క్రిస్ గేల్ సరసన విరాట్ కొహ్లీ!

భారత క్రికెట్ పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో తన గోల్డెన్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు.

Advertisement
Update:2023-05-20 08:14 IST

ఐపీఎల్ 16 సీజన్లలో అత్యధిక సెంచరీలు బాదిన ఇద్దరు బ్యాటర్లలో విరాట్ కొహ్లీ ఒకడిగా నిలిచాడు. హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ తో జరిగిన పోరులో శతకం బాదడం ద్వారా ఈ ఘనతను సొంతం చేసుకొన్నాడు...

భారత క్రికెట్ పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో తన గోల్డెన్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఓపెనర్ గా పరుగుల హోరు, రికార్డుల జోరుతో చెలరేగిపోతున్నాడు.

నాలుగేళ్ల తర్వాత తొలి ఐపీఎల్ సెంచరీ..

ఐపీఎల్ లో విరాట్ కొహ్లీకి సెంచరీలు బాదడం కొత్తేమీ కాదు. 2019 సీజన్ నాటికే ఐపీఎల్ లో 5 శతకాలు సాధించిన రికార్డు విరాట్ కొహ్లీకి ఉంది. కేవలం 2016 సీజన్లోనే

నాలుగు సెంచరీలు సాధించిన విరాట్ ..ఆ తర్వాత మూడేళ్లకు 2019 సీజన్లో 5వ శతకం బాదాడు. ఆరవ శతకం కోసం మరో నాలుగుసంవత్సరాల పాటు వేచిచూడాల్సి వచ్చింది.

హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ తో జరిగిన 13వ రౌండ్ మ్యాచ్ లో విరాట్ కొహ్లీ కేవలం 62 బంతుల్లోనే 100 పరుగులు సాధించడం ద్వారా తన 6వ శతకాన్ని సాధించగలిగాడు.

గతంలోనే క్రిస్ గేల్ పేరుతో ఉన్న ఆరు సెంచరీల రికార్డును విరాట్ కొహ్లీ సమం చేయగలిగాడు.

ప్రస్తుత 2023 సీజన్లో మొదటి 66 రౌండ్ల మ్యాచ్ ల్లో కొహ్లీతో సహా మొత్తం ఎనిమిదిమంది ( హ్యారీ బ్రూక్స్, వెంకటేశ్ అయ్యర్, యశస్వి జైశ్వాల్, ప్రభ్ సిమ్రాన్ సింగ్, సూర్యకుమార్ యాదవ్, శుభ్ మన్ గిల్ , హెన్రిచ్ క్లాసెన్ ) శతకాలు బాదడం ద్వారా పరుగుల మోత మోగించారు.

6 సీజన్లలో 500 పరుగుల రికార్డు...

ఐపీఎల్ లో బ్యాటర్ గా ఇప్పటికే ఎన్నో రికార్డులు నెలకొల్పిన విరాట్ కొహ్లీ..ఆరు సీజన్లలో 500కు పైగా పరుగులు సాధించిన రికార్డును సైతం తన పేరుతో లిఖించుకొన్నాడు. ప్రస్తుత 16వ సీజన్ లీగ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ తో ఆడిన 13వ మ్యాచ్ వరకూ విరాట్ 538 పరుగులు సాధించాడు.

దానికితోడు..హోంగ్రౌండ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా 3వేల పరుగులు సాధించిన తొలి బ్యాటర్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

92 ఇన్నింగ్స్ లో 3వేల 15 పరుగులు...

చిన్నస్వామి స్టేడియం వేదికగా 92 టీ-20 ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కొహ్లీ మొత్తం 3వేల 15 పరుగులు సాధించాడు. ఒకే వేదికలో 3వేలకు పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్ గా అవతరించాడు. విరాట్ తర్వాతి స్థానాలలో నిలిచిన బ్యాటర్లలో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్లు ముష్ ఫికుర్ రహీం,మహ్మదుల్లా సైతం ఉన్నారు. మీర్పూర్ లోని షేరే- నేషనల్ బంగ్లా స్టేడియం వేదికగా రహీం 121 ఇన్నింగ్స్ లో 2వేల 989 పరుగులు, మహ్మదుల్లా 130 ఇన్నింగ్స్ లో 2వేల 813 పరుగులు సాధించారు.

ఇంగ్లండ్ డాషింగ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ నాటింగ్ హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా90 ఇన్నింగ్స్ లో 2వేల 749 పరుగులు సాధించాడు.

బంగ్లాదేశ్ మరో మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ మీర్పూర్ వేదికగా 2వేల 706 పరుగులు సాధించడం ద్వారా ఆ తర్వాతి స్థానంలో నిలిచాడు.

ఒకే జట్టు తరపున 7వేల పరుగులు...

బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తరపున 7వేల పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా విరాట్ కొహ్లీ అరుదైన ఘనత సాధించాడు. న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన 10వ రౌండ్ మ్యాచ్ లో అర్థశతకం సాధించడం ద్వారా విరాట్ 7వేల పరుగుల రికార్డును నెలకొల్పగలిగాడు.

అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల వరుసలో విరాట్ అగ్రస్థానంలో నిలిస్తే..రెండోస్థానంలో కొనసాగుతున్న శిఖర్ ధావన్ 500 పరుగులతో వెనుకబడి ఉన్నాడు.

236 మ్యాచ్ లు..7వేల 162 పరుగులు

2008 ప్రారంభ ఐపీఎల్ నుంచి బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు తరపున ఆడుతున్న విరాట్ కొహ్లీ ప్రస్తుత సీజన్ 13వ రౌండ్ వరకూ 236 మ్యాచ్ లు ఆడి 7వేల 162 పరుగులు సాధించాడు.

ఇందులో 6 శతకాలు, 50 అర్థశతకాలు, 630 బౌండ్రీలు, 233 సిక్సర్లు ఉన్నాయి. 36.73 సగటు సైతం నమోదు చేశాడు.

పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ 213మ్యాచ్ ల్లో 6వేల 536 పరుగులతో రెండు, ఢిల్లీ క్యాపిటల్స్ సారథి డేవిడ్ వార్నర్ 171 మ్యాచ్ ల్లో 6వేల 189 పరుగులతో మూడు, ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ 237 మ్యాచ్ ల్లో 6వేల 63 పరుగులతో నాలుగు స్థానాలలో కొనసాగుతున్నారు.

2016 ఐపీఎల్ సీజన్లో అత్యధికంగా 16 మ్యాచ్ ల్లో 973 పరుగులతో రికార్డు నెలకొల్పిన కొహ్లీ ప్రస్తుత సీజన్ ఆఖరి లీగ్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై ఏ స్థాయిలో రాణించగలడో చూడాలి మరి.

Tags:    
Advertisement

Similar News