ట్రినిడాడ్ లో విరాట్ కు 'తల్లిప్రేమ' !
క్రికెట్ ప్రపంచంలో విరాట్ కొహ్లీకి, రకరకాల అభిమానులున్నారు. అయితే..ట్రినిడాడ్ వేదికగా జరుగుతున్న రెండోటెస్టు ఆడుతున్న సమయంలో ఓ అరుదైన అభిమాని నుంచి తల్లిప్రేమను చవిచూశాడు.
క్రికెట్ ప్రపంచంలో విరాట్ కొహ్లీకి, రకరకాల అభిమానులున్నారు. అయితే..ట్రినిడాడ్ వేదికగా జరుగుతున్న రెండోటెస్టు ఆడుతున్న సమయంలో ఓ అరుదైన అభిమాని నుంచి తల్లిప్రేమను చవిచూశాడు.....
భారత స్టార్ క్రికెటర్లకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులుండటం సహజమే. గతంలో మాస్టర్ సచిన్ టెండుల్కర్ కు ప్రపంచ వ్యాప్తంగా టెస్టు హోదా పొందిన దేశాలలో
వేలకు వేలమంది అభిమానులుండేవారు. తమ పిల్లలకు సచిన్ పేరు పెట్టుకొన్న అభిమానులు సైతం లేకపోలేదు. అయితే..ప్రస్తుత తరం క్రికెటర్లలో
విరాట్ కొహ్లీ మాత్రమే..సచిన్ ను తలపించేలా వివిధ దేశాలకు చెందిన, వివిధ వయసుల అభిమానుల ప్రేమాభిమానాలను చూరగొంటున్నాడు. తన ఆటతీరు, వ్యక్తిత్వంతో కట్టిపడేస్తున్నాడు.
కరీబియన్ ద్వీపాలలో...
గత 14 సంవత్సరాలుగా భారత క్రికెట్ కు అసమాన సేవలు అందిస్తున్న విరాట్ కొహ్లీ గురించి ఎంత చెప్పుకొన్నా అది తక్కువే అవుతుంది. క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తూ 76 శతకాలు బాదిన అరుదైన రికార్డు విరాట్ కు మాత్రమే సొంతం. తన 500వ అంతర్జాతీయ మ్యాచ్ లో సెంచరీ సాధించిన ఏకైక క్రికెటర్ విరాట్ మాత్రమే.
ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా వెస్టిండీస్ తో జరుగుతున్న రెండుమ్యాచ్ ల సిరీస్ లోని ఆఖరి టెస్టు ఆడుతున్న సమయంలో విరాట్ కోసం ఓ విరాభిమాని..మ్యాచ్ వేదిక పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లోని క్వీన్స్ పార్క్ ఓవల్ స్టేడియానికి పని పెట్టుకొని మరీ వచ్చారు.
ఆ అభిమాని మరెవ్వరో కాదు..వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ జోషువా డా సిల్వాకు స్వయానా తల్లి. తన కుమారుడు వెస్టిండీస్ తరపున మ్యాచ్ ఆడుతున్నా..కేవలం విరాట్ కొహ్లీ కోసమే తాను స్టేడియానికి వచ్చానని జోషువా తల్లి ప్రకటించి తన అభిమానం చాటుకొన్నారు.
టెస్టుమ్యాచ్ కు రెండురోజుల ముందే....
భారత్ తో రెండోటెస్టు ప్రారంభానికి రెండురోజుల ముందే..తనతల్లి విరాట్ ను చూడటానికి ( కుదిరితే కలుసుకోడానికి ) క్వీన్స్ పార్క్ స్టేడియానికి వస్తానని చెప్పిందని జోషువా గుర్తు చేసుకొన్నాడు. తన కొడుకు టెస్టుమ్యాచ్ ఆడుతుంటే చూడటానికి రాని తన తల్లి...కేవలం తన అభిమాన క్రికెటర్ విరాట్ కొహ్లీని కలుసుకోడానికి రావడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని, విరాట్ కొహ్లీ గొప్పతనమే అది అంటూ కొనియాడాడు.
టెస్టుమ్యాచ్ రెండోరోజున తనతల్లి స్టేడియానికి వచ్చిందని, టీమ్ బస్సులో ఉన్న విరాట్ కు తాను ఈ విషయం తెలిపానని జోషువా వివరించాడు. బస్సులో కూర్చొన్న విరాట్..తన అభ్యర్థనను మన్నించి..కిందకుదిగి తన తల్లివద్దకు వచ్చి ఓ కొడుకులా ప్రవర్తించడం, పుత్రప్రేమను పంచడం తాను మరువలేనని చెప్పాడు.
విరాట్ ను చూసిన వెంటనే జోషువా తల్లి పట్టలేని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది. ఆనందభాష్పాలతో ఉక్కిరిబిక్కిరయ్యింది. తన తల్లి వయసున్న అభిమానితో విరాట్ ఎంతో కలుపుగోలుగా, సొంతకొడుకులా మసలుకొని, ప్రేమగా మాట్లాడుతూ తన పెద్దమనసును చాటుకొన్నాడు. జోషువా తల్లి సైతం విరాట్ ను ఆలింగనం చేసుకొని ముద్దాడటం ద్వారా..తన పుత్రవాత్సల్యాన్ని చాటుకొంది.
తన అభిమాన క్రికెటర్ విరాట్ కొహ్లీని జోషువా తల్లి కలుసుకొని గడిపిన క్షణాలను అక్కడే ఉన్న భారత జర్నలిస్ట్ విమల్ కుమార్ తన ఫోనులో చిత్రించి ట్విట్టర్లో ఉంచడంతో వైరల్ గా మారిపోయింది. ఓ తల్లికొడుకుల ప్రేమ,వాత్సల్యం ఎంత గొప్పగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మరోసారి ప్రపంచానికి తెలిసిందంటూ అభిమానులు మురిసిపోతున్నారు.
మరోవపు..జోషువా డా సిల్వా సైతం ..బహుశా.. ఈ ఏడాదికే తన తల్లికి ఇదో గొప్పఅనుభూతిగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించాడు.
విరాట్ స్ఫూర్తితో సాగాలి....
తనకు విరాట్ కొహ్లీ అంటే ఎంతో ఇష్టమని, అతని ఆటతీరు, ఫిట్ నెస్, నడవడిక, వ్యక్తిత్వం అన్నీ ప్రత్యేకమేనని..తన కుమారుడు జోషువా సైతం విరాట్ స్ఫూర్తితో, ప్రేరణతో ఎదగాలని కోరుకొంటున్నట్లు..జర్నలిస్టు విమల్ కుమార్ తో జోషువా తల్లి చెప్పింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నది..విరాట్ ను చూసిమాత్రమే నేర్చుకోవాలని ఆ తల్లి మురిసిపోతూ చెప్పింది.
ఇదంతా చూస్తుంటే..తల్లి ఎవరికైనా తల్లే..కొడుకు ఎవరికైనా కొడుకేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.