఇంగ్లండ్ ప్రత్యర్థిగా సర్ డోనాల్డ్ బ్రాడ్మన్ 19, శ్రీలంక ప్రత్యర్థిగా సచిన్ కు 17 శతకాల రికార్డులు ఉన్నాయి. ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా ఇప్పటికే 16 సెంచరీలు సాధించిన విరాట్ 17వ శతకానికి గురి పెట్టాడు.

ఓ ఐసీసీ టోర్నీ ఫైనల్లో సెంచరీ సాధించిన భారత తొలి బ్యాటర్ ఘనతను మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ దక్కించుకొంటే..ఓవల్ టెస్టులో విరాట్ శతకం బాదగలిగితే..దాదా రికార్డును సమం చేసే అవకాశం ఉంది.

టెస్టులీగ్ లో అత్యధిక విజయాల ఆస్ట్ర్రేలియా...

2021-2023 టెస్టు లీగ్ టోర్నీ లీగ్ దశలో ఆస్ట్ర్రేలియా మొత్తం 11 విజయాలతో టేబుల్ టాపర్ గా నిలిచింది. వివిధ జట్లతో 19 మ్యాచ్ లు ఆడిన కంగారూ టీమ్ 3 పరాజయాలుల 5 డ్రాల రికార్డుతో నంబర్ వన్ జట్టుగా నిలిచింది.

భారత్ మాత్రం 18 టెస్టుల్లో 10 విజయాలు, 5 పరాజయాలు, 3 డ్రాలతో లీగ్ టేబుల్ రెండోస్థానంలో నిలవడం ద్వారా టెస్టు లీగ్ ఫైనల్స్ కు వరుసగా రెండోసారి చేరుకోగలిగింది.

Tags:    
Advertisement

Similar News