హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ ఆఖరిపోరు నేడే!

ఐపీఎల్ -16వ సీజన్ లో మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్ హోంగ్రౌండ్ రాజీవ్ స్టేడియం వేదికగా ఆఖరిమ్యాచ్ కు సిద్ధమయ్యింది.

Advertisement
Update:2023-05-18 17:14 IST

హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ ఆఖరిపోరు నేడే!

ఐపీఎల్ -16వ సీజన్ లో మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్ హోంగ్రౌండ్ రాజీవ్ స్టేడియం వేదికగా ఆఖరిమ్యాచ్ కు సిద్ధమయ్యింది...

ఐపీఎల్-2023 సీజన్ మాజీ చాంపియన్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఏమంతగా కలసి రాలేదు. జట్టు కూర్పు సరిగా లేకపోడం, సమతౌల్యం లోపించడం, సమర్ధుడైన కెప్టెన్ లేకపోడం గట్టి దెబ్బే కొట్టాయి.

హోంగ్రౌండ్లో 6 పరాజయాలు...

ఐపీఎల్ లో హోం ఎడ్వాంటేజ్ ను గుజరాత్, ముంబై, లక్నో, చెన్నైజట్లు ఉపయోగించుకొన్నంతగా..హైదరాబాద్ సన్ రైజర్స్ సద్వినియోగం చేసుకోలేకపోయింది.

హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ప్రస్తుత సీజన్ లోని ఏడు హోం మ్యాచ్ ల్లో ఆరింటిని ఇప్పటికే పూర్తి చేసింది.ఆరు మ్యాచ్ ల్లో ఒక్కటంటే ఒక్కటి మాత్రమే నెగ్గి..మిగిలిన ఐదుమ్యాచ్ ల్లో పరాజయాలు చవిచూసింది.

అయితే..ఈ రోజురాత్రి 7-30కి ప్రారంభమయ్యే తన ఆఖరి హోంగ్రౌండ్ మ్యాచ్ లో బెంగళూరు రాయల్స్ చాలెంజర్స్ తో అమీతుమీకి సిద్ధమవుతోంది.

రైజర్స్ కు చెలగాటం..రాయల్స్ కు ప్లే-ఆఫ్ సంకటం!

ప్రస్తుత సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో సన్ రైజర్స్ ఇప్పటి వరకూ ఆడిన 12 మ్యాచ్ ల్లో 4 విజయాలు, 8 పరాజయాలతో 8 పాయింట్లు మాత్రమే సాధించి..ప్లే-ఆఫ్ రేస్ నుంచి వైదొలగింది.

మరోవైపు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మాత్రం..12 రౌండ్లలో 6 విజయాలు, 6 పరాజయాలతో 12 పాయింట్లు సాధించి లీగ్ టేబుల్ 6వ స్థానంలో కొనసాగుతోంది. ఈ రోజు సన్ రైజర్స్ తోను, చివరి రౌండ్లో గుజరాత్ టైటాన్స్ పైన నెగ్గితేనే బెంగళూరుకు ప్లే-ఆఫ్ రౌండ్ చేరే అవకాశాలుంటాయి. ఏమ్యాచ్ లో ఓడినా ప్లే-ఆఫ్ రేస్ నుంచి తప్పుకోక తప్పదు.

బెంగళూరుపై సన్ రైజర్స్ దే పైచేయి..

ఐపీఎల్ లో రెండుజట్ల ముఖాముఖీ రికార్డు చూస్తే..బెంగళూరు ప్రత్యర్థిగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుదే పైచేయిగా కనిపిస్తోంది. ఈ రెండుజట్లు ఇప్పటి వరకూ 21సార్లు తలపడితే..హైదరాబాద్ 12 విజయాలతో పైచేయి సాధించింది.

2016 ఐపీఎల్ టైటిల్ సమరంలో సైతం బెంగళూరును చిత్తు చేయడం ద్వారా సన్ రైజర్స్ విజేతగా నిలిచింది. హైదరాబాద్ వేదికగా ఆడిన గత 7 మ్యాచ్ ల్లో బెంగళూరుకు 6 పరాజయాలు, ఓ గెలుపు రికార్డు మాత్రమే ఉన్నాయి.

ప్రస్తుత సీజన్లో మాత్రం సన్ రైజర్స్ కు హోంగ్రౌండ్లో ఆడిన 6 మ్యాచ్ ల్లో 5 పరాజయాలు, ఓ విజయం మాత్రమే ఉండటంతో బెంగళూరు ఈ కీలక పోరులో విజయం సాధించగలనన్న ధీమాతో ఉంది.

రాజీవ్ స్టేడియంలో చేజింగ్ కష్టమే..

హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ల్లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్లే విజయాలు సాధించడం ఆనవాయితీగా వస్తోంది.

ప్రస్తుత సీజన్లో జరిగిన ఆరుమ్యాచ్ ల్లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్లు నాలుగుసార్లు నెగ్గితే..చేజింగ్ కు దిగిన జట్లు రెండుసార్లు మాత్రమే విజేతగా నిలిచాయి.

66 శాతం ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్లకు, 34 శాతం మాత్రమే చేజింగ్ కు దిగిన జట్లకు హైదరాబాద్ వికెట్ అనుకూలంగా ఉంటూ వస్తోంది.

ఇటు భువీ...అటు విరాట్, డూప్లెసీ, మాక్స్ వెల్...

సన్ రైజర్స్- రాయల్ చాలెంజర్స్ జట్ల పోరు ను హైదరాబాద్ సీమర్ భువనేశ్వర్ కుమార్, బెంగళూరు బ్యాటర్ల త్రయం విరాట్ కొహ్లీ, డూప్లెసీ, మాక్స్ వెల్ ల మధ్య జరిగే సమరంగా విశ్లేషకులు చెబుతున్నారు.

గత మ్యాచ్ లో 5 వికెట్లు పడగొట్టడం ద్వారా సూపర్ ఫామ్ లో కనిపిస్తున్న భువనేశ్వర్ కుమార్..హోంగ్రౌండ్లో సైతం అదేజోరు కొనసాగించగలిగితే..భారీగెలుపు పై ఆశలు పెట్టుకొన్న బెంగళూరుకు గట్టిపోటీ తప్పదు.

బెంగళూరు బ్యాటింగ్ కు వెన్నెముకగా ఉన్న విరాట్, డూప్లెసీ, మాక్స్ వెల్ లలో ఇద్దరు మాత్రమే రాణిస్తూ వస్తున్నారు. ముగ్గురూ చెలరేగిన సమయంలోనే బెంగళూరు భారీవిజయాలు సాధిస్తూ వస్తోంది.

పవర్ ప్లే ఓవర్లలో భారీగా పరుగులు దండుకోడం, ప్రత్యర్థి పవర్ ప్లే ఓవర్లలో వికెట్ వెంట వికెట్ పడగొడుతూ రావడం బెంగళూరు విన్నింగ్ ఫార్ములాగా కనిపిస్తోంది.

మహ్మద్ సిరాజ్ పైనే అందరిచూపు...

మేడిన్ హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్...ఐపీఎల్ లో మాత్రం బెంగళూరు ఓపెనింగ్ బౌలర్ గా కీలకపాత్ర పోషిస్తున్నాడు. పవర్ ప్లే ఓవర్లలో కీలక వికెట్లు పడగొట్టడం ద్వారా తనజట్టు విజయంలో ప్రధానపాత్ర వహిస్తూ వస్తున్నాడు.

ప్రస్తుత సీజన్లో బెంగళూరు ఆడిన 12 మ్యాచ్ ల్లో అత్యధిక పవర్ ప్లే వికెట్లు సాధించిన బౌలర్ మహ్మద్ సిరాజ్ మాత్రమే. సిరాజ్ సాధించిన మొత్తం 17 వికెట్లలో పవర్ ప్లే ఓవర్లలో పడగొట్టినవే 9 వికెట్లు ఉన్నాయి.

అయితే..తన హోంగ్రౌండ్ హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా సిరాజ్ అదే జోరు కొనసాగించగలడా అన్నది అనుమానమే.

నిలకడలేమికి మరోపేరు హైదరాబాద్..

హైదరాబాద్ సన్ రైజర్స్ బ్యాటింగ్ నిలకడలేమికి చిరునామాగా నిలిచింది. 13 కోట్ల వేలం ధర పలికిన ఓపెనర్ హ్యారీ బ్రూక్ వెలవెల పోతుంటే..దేశవాళీ ఓపెనర్లు అన్ మోల్ ప్రీత్ సింగ్, అభిషేక్ శర్మలతోనే సన్ రైజర్స్ నెట్టుకొంటూ వస్తోంది.

రాహుల్ త్రిపాఠీ, కెప్టెన్ ఎయిడెన్ మర్కరమ్ అంతంత మాత్రంగా ఆడుతుంటే..వికెట్ కీపర్ బ్యాటర్ హేన్రిక్ క్లాసెన్ మాత్రమే నిలకడగా రాణిస్తూ వస్తున్నాడు. విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ సైతం మెరుపులు మెరిపించే అవకాశాలు లేకపోలేదు.

ఈ మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ గెలిచినా..ఓడినా వచ్చేదేమీలేదు. అదే బెంగళూరు ఓడితే మాత్రం..ప్లే-ఆఫ్ బెర్త్ కు నీళ్లు వదులుకోవలిసిందే. ఒక్కమాటలో చెప్పాలంటే..ఇప్పటికే నిండామునిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు చెలగాటం..ప్లే-ఆఫ్ ఆశలతో మిణుకుమిణుకు మంటున్న బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కు నాకౌట్ సంకటం లాంటిదే.

లక్నోతో ముగిసిన గత మ్యాచ్ లో గలాభా సృష్టించిన హైదరాబాద్ అభిమానులు..ఈ మ్యాచ్ లోనైనా బుద్దిగా ఉండాలని కోరుకొందాం.

Tags:    
Advertisement

Similar News