ఒలింపిక్స్ కు భారత టీటీజట్లలో ఇద్దరు తెలుగుతేజాలు!

పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే భారత టేబుల్ టెన్నిస్ పురుషుల, మహిళల జట్లలో ఇద్దరు తెలుగు రాష్ట్ర్రాల క్రీడాకారులకు చోటు దక్కింది.

Advertisement
Update:2024-05-20 19:06 IST

పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే భారత టేబుల్ టెన్నిస్ పురుషుల, మహిళల జట్లలో ఇద్దరు తెలుగు రాష్ట్ర్రాల క్రీడాకారులకు చోటు దక్కింది.

ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ చరిత్రలో భారత పురుషుల, మహిళల జట్లు తొలిసారిగా టీమ్ విభాగంలో పాల్గొనటానికి అర్హత సంపాదించాయి. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య ర్యాంకింగ్స్ ప్రకారం భారత పురుషులజట్టు 8వ ర్యాంకులో నిలిస్తే..మహిళల జట్టు 13వ ర్యాంక్ సంపాదించింది.

పురుషుల, మహిళల వ్యక్తిగత విభాగంలో సైతం భారత క్రీడాకారులు పోటీపడనున్నారు.

శరత్ కమల్ అరుదైన రికార్డు....

ఒలింపిక్స్ లో పాల్గొంటున్న ముగ్గురు సభ్యుల భారత పురుషుల జట్టుకు వెటరన్ ఆచంట శరత్ కమల్, మహిళల జట్టుకు మనీకా బాత్రా నాయకత్వం వహిస్తారని భారత టేబుల్ టెన్నిస్ సంఘం ప్రకటించింది.

రాజమండ్రికి చెందిన 41 సంవత్సరాల ఆచంట శరత్ కమల్ ఇప్పటికే రికార్డుస్థాయిలో పతకాలు సాధించడంతో పాటు...ఒలింపిక్స్ లో భారత్ కు పలుమార్లు ప్రాతినిథ్యం వహించాడు. నాలుగు పదుల వయసులో సైతం భారతజట్టులో శరత్ తన చోటును నిలుపుకోగలిగాడు.

ప్రపంచ ర్యాంకింగ్స్ 40 స్థానంలో ఉన్న శరత్ కమల్ పురుషుల టీమ్, వ్యక్తిగత విభాగాలలో పోటీకి దిగనున్నాడు. భారత పురుషులజట్టులో శరత్ కమల్ తో పాటు హర్మీత్ దేశాయ్, మానవ్ థక్కర్ సభ్యులుగా ఉన్నారు.

మహిళాజట్టు కెప్టెన్ గా మనీకా బాత్రా...

మహిళల టీమ్, వ్యక్తిగత విభాగాలలో పాల్గొనే ముగ్గురు సభ్యుల భారతజట్టులో మనీకా బాత్రా, తెలుగుతేజం శ్రీజ ఆకుల, అర్చనా కామత్ ఉన్నారు. హైదరాబాద్ కు చెందిన శ్రీజ ఆకుల గత ఏడాదికాలంగా నిలకడగా రాణించడం ద్వారా తన ర్యాంక్ ను గణనీయంగా మెరుగు పరచుకొంది. ర్యాంకింగ్ ప్రాతిపదికనే ఒలింపిక్స్ లో పాల్గొనే జట్టులో చోటు కల్పించారు.

జి.సత్యన్, ఐహిక ముఖర్జీలకు పురుషుల, మహిళల జట్లలో ఆల్టర్ నేట్ ప్లేయర్లుగా చోటు కల్పించారు.

పురుషుల సింగిల్స్ లో శరత్ కమల్, హర్మీత్, మహిళల సింగిల్స్ లో ప్రపంచ 24వ ర్యాంకర్ మనీకా బాత్రా, శ్రీజ ఆకుల పాల్గోనున్నారు.

శరత్ కమల్ కు అరుదైన గౌరవం...

అంతేకాదు..ఒలింపిక్స్ లో పాల్గొనే భారత బృందానికి పతాకధారిగా శరత్ కమల్ ను భారత ఒలింపిక్స్ సమాఖ్య ఎంపిక చేసింది. శరత్ కమల్ కు ఒలింపిక్స్ లో పాల్గొనటం ఇది ఐదవసారి. గత టోక్యో ఒలింపిక్స్ వరకూ శరత్ నాలుగుసార్లు భారత్ కు ప్రాతినిథ్యం వహించాడు.

2004 ఒలింపిక్స్ లో తొలిసారిగా పాల్గొన్న శరత్ ఆ తరువాత మరో మూడు ఒలింపిక్స్ లోనూ తన అదృష్టం పరీక్షించుకోగలిగాడు. వ్యక్తిగత ర్యాంకింగ్స్ లో శరత్ కమల్ 40, హర్మీత్ 63, మానవ్ 62 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.

మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్స్ లో మనీకా 24వ ర్యాంకులోనూ, శ్రీజ ఆకుల మొదటి 50 ర్యాంకుల్లోనూ నిలిచారు. అర్చన కామత్ 103, ఐహిక ముఖర్జీ 133వ ర్యాంకులో ఉన్నారు.

ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా ఒలింపిక్స్ జులై 26న మొదలై ఆగస్టు 11న ముగియనున్నాయి. భారత్ 20కి పైగా క్రీడాంశాలలో 125మందికి పైగా అథ్లెట్లతో పాల్గోనుంది. గత ఒలింపిక్స్ కంటే మెరుగైన ఫలితాలు సాధించాలన్న పట్టుదలతో భారత అథ్లెట్లు సాధన చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News