ప్రపంచకప్ లో వెయ్యికి 28 పరుగుల దూరంలో విరాట్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీని మరో టీ-20 ప్రపంచకప్ రికార్డు ఊరిస్తోంది. దక్షిణాఫ్రికాతో ఈరోజు జరిగే సూపర్ -12 సమరంలో విరాట్ 28 పరుగులు సాధించగలిగితే అరుదైన ఘనతను అందుకోగలుగుతాడు.
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 గ్రూప్ -2 పోరులో భారత మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ హవా కొనసాగుతోంది. మొదటి రెండుమ్యాచ్ ల్లో అజేయ హాఫ్ సెంచరీలతో నిలిచిన విరాట్.. సిడ్నీ వేదికగా ఈరోజు దక్షిణాఫ్రికాతో జరిగే కీలకపోరులో మరో అరుదైన రికార్డుకు ఉరకలేస్తున్నాడు.
తక్కువ మ్యాచ్ ల్లోనే ఎక్కువ పరుగులు..
33 సంవత్సరాల విరాట్ కొహ్లీ తన కెరియర్ లో ఐదో ప్రపంచకప్ టీ-20 టోర్నీలో పాల్గొంటూ తనజోరును కొనసాగిస్తున్నాడు. సూపర్ -12 గ్రూప్ -2 లీగ్ తొలిపోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై 82 పరుగుల అజేయ స్కోరుతో మ్యాచ్ విన్నర్ గా నిలిచిన విరాట్.. సిడ్నీ వేదికగా నెదర్లాండ్స్ తో జరిగిన పోటీలో సైతం 62 పరుగుల అజేయ స్కోరు సాధించాడు. నెదర్లాండ్స్ తో ముగిసిన పోటీ వరకూ మొత్తం 23 మ్యాచ్ లు ఆడిన విరాట్ 12 అర్ధ శతకాలతో సహా 989 పరుగులు సాధించి...శ్రీలంక దిగ్గజం మహేల జయవర్థనే తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రపంచకప్ లో విరాట్ సగటు 89.9గా నమోదయ్యింది.
శ్రీలంక ఆల్ టైమ్ గ్రేట్ మహేల జయవర్థనే తన కెరియర్ లో 31 ప్రపంచకప్ మ్యాచ్ లు ఆడి 1,016 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం రెండోస్థానంలో ఉన్న విరాట్ మరో 11 పరుగులు చేయగలిగితే ప్రపంచకప్ లో వెయ్యి పరుగుల మైలురాయిని చేరిన రెండో బ్యాటర్ గా నిలుస్తాడు. అదే 28 పరుగులు చేయగలిగితే.. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన తొలి ఆటగాడి ఘనతను దక్కించుకోగలుగుతాడు. కరీబియన్ సునామీ ఓపెనర్ క్రిస్ గేల్ 33మ్యాచ్ ల్లో 965 పరుగులు, భారత కెప్టెన్ రోహిత్ శర్మ 35 మ్యాచ్ ల్లో 904 పరుగులు చేయటం ద్వారా ..ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల వరుసలో మూడు, నాలుగు స్థానాలలో కొనసాగుతున్నారు. గత నెలలో ముగిసిన ఆసియాకప్ టోర్నీలో అఫ్ఘనిస్థాన్ ప్రత్యర్థిగా తన తొలి టీ-20 శతకం సాధించిన విరాట్..రెండేళ్ల విరామం తర్వాత.. క్రికెట్ మూడు ఫార్మాట్లలో కలిపి 1000 పరుగుల రికార్డు పూర్తి చేయడం విశేషం.
రెండుసార్లు బెస్ట్ ప్లేయర్ గా..
తన కెరియర్ లో ఆడిన గత నాలుగు ప్రపంచకప్ టోర్నీలలో రెండుమార్లు మ్యాన్ ఆఫ్ ద ప్రపంచకప్ అవార్డులను విరాట్ కొహ్లీ సొంతం చేసుకున్నాడు. 2014 ప్రపంచకప్ లో 319 పరుగులు, 2016 ప్రపంచకప్ లో 273 పరుగులు సాధించడం ద్వారా విరాట్ అత్యుత్తమ బ్యాటర్ ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికాతో ఈరోజు జరిగే కీలక పోరులో సైతం విరాట్ స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించగలిగితే.. వెయ్యి పరుగులతో పాటు.. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గాను ప్రపంచ రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది.