గల్ప్ గడ్డపై అట్టహాసంగా ప్రపంచకప్ ప్రారంభం!

అరబ్ నేల ఖతర్ వేదికగా 2022 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ వేడుకలను వినూత్నరీతిలో నిర్వహించారు.

Advertisement
Update:2022-11-21 11:48 IST

అరబ్ నేల ఖతర్ వేదికగా 2022 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ వేడుకలను వినూత్నరీతిలో నిర్వహించారు.

ప్రారంభమ్యాచ్ లో ఆతిథ్య ఖతర్ ను ఈక్వెడోర్ 2-0 గోల్స్ తో చిత్తు చేయడం ద్వారా శుభారంభం చేసింది....

ప్రపంచ ఫుట్ బాల్ అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూసిన 2022 పిఫా ప్రపంచకప్ సాకర్ పోటీలు..దోహాలోని అల్ బయత్ స్టేడియం వేదికగా కన్నులపండుగగా ప్రారంభమయ్యాయి.

ప్రపంచంలోని అతిబుల్లి దేశాలలో ఒకటైన గల్ఫ్ దేశం ఖతర్ ఆతిథ్యంలో మొదలైన ఈ పోటీల ప్రారంభవేడుకలకు ప్రపంచ ప్రముఖులు, సాకర్ దిగ్గజాలతో పాటు 67వేల 372 మంది అభిమానులు హాజరయ్యారు.

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, ఆంక్షల నడుమ మొదలైన ఈ పోటీల ప్రారంభవేడుకలు లేజర్ లైట్ల హంగులు, కళాకారుల విన్యాసాలతో ప్రారంభమయ్యాయి. వేల కోట్ల రూపాయల వ్యయంతో పోటీలు నిర్వహిస్తున్న ఖతర్ చరిత్ర, సాంప్రదాయాలతో ఫుట్ బాల్ నేపథ్యాన్ని జోడించి నిర్వహించిన కార్యక్రమాలు ఆకట్టుకొన్నాయి. ఖతర్ అమీర్, గల్ఫ్ దేశాల నేతలు, పిఫా అధ్యక్షుడు ఇన్ ఫాంటినోతో సహా పలువురు ప్రముఖులు ప్రారంభవేడుకల్లో పాల్గొన్నారు.

ఖతర్ కు ఈక్వెడోర్ కిక్...

మొత్తం 32 దేశాల జట్లతో ఎనిమిది గ్రూపులుగా నిర్వహిస్తున్న ప్రపంచకప్ పోటీలు మూడువారాలపాటు ఖతర్ లోని ఎనిమిది స్టేడియాలలో నిర్వహించడానికి విస్త్రుత స్థాయిలో ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని 200 దేశాలకు చెందిన 10 లక్షల మంది సాకర్ అభిమానులు ఖతర్ కు తరలి వచ్చారు.

గ్రూప్- ఏ ప్రారంభమ్యాచ్ లో ఆతిథ్య ఖతర్ పైన ఈక్వెడార్ 2-0 గోల్స్ తో అలవోక విజయంతో పూర్తిపాయింట్లు సాధించింది.

ఆతిథ్యదేశం హోదాలో తొలిసారిగా ప్రపంచకప్ బరిలో నిలిచిన ఖతర్ తన ప్రత్యర్థి ఈక్వడార్ కు ఏమాత్రం సరిజోడీ కాలేకపోయింది. ఆట మొదటి భాగంలోనే లభించిన పెనాల్టీని కెప్టెన్ వలెన్షియా గోలుగా మలచడంతో ఈక్వెడార్ 1-0 ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత మరో గోలును సైతం 33 ఏళ్ల వెటరన్ స్టార్ వలెన్షియానే కళ్లు చెదిరే హెడ్డర్ గోలుతో తనజట్టు ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు.

ఆట మొదటి భాగానికే 2-0తో పైచేయి సాధించిన ఈక్వెడార్ రెండో భాగంలో డిఫెన్స్ కే ప్రాధాన్యమిచ్చింది. చివరకు 2-0 గోల్స్ తో విజేతగా నిలవడంతో పాటు 3 పాయింట్లు సాధించింది.

2006 ప్రపంచకప్ టోర్నీలో అత్యుత్తమంగా ప్రీ-క్వార్టర్స్ చేరిన ఈక్వెడార్ ప్రస్తుత టోర్నీలో తొలిగెలుపుతో గ్రూప్- ఏ టాపర్ గా నిలిచింది. ఈరోజు జరిగే పోటీలలో ఇరాన్ తో ఇంగ్లండ్, నెదర్లాండ్స్ తో అమెరికాజట్లు తలపడతాయి.

Tags:    
Advertisement

Similar News