ఒలింపిక్స్ లో భారత పతకాల కథ..వ్యథ!
పారిస్ వేదికగా ఈరోజు ప్రారంభంకానున్న 2024 ఒలింపిక్స్ లో భారత్ రెండంకెల సంఖ్యలో పతకాలకు గురిపెట్టింది. 117 మంది అథ్లెట్లతో 16 రకాల క్రీడల్లో పతకాలవేటకు దిగుతోంది.
పారిస్ వేదికగా ఈరోజు ప్రారంభంకానున్న 2024 ఒలింపిక్స్ లో భారత్ రెండంకెల సంఖ్యలో పతకాలకు గురిపెట్టింది. 117 మంది అథ్లెట్లతో 16 రకాల క్రీడల్లో పతకాలవేటకు దిగుతోంది.
ప్రపంచంలోనే జనాభాపరంగా రెండు అతిపెద్ద దేశాలలో ఒకటైన భారత్ పరిస్థితి.. ఒలింపిక్స్ పతకాల వేటలో ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారయ్యింది.
గత దశాబ్దకాలంగా జరిగిన ఒలింపిక్స్ లో మాత్రమే పతకాల సాధనలో మెరుగైన ఫలితాలు సాధిస్తూ వస్తోంది.
1900 నుంచి 2020 వరకూ....
1896లో మొట్టమొదటి ఒలింపిక్స్ ప్రారంభమైనా..భారత్ మాత్రం 1900 పారిస్ ఒలింపిక్స్ నుంచే పాల్గొంటూ వస్తోంది. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచే భారత అథ్లెట్లు పాల్గొంటూ వస్తున్నారు.
పారిస్ వేదికగా తొలిసారిగా జరిగిన 1900 ఒలింపిక్స్ లో భారత్ తరపున బరిలోకి దిగిన బ్రిటీష్ అథ్లెట్ నార్మన్ పిట్ చార్డ్ పరుగు అంశాలలో రెండు రజత పతకాలతో పతకాలవేటకు శ్రీకారం చుట్టాడు. అయితే..ఇంగ్లండ్ లో జన్మించి భారత్ కు ప్రాతినిథ్యం వహించిన నార్మన్ ఏ దేశం తరపున పతకాలు సాధించాడు అన్న అంశమై ఇప్పటికీ స్పష్టత లేకుండా పోయింది.
మేడిన్ భారత విజేత కెడీ జాదవ్...
1920 ఒలింపిక్స్ లో భారత్ కు చెందిన అథ్లెట్లు తొలిసారిగా పాల్గొన్నా..1928 ఆమ్ స్టర్ ఒలింపిక్స్ లో కానీ భారత హాకీజట్టు తొలి బంగారు పతకం సాధించలేకపోయింది.
వ్యక్తిగత విభాగంలో ఓ భారత అథ్లెట్ ఒలింపిక్స్ లో పతకం సాధించడానికి 1952 గేమ్స్ వరకూ వేచిచూడాల్సి వచ్చింది. పురుషుల కుస్తీలో కెడీ జాదవ్ కాంస్య పతకం సాధించడం ద్వారా చరిత్ర సృష్టించాడు.
12 దశాబ్దాల భారత ఒలింపిక్స్ లో చరిత్రలో తొలి పతకం సాధించిన అసలుసిసలు భారత క్రీడాకారుడిగా జాదవ్ రికార్డు నెలకొల్పాడు. ఆ తరువాత వ్యక్తిగతంగా భారత్ పతకం గెలుచుకోడానికి 44 సంవత్సరాలపాటు ఎదురుచూడాల్సి వచ్చింది. అట్లాంటా ఒలింపిక్స్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ లో లియాండర్ పేస్ కాంస్య పతకం నెగ్గే వరకూ భారత్ కు మరో వ్యక్తిగత పతకం లేకుండా పోయింది.
వ్యక్తిగత విభాగంలో రెండే స్వర్ణాలు...
1900 పారిస్ ఒలింపిక్స్ నుంచి గత 24 గేమ్స్ లో పాల్గొంటూ వచ్చిన భారత్ వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించడానికి 2008 బీజింగ్ ఒలింపిక్స్ వరకూ వేచిచూడాల్సి వచ్చింది. పిస్టల్ షూటింగ్ పురుషుల విభాగంలో అభినవ్ బింద్రా తొలి స్వర్ణంతో చరిత్ర సృష్టిస్తే..ఆ తర్వాతి పుష్కరకాలంలోనే భారత్ కు 2020 టోక్యో ఒలింపిక్స్ లో బల్లెంవీరుడు నీరజ్ చోప్రా రెండో స్వర్ణ పతకం అందించగలిగాడు.
వ్యక్తిగత విభాగంలో రజత పతకాలు సాధించిన వారిలో రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, పీవీ సింధు, మీరాబాయి చాను సైతం ఉన్నారు. ఒలింపిక్స్ లో పతకం సాధించిన భారత తొలి మహిళగా తెలుగుతేజం కరణం మల్లీశ్వరి నిలిచింది. వెయిట్ లిఫ్టింగ్ లో మల్లీశ్వరి కాంస్య పతకం సాధించగా..ఆ తరువాత పీవీ సింధు, సైనా నెహ్వాల్, సాక్షి మాలిక్, లవ్లీనా బోర్గెయిన, మీరాబాయి చాను, మేరీకోమ్, మహిళా పతక విజేతల జాబితాలో చోటు సంపాదించారు.
ఒలింపిక్స్ లో రెండేసి పతకాలు సాధించిన భారత అథ్లెట్లుగా పీవీ సింధు, సుశీల్ కుమార్ ఉన్నారు.
12 పతకాలతో హాకీదే అగ్రస్థానం...
ఒలింపిక్స్ లో భారత్ కు అత్యధిక పతకాలు సాధించి పెట్టిన ఘనత జాతీయక్రీడ హాకీకి మాత్రమే దక్కుతుంది. 1928 ఆమ్ స్టర్ డామ్ ఒలింపిక్స్ నుంచి 1980 మాస్కో ఒలింపిక్స్ వరకూ 8 స్వర్ణాలతో సహా మొత్తం 12 పతకాలను భారత హాకీజట్టు అందించింది. గత ఒలింపిక్స్ లో కాంస్య పతకం నెగ్గడం ద్వారా సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన భారత్ ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో మెరుగైన ప్రదర్శన చేయాలన్న పట్టుదలతో ఉంది.
క్రీడల వారీగా చూస్తే భారత్ ఇప్పటి వరకూ హాకీలో 12, కుస్తీలో 7, షూటింగ్ లో 4, బ్యాడ్మింటన్లో మూడు పతకాలు సాధించింది.
క్రమంగా పెరుగుతూ వచ్చిన పతకాలు...
ఒలింపిక్స్ ప్రారంభంలో ఒకటి లేదా రెండు పతకాలకు మాత్రమే పరిమితమైన భారత్ 2008 బీజింగ్ ఒలింపిక్స్ నుంచి ఎక్కువసంఖ్యలో పతకాలు గెలుచుకోడం మొదలు పెట్టింది. బీజింగ్ ఒలింపిక్స్ లో 3 పతకాలు, 2012 లండన్ ఒలింపిక్స్ లో 6 పతకాలు సాధించిన భారత అథ్లెట్లు 2020 టోక్యో ఒలింపిక్స్ లో మాత్రం రికార్డుస్థాయిలో 7 పతకాలు సాధించగలిగారు.
ఇందులో నీరజ్ చోప్రా సాధించిన స్వర్ణంతో పాటు రెండు రజత, 4 కాంస్య పతకాలు సైతం ఉన్నాయి. వచ్చే రెండువారాలపాటు సాగే పారిస్ ఒలింపిక్స్ లో భారత్ పదికి పైగా పతకాలు సాధించాలన్న లక్ష్యంతో పటిష్టమైన అథ్లెట్ల బృందాన్ని తయారు చేసింది.
టోక్యో గేమ్స్ లో భారత ర్యాంకు 47
1900 పారిస్ ఒలింపిక్స్ నుంచి 2020 టోక్యో ఒలింపిక్స్ వరకూ గత 24 గే్మ్స్ లో పాల్గొంటూ వచ్చిన భారత్ అత్యధిక పతకాలు సాధించిన మొదటి 10 దేశాల జాబితాలో చోటు సంపాదించలేకపోయింది.
గత 12 దశాబ్దాల ఒలింపిక్స్ లో భారత్ మొత్తం 35 పతకాలు మాత్రమే గెలుచుకోగలిగింది. వీటిలో 10 స్వర్ణ, 9 రజత, 16 కాంస్య పతకాలు ఉన్నాయి.
ఒలింపిక్స్ లో మొత్తం 204 దేశాలు తలపడుతుంటే 2020 టోక్యో ఒలింపిక్స్ పతకాల పట్టికలో 140 కోట్ల జనాభా కలిగిన భారత ర్యాంకు 47 మాత్రమే. ప్రస్తుత పారిస్ గేమ్స్ లో భారత్ తన పతకాల సంఖ్యతో పాటు ర్యాంక్ ను మెరుగు పరచుకోవాలంటే ఏదైనా అద్భుతం జరిగి తీరాల్సిందే.